సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: మెదక్ ఉప ఎన్నిక ఫలితం మంగళవారం వెలువడనుంది. ఓట్ల లెక్కింపునకు సంబంధించి రుద్రారంలోని గీతం యూనివర్సిటీలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉదయం 8 గంటలకు లెక్కింపు ప్రారంభమవుతుంది. మధ్యాహ్నం 1 గంటలోగా ఫలితం వెల్లడికానుంది. ఉపపోరులో ఏ పార్టీ విజయం సాధిస్తుందోనన్న ఉత్కంఠ నెలకొంది. అధికారం చేపట్టిన మూడు మాసాల్లోనే ఉప ఎన్నిక ఎదుర్కొంటున్న టీఆర్‌ఎస్.. ఈ ఫలితం సైతం తమకు అనుకూలంగా ఉంటుందని ధీమాగా ఉంది.
ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు, ఓటింగ్ సరళిని విశ్లేషించిన టీఆర్‌ఎస్ పార్టీ.. ఉపపోరులో భారీ మెజార్టీ దక్కటం ఖాయమని భావిస్తోంది. మెదక్ ఉప ఎన్నిక కీలకబాధ్యతలు చేపట్టిన మంత్రి హరీష్‌రావు ఓటింగ్ సరళిపై క్షేత్రస్థాయిలో నివేదికలు తెప్పించుకుని విశ్లేషించినట్లు సమాచారం. మెదక్ లోక్‌సభ పరిధిలో మొత్తం 67.79 శాతం పోలింగ్ జరిగిన నేపథ్యంలో 40 శాతం పోలింగ్ టీఆర్‌ఎస్‌కు అనుకూలంగా పడ్డాయని మంత్రి అంచనాకు వచ్చినట్లు తెలుస్తోంది. ఫలితంగా తాము అనుకున్న మెజార్టీ సాధించటం ఖాయమని టీఆర్‌ఎస్ గట్టి నమ్మకంతో ఉంది.
మెదక్ లోక్‌సభ పరిధిలోని ఏడు నియోజకవర్గాలకుగాను సిద్దిపేట, దుబ్బాక, గజ్వేల్ నియోజవకర్గాల్లోటీఆర్‌ఎస్‌కు భారీ మెజార్టీ రావటం ఖాయమని ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు. అలాగే సంగారెడ్డి, పటాన్‌చెరు, మెదక్‌లలో కాంగ్రెస్, బీజేపీలకంటే ఎక్కువ మొత్తంలోనే ఓట్లు సాధిస్తామని అంటున్నారు. నర్సాపూర్‌లో సైతం ఎక్కువ ఓట్లు వస్తాయని భావిస్తున్నారు. అయితే ఫలితాల సరళి ఎలా ఉంటుందో వేచి చూడాలి. ఇదిలా ఉంటే ఉపపోరులో గట్టిపోటీ ఇచ్చామని నమ్మకంతో ఉన్న బీజేపీ సైతం విజయం ఖాయమని భావిస్తోంది. ప్రభుత్వ వ్యతిరేక ఓటు, మోడీ హవా తమకు అనుకూలమని ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు.
ముఖ్యంగా యువత బీజేపీకి అండగా నిలవటంతోపాటు అభివృద్ధి నినాదం ప్రజల్లోకి బలంగా చొచ్చుకుపోయిందని, దీంతో తమకు విజయావకాశాలు ఉన్నాయని బీజేపీ ముఖ్యనేతలు చెబుతున్నారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ సైతం ఉప ఎన్నికలో విజయం తమదేనని చెబుతోంది. సాధారణ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు అవకాశం ఇచ్చిన ప్రజలు.. ఉపపోరులో తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్‌కు అండగా నిలబడతారన్న నమ్మకంతో ఉంది. సాంప్రదాయ ఓటు బ్యాంకు, మైనార్టీలు, ఎస్సీ,ఎస్టీ, బీసీ సామాజిక వర్గాలు తమకు ఓటు వేసినట్లు ఆ పార్టీ భావిస్తోంది. నర్సాపూర్, సంగారెడ్డి, మెదక్, పటాన్‌చెరు, దుబ్బాక నియోజకవర్గాల్లో తమకు అనుకూల ఓటింగ్ జరిగిందని, దీంతో తమ పార్టీ విజయం ఖాయమని కాంగ్రెస్ అభ్యర్థి సునీతారెడ్డి ధీమాగా ఉన్నారు.
మధ్యాహ్నం 1గంటలకు ఫలితం
మెదక్ ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు కోసం అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. పటాన్‌చెరు నియోజకవర్గంలోని రుద్రారం గ్రామంలో ఉన్న గీతం యూనివర్సిటీలో మెదక్ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు జరగనుంది. ఉదయం 8గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతంది. ఓట్ల లెక్కింపు కోసం ప్రతి నియోజకవర్గానికి 14 టేబుళ్లు ఏర్పాటు చేశారు. ప్రతి ఓట్ల లెక్కింపు కౌంటర్ వద్ద కౌంటింగ్ సూపర్‌వైజర్, కౌంటింగ్ అసిస్టెంట్లు, మైక్రో అబ్జర్వర్లు ఉంటారు. ఓట్ల లెక్కించేందుకు మొత్తం 121 మంది కౌంటింగ్ సూపర్‌వైజర్లు, 120 మంది కౌంటింగ్ అసిస్టెంట్లు, 144 మంది మైక్రో అబ్జర్వర్లను నియమించారు. ఓట్ల లెక్కింపు ఏర్పాట్లను కలెక్టర్ రాహుల్ బొజ్జా సోమవారం పరిశీలించారు.
గట్టి బందోబస్తు...
ఓట్ల లెక్కింపు నేపథ్యంలో గీతం యూనివర్సిటీ వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎస్పీ శెముషీ బాజ్‌పాయ్ భద్రతా ఏర్పాట్లను సోమవారం పరిశీలించారు. కౌంటింగ్ కేంద్రం వద్ద ఇద్దరు అదనపు ఎస్పీలు భద్రతను పర్యవేక్షించనున్నారు. బందోబస్తులో ఇద్దరు డీఎస్పీలు, 18 మంది సీఐలు, 33 మంది సీఐలు, 80 మంది ఎఎస్‌ఐలు, హెడ్‌కానిస్టేబుళ్లు, 270 మంది కానిస్టేబుళ్లు పాల్గొననున్నారు.
ఓటరు గుట్టు తేలేది నేడే
Published Mon, Sep 15 2014 11:09 PM | Last Updated on Tue, Oct 16 2018 3:09 PM
Advertisement