సర్వం సిద్ధం
గజ్వేల్: గజ్వేల్ నియోజకవర్గ అభివృద్ధిపై ముఖ్యమంత్రి చేపట్టనున్న సమీక్షకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. జగదేవ్‌పూర్ మండలం ఎర్రవల్లిలోని తన ఫాంహౌస్ వేదికగా సీఎం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుండగా అధికారులు నివేదికలతో సిద్దమయ్యారు. సీఎం సమీక్ష నేపథ్యంలో ఈనెల 27న గజ్వేల్‌లోని శ్రీలక్ష్మీ గార్డెన్స్‌లో కలెక్టర్ రాహుల్ బొజ్జా జిల్లాలోని వివిధ శాఖల అధికారులు, నియోజకవర్గస్థాయి అధికారులతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు.
సీఎం సమీక్షకు వాస్తవ నివేదికలతో రావాలని, ఈ విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం ప్రదర్శించినా సహిం చేది లేదని హెచ్చరికలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో అధికారులు రెండ్రోజులుగా ఈ పనిలో నిమగ్నమై నివేదికలు తయారు చేశారు. గజ్వేల్‌లో సాగుతున్న పథకాల అమలు తీరుపై సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించడం ఇది రెండోసారి. జూన్ 4న గజ్వేల్‌లో నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొన్న కేసీఆర్, ఆ తర్వాత పట్టణంలోని ప్రజ్ఞా గార్డెన్స్‌లో అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. అదివారం సైతం అదే తరహాలో సమీక్షకు సిద్ధమవుతున్నారు. ఈ సమీక్షలో ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి మొదలుకొని వివిధ శాఖల రాష్ట్ర, జిల్లా ఉన్నతాధికారులు, గజ్వేల్ నియోజకవర్గ అధికారులతోపాటు నియోజకవర్గంలోని ఆయా మండలాలకు చెందిన ప్రజాప్రతినిధులు సైతం పాల్గొంటుండడం విశేషం.
గజ్వేల్ నియోజకవర్గ ప్రజల అవసరాలపై సీఎం కేసీఆర్ అంశాల వారీగా సమీక్ష చేయనున్నారు. ఈ సందర్భంగా ప్రజాప్రతినిధుల అభిప్రాయాలను సైతం సేకరించి అభివృద్ధి ప్రణాళికలకు ఆమోద ముద్ర వేయనున్నట్లు తెలుస్తోంది. గజ్వేల్ నగర పంచాయతీని తెలంగాణలోనే మోడల్ మున్సిపాలిటీగా తీర్చిదిద్దనున్న నేపథ్యంలో ఈ సమీక్షలో ప్రత్యేకంగా చర్చించనున్నారు. ఇప్పటికే ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా నగర పంచాయతీకి రూ.90 కోట్లతో రింగ్ రోడ్డు, రూ.60 కోట్లతో గోదావరి సుజల స్రవంతి పైప్‌లైన్ నుంచి శాశ్వత మంచినీటి పథకాన్ని మంజూరు చేసిన సీఎం, తాజా సమీక్షలో నియోజకవర్గానికి మరిన్ని వరాలు కురిపించే అవకాశముంది.
ఏర్పాట్లను పరిశీలించిన అధికారులు
సమీక్ష సమావేశం కోసం ఎర్రవల్లిలోని కేసీఆర్ ఫాంహౌస్‌లో జరుగుతున్న ఏర్పాట్లను శనివారం ‘గడా’ (గజ్వేల్ ఏరియా డెవలప్‌మెంట్ అథారిటీ) ఓఎస్‌డీ హన్మంతరావు, సిద్దిపేట ఆర్‌డీఓ ముత్యంరెడ్డి, జిల్లా అదనపు ఎస్పీ రవీందర్‌రెడ్డి, సిద్దిపేట డీఎస్పీ శ్రీధర్‌లు పరిశీలించారు. ఫాంహౌస్ ఆవరణలో సుమారు 400 మంది కూర్చునేందుకు వీలుగా టెంట్ వేశారు. సమీక్షలో సీఎం కేసీఆర్ మధ్యాహ్నం ఒంటి గంట తర్వాత పాల్గొననున్నారు.