మెదక్, నందిగామ విజేతలెవరో?
Published Tue, Sep 16 2014 2:49 AM | Last Updated on Tue, Oct 16 2018 3:12 PM
14 రౌండ్లలో ఓట్ల లెక్కింపు.. కలెక్టర్ రాహుల్ బొజ్జా
సాక్షి, హైదరాబాద్: మెదక్ లోక్‌సభ ఉపఎన్నిక ఫలితం మంగళవారం తేలనుంది. పకడ్బందీగా ఓట్ల లెక్కింపును చేపడుతున్నట్టు,ఈ ప్రక్రియ 14 రౌండ్లలో పూర్తి అవుతుందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాహుల్ బొజ్జా తెలిపారు. మెదక్ జిల్లా పటాన్‌చెరు మండలంలోని గీతం విశ్వవిద్యాలయంలో ఆయన సోమవారం సిబ్బందికి లెక్కింపుపై అవగాహన కల్పించారు. లెక్కింపు ప్రక్రియను మైక్రో అబ్జర్వర్లు పరిశీలిస్తుంటారని తెలిపారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి 14 టేబుళ్ల చొప్పున ఏర్పాటు చేశామన్నారు. 121 మంది కౌంటింగ్ సూపర్‌వైజర్లు, 120 మంది కౌంటింగ్ అసిస్టెంట్ల్లు లెక్కింపులో పాల్గొంటారని ఆయన తెలిపారు. కౌంటింగ్ హాళ్లకు సెల్‌ఫోన్లను అనుమతించేదిలేదని ఆయన స్పష్టం చేశారు. కౌంటింగ్ ప్రక్రియలో పాల్గొనే ప్రతివారికి గుర్తింపు కార్డులను ఇచ్చామని ఆయన చెప్పారు.
నేడు నందిగామ ఉపఎన్నిక ఫలితాలు
నందిగామ: కృష్ణా జిల్లా నందిగామ నియోజకవర్గ ఓట్ల లెక్కింపు మంగళవారం జరుగనుంది. టీడీపీ ఎమ్మెల్యే తంగిరాల ప్రభాకర్ మరణంతో ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. ఆయన కుమార్తె సౌమ్య టీడీపీ అభ్యర్థిగా పోటీచేశారు. మానవీయ దృక్పథంతో, గత సంప్రదాయాలకు అనుగుణంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ అభ్యర్థిని నిలుపలేదు. కాంగ్రెస్ అభ్యర్థి బోడపాటి బాబూరావు పోటీలో ఉన్నప్పటికీ నామమాత్రమే.
Advertisement