రేటు కార్డులను విడుదల చేసిన జియో స్టార్
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ, ఐపీఎల్ 2025 ద్వారా రూ.6,000 కోట్ల వరకు ప్రకటనల ఆదాయాన్ని ఆర్జించాలని రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు చెందిన మీడియా పార్ట్‌నర్ జియో స్టార్ లక్ష్యంగా నిర్ణయించుకుంది. ఇందులో ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి రూ.1,500 కోట్లు, ఐపీఎల్ నుంచి రూ.4,500 కోట్లు సంపాదించాలని యోచిస్తోంది.
ముందుగా ఛాంపియన్స్ ట్రోఫీకి ప్రాధాన్యత
కంపెనీ నిర్ణయించుకున్న టార్గెట్ చేరుకోవడానికి ఛాంపియన్స్ ట్రోఫీ కోసం జియో స్టార్ ఇప్పటికే వివరణాత్మక ప్రకటన రేటు కార్డులను విడుదల చేసింది. ఐపీఎల్ ప్రకటన రేట్ల కోసం త్వరలో చర్చలు జరుగుతాయని కంపెనీ తెలిపింది. జియో స్టార్ యాడ్ సేల్స్ టీమ్ ముందుగా ఛాంపియన్స్ ట్రోఫీ ఇన్వెంటరీకి ప్రాధాన్యత ఇస్తూ, ప్రకటనదారులతో ఒప్పందాలను పొందేందుకు పని చేస్తున్నట్లు పేర్కొంది.
ఆఫర్ చేస్తున్న ధరలు ఇలా..
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫిబ్రవరి 19 నుంచి మార్చి 9 వరకు, ఐపీఎల్ 2025 మార్చి 23 నుంచి మే 25 వరకు జరగనున్నాయి. ఛాంపియన్స్ ట్రోఫీ కోసం జియో స్టార్ కో-ప్రెజెంటింగ్ స్పాన్సర్షిప్ కోసం రూ.55 కోట్లు, అసోసియేట్ స్పాన్సర్షిప్ కోసం రూ.44 కోట్లు, పార్ట్నర్ స్పాన్సర్ల నుంచి రూ.28 కోట్లు కోరుతోంది. భారత్ మ్యాచ్‌లకు టీవీ స్పాట్ రేట్ 10 సెకన్లకు రూ.28 లక్షలుగా నిర్ణయించారు. డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లో జియో స్టార్ కో-ప్రెజెంటింగ్ స్పాన్సర్ల నుంచి రూ.55 కోట్లు, పవర్ బై స్పాన్సర్ల నుంచి రూ.45 కోట్లు, అసోసియేట్ స్పాన్సర్ల నుంచి రూ.25 కోట్లు వసూలు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.
ఇదీ చదవండి: ఏడాదిలో రికార్డు స్థాయిలో ఐఫోన్ ఎగుమతులు
ఆచితూచి వ్యవహరిస్తున్న ఎఫ్‌ఎంసీజీ కంపెనీలు
యాడ్ మార్కెట్‌లో ప్రస్తుతం కొంత మందగమనం ఉన్నప్పటికీ, తన ఆదాయ లక్ష్యాలను చేరుకోవడంపై జియో స్టార్ ఆశాజనకంగా ఉంది. ఫైనాన్షియల్ సర్వీసెస్, ఆటోమొబైల్స్ వంటి రంగాలు వృద్ధి అవకాశాలను చూపిస్తున్నాయి. దాంతో ఆయా కంపెనీలు యాడ్‌ల కోసం ఖర్చు చేస్తాయని జియో స్టార్ భావిస్తుంది. అయితే భారీగా టీవీ ప్రకటనలకు దోహదం చేసే ఎఫ్ఎంసీజీ కంపెనీలు ఈ విభాగంలో చేసే ఖర్చులపై ఆచితూచి వ్యవహరిస్తున్నాయి. స్టార్ ఇండియా, వయాకామ్ 18ల విలీనం వల్ల జియో స్టార్ యాడ్ మార్కెట్ పెరిగినట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment