సంగారెడ్డి రూరల్: ప్రజల భాగస్వామ్యంతోనే స్వచ్ఛ భారత్ అభియాన్ సాధ్యమవుతుందని కలెక్టర్ రాహుల్ బొజ్జా పేర్కొన్నారు. గాంధీ జయంతిని పురస్కరించుకొని సంగారెడ్డి మండలం నాగాపూర్‌లో సర్పంచ్ కటకం రాజు అధ్యక్షతన గురువారం జరిగిన స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధితోనే దేశాభివృద్ధి సాధ్యమని మహాత్మాగాంధీ పేర్కొన్నారన్నారు. దేశంలోని గ్రామాలన్నీ పరిశుభ్రమైన గ్రామాలుగా మారాలనే సంకల్పంతో ప్రధాని నరేంద్రమోడీ స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని ప్రారంభించారన్నారు.
వ్యక్తిగత శుభ్రతతో పాటు, పరిసరాలు , గ్రామాల శుభ్రతకు కృషిచేయాలని సూచించారు. పారిశుద్ధ్య లోపంతో అనారోగ్యానికి గురైతే డబ్బు వృధా అవుతుందన్నారు. గ్రామాల్లో పారిశుద్ధ్యం సక్రమంగా లేకపోవడం వల్ల అనేక సమస్యలు తలెత్తుతాయన్నారు. ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ప్రత్యేకంగా గ్రామాలను అభివృద్ధి చేసుకోవాలన్నారు. స్వచ్ఛ భారత్ సాధన కోసం ప్రతి ఒక్కరు ఏడాదికి వంద గంటలు, వారానికి రెండు గంటలు శ్రమదానం చేయాలని పిలుపునిచ్చారు. నాబార్డ్ సీజీఎం జీజీ మెమన్ మాట్లాడుతూ నాబార్డ్ ఆధ్వర్యంలో జిల్లాలో వర్మి కంపోస్ట్ ప్రాజెక్ట్‌ను, డెయిరీ, బయోగ్యాస్ ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నామన్నారు.
అంతకు ముందు కలెక్టర్, ఎమ్మెల్యే,తదితరులు మహాత్మాగాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం గ్రామంలోని వీధులను శుభ్రం చేశారు. కార్యక్రమంలో ఆర్డీఓ మధుకర్‌రెడ్డి, డీఆర్‌డీఏ పీపీ రవీందర్‌రెడ్డి, డీపీఓ ప్రభాకర్‌రెడ్డి, నాబార్డ్ జీఎం కిషన్ సింగ్, డీజీఎం షెవుడే, డీడీఎం రమేష్, తహాశీల్దార్ గోవర్థన్, ఎంపీడీఓ సరళ, ఈఓపీఆర్డీ సంధ్య, జెడ్పీటీసీ మనోహర్‌గౌడ్, ఎంపీటీసీ క్రిష్ణవేణి అశోక్‌గౌడ్‌తో పాటు వివిధశాఖల అధికారులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
స్వచ్ఛ భారత్ కోసం కృషి : భెల్ ఈడీ రవిచందర్
రామచంద్రాపురం: స్వచ్ఛ భారత్ కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని భెల్ ఈడీ రవిచందర్ పేర్కొన్నారు. గురువారం స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా భెల్ పరిశ్రమ ముఖధ్వారం నుంచి బుధవారం సంత వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం బుధవారం సంత ప్రాంగణాన్ని భెల్ ఈడీతో పాటు అధికారులు, కార్మికులు శుభ్రపరిచారు. అనంతరం రవిచందర్ మాట్లాడుతూ కార్మికులు ప్రతి శనివారం రెండు గంటలు పరిసరాలను శుభ్రపరిచేందుకు సమయం కేటాయించాలన్నారు. శ్రమదానం నిర్వహించి స్వచ్ఛ భారత్ సాధనకు కృషి చేయాలన్నారు.
ప్రజల భాగస్వామ్యంతోనే స్వచ్ఛ భారత్
Published Fri, Oct 3 2014 12:59 AM | Last Updated on Sat, Sep 2 2017 2:17 PM
Advertisement
Advertisement