మెదక్: ఉప ఎన్నికలో పోలింగ్ శాతం భారీగా తగ్గడంతో వివిధ పార్టీల నేతలు విజయావకాశాలపై లెక్కలు వేసుకుంటున్నారు. మెదక్ అసెంబ్లీ నియోజకవర్గంలో మొత్తం 2,04,023 మంది ఓటర్లు ఉండగా, వారిలో 98851మంది పురుషులు కాగా, 1.05,166 మంది మహిళలు ఉన్నారు. వీరిలో 67802 మంది పురుషులు, 70573మంది మహిళలు, మొత్తం 1,38,375 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. రామాయంపేట మండలం శివ్వాయిపల్లిలో మొత్తం 464 మంది ఓటర్లలో 445 మంది ఓటు హక్కును వినియోగిం చుకోవడంతో 95.91 శాతం పోలింగ్ నమోదైంది. సాధారణ ఎన్నికలతో పోలిస్తే మొత్తం మీద 10 శాతం ఓటింగ్ తక్కువగా నమోదైంది.
ఉప ఎన్నికపై అనాసక్తి
సాధారణ ఎన్నికలు జరిగి నాలుగు నెలలే అయినందున మరో ఎన్నికలో పాల్గొనడానికి ఓటర్లు ఎక్కువగా ఆసక్తి చూపలేదని తెలుస్తోంది. జోరుగా నడుస్తున్న వ్యవసాయ పనులు కూడా మరో కారణంగా చెప్పుకోవచ్చు. వలస వెళ్లిన గ్రామీణులను పట్టణాల నుంచి తీసుకురావడానికి ఆయా రాజకీయ పార్టీలు సైతం ఆసక్తి చూపలేదు. ఈ క్రమంలో డబ్బు ఖర్చు చేసేందుకు పార్టీలు ముందుకు రాలేదు. ఇటీవల నిర్వహించిన ఇంటింటి సర్వేకు పట్టణాల్లో నివసించే వారంతా వచ్చినందున మరోసారి ఓటింగ్‌లో పాల్గొనేందుకు ఉత్సాహం చూపనట్లు తెలుస్తోంది. అలాగే త్వరలో బతుకమ్మ, దసరా, బక్రీద్ పండగలకు రావాల్సి ఉన్నందున ఎన్నికల కోసం వలస వెళ్లిన ప్రజలు గ్రామాలకు తరలిరావడానికి ఆసక్తి చూపలేదు.
గెలుపోటములపై ప్రభావం
తగ్గిన పోలింగ్ శాతం అభ్యర్థుల విజయావకాశాలపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది. ముఖ్యంగా మొదటి నుంచి గెలుపుపై ధీమాతో ఉన్న టీఆర్‌ఎస్ మెజార్టీ విషయమై కొంత ఆందోళనలో ఉన్నట్లు తెలుస్తోంది. తగ్గిన పోలింగ్ తమ మెజార్టీని తగ్గిస్తుందని వారు భావిస్తున్నారు. కాగా కాంగ్రెస్, బీజేపీలు పోలింగ్ శాతం తగ్గడంవల్ల తమకు కొంతమేర ప్రయోజనం కలిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నాయి. అయితే కొత్త జిల్లాల ఏర్పాటు ప్రకటన మెదక్ నియోజకవర్గంలో కొంతమేర ప్రభావం చూపింది.
పల్లెల్లో జోరు.. పట్టణంలో బేజారు..
సిద్దిపేట టౌన్: ఉప ఎన్నికలో భాగంగా సిద్దిపేట సెగ్మెంట్ పరిధిలో జరిగిన ఎన్నికలో పల్లెల్లో పోలింగ్ జోరుగా సాగింది. కాగా పట్టణ ప్రాంతంలో పోలింగ్ మందకొడిగా జరిగింది. సిద్దిపేట మున్సిపల్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పట్టణంలో 44 శాతం మంది ఓటర్లు ఓటింగ్‌కు దూరంగా ఉండడం ఆందోళన కలిగిస్తోంది. సిద్దిపేట పట్టణ కేంద్రంగా అన్ని రాజకీయ పార్టీలు ప్రచారాన్ని ధూంధాంగా నిర్వహించినప్పటికీ పోలింగ్ సరళి పార్టీలను బేజారెత్తించింది.
పోల్ చీటీలు సంపూర్ణంగా ఇళ్లకు చేరకపోవడం, పార్టీల నేతలు, కార్యకర్తలు ఇంటింటికి వెళ్లి ఓటు వేయాలని అభ్యర్థించకపోవడం కారణాలుగా భావిస్తున్నారు. అదే విధంగా గత ఎన్నికల్లో ఓటు వేస్తే తెలంగాణ వస్తుందనే ప్రచారం పట్టణ ఓటర్లను పోలింగ్ కేంద్రాలకు రప్పించింది. తాజాగా జరిగిన ఎన్నికల్లో పట్టణ ఓటర్లు ఆ స్ఫూర్తిని చూపలేదు. ఇటీవల నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వేలో ప్రదర్శించిన స్ఫూర్తిలో 50 శాతం ఓటింగ్‌లో పాల్గొనడానికి వచ్చిన ప్రజలు ప్రదర్శించకపోవడం విశేషం.
‘మెదక్’ ఫలితంపై సర్వత్రా ఉత్కంఠ!
Published Mon, Sep 15 2014 12:19 AM | Last Updated on Tue, Oct 16 2018 3:12 PM
Advertisement
Advertisement