‘వంద రోజుల’ గుబులు
- పల్లెల్లో పారిశుద్ద్య ప్రణాళిక ‘పంచాయ(యి)తీ’
- సెలవులు తీసుకోవద్దని మెసేజ్‌లు
- నిధుల్లేక తలలు పట్టుకుంటున్న అధికారులు
అసలే నిధుల లేమితో నీరసించి పోతున్న పంచాయతీలకు ‘వందరోజుల కార్యాచరణ ప్రణాళిక’ మూలిగే నక్కపై తాటికాయ పడిన చందంగా మారిందనే విమర్శలు వెల్లువెత్తు తున్నాయి. ప్రణాళిక అమలుకు చంద్రబాబు ప్రభుత్వం పైసా విదల్చకుండా... ఉన్నతాధికారులకు ‘టార్గెట్’ పెట్టడం వారిని తీవ్ర గందర గోళానికి గురిచేస్తుంది.
మచిలీపట్నం : పంచాయతీలు నిధుల లేమితో కొట్టుమిట్టాడుతుంటే... నూతన ప్రభుత్వం వంద రోజుల పారిశుద్ధ్య ప్రణాళికను 1వ తేదీ నుంచి అమలు చేస్తోంది. ఈ ప్రణాళికలో భాగంగా తాగునీటి వసతి మెరుగుదల, ఓవర్‌హెడ్ ట్యాంకుల క్లీనింగ్, పంచాయతీ, శివారు గ్రామాల్లో చెత్తా, చెదారం తొలగింపు, తాగునీటి పైప్‌లైన్ల రిపేరు, దోమల నివారణకు యాంటీ లార్వా పిచికారీ, డ్రెయినేజీల్లో పూడికతీత తదితర పనులు చేయాల్సి ఉంది.
ఈ మేరకు ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు అన్ని పంచాయతీలకు అందాయి. మేజర్ పంచాయతీలతో పాటు మైనర్ పంచాయతీల్లోనూ నిధుల కొరత వేధిస్తుండటంతో పంచాయతీ కార్యదర్శులు ఇన్ని పనులు నిధులు లేకుండా ఎలా చేయాలని తలలు పట్టుకుంటున్నారు. ఏడాది క్రితం పంచాయతీ పాలకవర్గాలు ఏర్పడ్డాయి. 2013-14 ఆర్ధిక సంవత్సరంలో 13వ ఆర్థిక సంఘం రూ. 18.14 కోట్లు, స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ నిధులు రూ. 1.69 కోట్లు ఈ ఏడాది మే నెలలో విడుదలయ్యాయి.
నూతనంగా ఏర్పడిన పంచాయతీ పాలకవర్గాలు ఈ నిధులను వివిధ పనులకు కేటాయించేశారు. ఉన్న కొద్దిపాటి నిధులను పంచాయతీల్లోని వివిధ అవసరాలకు వినియోగించేందుకు ఉంచారు. నూతన ప్రభుత్వం వంద రోజుల ప్రణాళికను కచ్చితంగా అమలు చేయాలని హుకుం జారీ చేసింది. ఇందుకోసం పంచాయతీ కార్యదర్శులు, సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులకు ఒక రోజు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. పంచాయతీల్లో నిధుల లభ్యత లేకుండా 100 రోజుల ప్రణాళిక ఎలా అమలు చేయాలనే అంశం ప్రశ్నార్థకంగా మారింది.
నేడు, రేపు సెలవులు లేవు
ఆగస్టు 9, 10 తేదీల్లో శని, ఆదివారాలు వచ్చాయి. 9వ తేదీ రెండో శనివారం కాగా, 10వ తేదీ ఆదివారం వచ్చింది. ఈ రెండు రోజుల పాటు ప్రభుత్వ కార్యాలయాలకు, పంచాయతీ కార్యాలయాలకు సెలవు పాటించాలి. అయితే వంద రోజుల ప్రణాళిక అమలులో భాగంగా ఈ రెండు రోజుల పాటు కచ్చితంగా పంచాయతీ కార్యాలయాలు తెరిచే ఉంచాలని డీపీవో నుంచి పంచాయతీ కార్యదర్శులకు సెల్‌ఫోన్ ద్వారా మెసేజ్‌లు అందాయి.