సంగారెడ్డి అర్బన్: మెదక్ ఉప ఎన్నికల్లో పోలింగ్ శాతం పెంచేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. 95 శాతం పోలింగ్ సాధించే గ్రామాలకు రూ.2 లక్షలను నజరానా ఇస్తామని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి రాహుల్ బొజ్జా ప్రకటించారు. మంగళవారం కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, గత ఎన్నికల కంటే ఈ సారి పోలింగ్ శాతం పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. అందులో భాగంగా ఏ గ్రామంలో అయితే 95 శాతం పోలింగ్ నమోదవుతుందో ఆ గ్రామానికి కార్పొరేట్ సోషల్ రెస్పాన్‌బిలిటీ పథకం నుంచి రూ.2 లక్షలు అందజేస్తామని స్పష్టం చేశారు.
ఎన్నికలను ప్రశాంతంగా సజావుగా నిర్వహించడానికి ఎన్నికల ప్రవర్తనా నియమావళిని పటిష్టంగా అమలు చేస్తామన్నారు. ఇప్పటి వరకు రూ. 42.70 లక్షల నగదు, 4,324 లీటర్ల మద్యం స్వాధీనం చేసుకున్నట్లు ఆయన తెలిపారు. ఎన్నికల నిర్వహణ కోసం 4,213 మంది పోలీసు సిబ్బందిని ఉపయోగిస్తున్నామని చెప్పారు.
మెదక్ లోక్‌సభ పరిధిలో 1,817 పోలింగ్ కేంద్రాలుండగా, 407 పోలింగ్ కేంద్రాలను అత్యంత సమస్యాత్మకమైనవిగా, 744 కేంద్రాలను సమస్యాత్మకమైనవిగా గుర్తించామని చెప్పారు. ఉప ఎన్నిక విధుల్లో మొత్తం 9,086 మంది సిబ్బంది ఉంటారనీ, వీరందరికీ శిక్షణ కూడా ఇప్పించామన్నారు. ఎన్నికల శిక్షణ కార్యక్రమానికి హాజరు కాని 215 మందికి షోకాజ్ నోటీసులు జారీ చేశామని తెలిపారు. ఎన్నికల విధులను నిర్లక్ష్యం చేసిన వారి పట్ల కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
16న కౌంటింగ్
13న నిర్వహించే ఉప ఎన్నికకు లెక్కింపును 16వ తేదీ పటాన్‌చెరు మండలం రుద్రారంలోని గీతం విశ్వవిద్యాలయంలో నిర్వహిస్తున్నట్లు రాహుల్ బొజ్జా తెలిపారు. 16న ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుందని , ప్రతి అసెంబ్లీ నియోజక వర్గానికి 14 టేబుళ్ల చొప్పున 98 టేబుళ్లను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి దయానంద్ , ఎన్నికల పరిశీలకులు పాల్గొన్నారు.
పోలింగ్ పెరిగితే ప్రోత్సాహం
Published Tue, Sep 9 2014 11:38 PM | Last Updated on Mon, Sep 17 2018 6:08 PM
Advertisement
Advertisement