పంచాయతీలకు నిధుల వరద
విజయనగరం మున్సిపాలిటీ న్యూస్‌లైన్ : జిల్లాలోని పంచాయతీలకు నిధుల వరద పారింది. గత ఏడాది జిల్లాలో 921 పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించగా, పాలకవర్గాలు కొలువుదీరాయి. అదే ఏడాది అక్టోబర్ నెలలో వివిధ గ్రాంట్‌ల కింద రూ 16 కోట్ల 95 లక్షల 88 వేల 118 విడుదల కాగా...2014-15 ఆర్థిక సంవత్సరంలో 13వ ఆర్థిక సంఘం నిధులు కింద మరో రూ13 కోట్ల 6 లక్షల ఒక వెయ్యి 700 ఈ నెల మొదటి వారంలో విడుదలైనట్టు జిల్లా ఇన్‌చార్జి పంచాయతీ అధికారి మోహనరావు ‘న్యూస్‌లైన్’కు తెలిపారు. విడుదలైన నిధులను జిల్లాలోని పంచాయతీలకు 2011 సంవత్సర జనాభా లెక్క ల ఆధారంగా కేటాయించి, జిల్లా ట్రెజరీ ద్వారా మండల ట్రెజరీల్లో జమ చేసినట్టు పేర్కొన్నారు. ఈ నిధులను పంచాయతీల్లో పారిశుద్ధ్య నిర్వహణ, తాగునీటి సమస్య పరిష్కారం, రహదారుల నిర్మాణం, మరమ్మతు పనులు, విద్యుద్దీకరణ, రక్షిత పథకాల మరమ్మతులు, కాలువల నిర్వహణకు వినియోగించుకునేందుకు అవకాశం ఉంటుంది. రాష్ట్ర ఆర్థిక సంఘం నిధులు కింద ఈనెల 26న మరో రూ10 కోట్ల 10 లక్షల నిధులు విడుదల కాగా, వచ్చే నెల 2లోగా వాటిని పంచాయతీలకు కేటాయించ నున్నట్టు జిల్లా పంచాయతీ కార్యాలయ ఉద్యోగులు పేర్కొన్నారు.
77 గిరిజన పంచాయతీలకు
రూ 46.20 లక్షలు విడుదల ః
జిల్లాలోని 77 గిరిజన గ్రామాల అభివృద్ధికి సబ్ ప్లాన్ నిధులు కింద రూ 46. 20 లక్షల విడుదలయ్యాయి. ఒక్కొక్క పంచాయతీకి రూ 60వేలు చొప్పున కేటాయించారు. ఈ నిధులు వినియోగంపై ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు రావలసి ఉంది. గతంలో ఇదే పద్దు కింద మంజూరు చేసిన నిధులను ఆయా పంచాయతీల్లో పారిశుద్ధ్య నిర్వహణ, తాగునీటి సమస్య పరిష్కారం, విద్యుద్దీకరణ, రక్షిత పథకాల మరమ్మతులు, కాలువల నిర్వహణకు వినియోగించగా... అదే తరహాలో గ్రామ పంచాయతీ తీర్మానం మేరకు ఈ నిధులు వినియోగించాల్సి ఉంటుంది
అభివృద్ధి ఎక్కడ ?
పంచాయతీ పాలకవర్గాలు కొలువుదీరి ఏడాది సమయం కాకముందే వివిధ గ్రాంట్‌ల కింద కోట్లాది రూపాయలు విడుదల కావడం శుభపరిణా మమే అయినప్పటికీ అవి ఎంతవరకు సద్వినియోగం అవుతున్నాయన్నది ప్రశ్నార్థకంగా మారింది. గత ఏడాది అక్టోబర్ నెలలో 13వ ఆర్థిక సంఘం, రాష్ట్ర ఆర్థిక సంఘం, వృత్తిపన్నుల ఆదాయం, తలసరి గ్రాంట్‌ల కింద రూ 16కోట్ల 95లక్షల 88వేల 118 విడుదలయ్యాయి. ఈ నిధులతో ఎంతో అభివృద్ధి జరగాల్సి ఉన్నప్పటికీ.. ఆ పరిస్థితి లేదు. ఇకనైనా అధికారులు స్పందించి నిధులు వినియోగంపై ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.