గజ్వేల్, న్యూస్‌లైన్: గజ్వేల్ నియోజకవర్గం దశ మార్చి చూపుతానని టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ హామీ ఇచ్చారు. శుక్రవారం రాత్రి ఆయన గజ్వేల్‌లోని పిడిచెడ్ రోడ్డువైపున గల మైదానంలో ‘మెతుకు సీమ గర్జన’ పేరిట నిర్వహించిన ఎన్నికల ప్రచార సభకు హాజరై ప్రసంగించారు. టీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత గజ్వేల్ వాసులకు ఏ ఇబ్బంది ఉండదన్నారు. తాను ఇదే నియోజకవర్గంలోని ఎర్రవల్లిలో పొలం దగ్గర వ్యవసాయం చేసుకుంటే... ప్రభుత్వమే ఈ ప్రాంతానికి దిగి వచ్చి ఏం కావాలో అది చేసి పెడుతుందన్నారు.
ఈ ప్రాంతంలో కూరగాయలు విరివిగా సాగుతున్నందున ఇజ్రాయిల్ టెక్నాలజీతో చేపట్టనున్న ‘గ్రీన్ హౌస్ కల్టివేషన్’ కార్యక్రమానికి ఇక్కడి నుంచే శ్రీకారం చుడతానన్నారు. ప్రతి గ్రామంలో 40-50 ఎకరాల్లో 80 శాతం సబ్సీడీపై ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి ప్రతి రైతును లక్షాధికారిని చేస్తానన్నారు. సికింద్రాబాద్-మనోహరాబాద్-సిద్దిపేట రైల్వేలైన్ పూర్తి చేయిస్తానని హామీ ఇచ్చారు. కరీంనగర్ జిల్లా మిడ్‌మానేరు నీటిని సిద్దిపేట మీదుగా జిల్లాకు తీసుకువస్తానన్నారు. గజ్వేల్ నియోజకవర్గంలోని బూర్గుపల్లి-తిప్పారం, వర్గల్ మండలం పాములపర్తి గ్రామాల్లో రిజర్వాయర్‌ల నిర్మాణం చేపట్టి నియోజకవర్గంలోని 2.5లక్షల ఎకరాలకు మిడ్‌మానేరు ద్వారా సాగునీరందిస్తానని చెప్పారు.
గజ్వేల్‌లో రోడ్లు ఏమాత్రం బాగాలేవని, పట్టణంలో ట్రాఫిక్ జామయితే ఈ కొసకోడు ఇటే...ఆ కొసకోడు అటే అన్నట్లు తయారైందన్నారు. ఈ దుస్థితిని మార్చడానికి పట్టణంలో రింగ్ రోడ్డు నిర్మాణం చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. అంతకుముందు ‘మీ ఆశీస్సులు కోరి వచ్చినా...గెలిపించండి’ అంటూ కోరారు.
ఇంకా ఈ సభలో టీఆర్‌ఎస్ శాససభాపక్ష నేత ఈటేల రాజేందర్, టీఆర్‌ఎస్ అగ్రనేత హరీష్‌రావు, ఆ పార్టీ జిల్లా అధ్యక్షులు ఆర్. సత్యనారాయణ, జిల్లా ఇన్‌చార్జి రాజయ్యయాదవ్, ఎమ్మెల్సీ పాతూరి సుధాకర్‌రెడ్డి, జిల్లాలోని వివిధ నియోజకవర్గాల అభ్యర్థులు పద్మా దేవేందర్‌రెడ్డి, సోలిపేట రామలింగారెడ్డి, గూడెం మహిపాల్‌రెడ్డి, పొలిట్‌బ్యూరో సభ్యులు రమణాచారి, ఎర్రోళ్ల శ్రీనివాస్, టీఆర్‌ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇన్‌చార్జి మడుపు భూంరెడ్డి, నాయకులు ఎలక్షన్‌రెడ్డి, డాక్టర్ యాదవరెడ్డి, టీఆర్‌ఎస్వీ జిల్లా అధ్యక్షులు మాదాసు శ్రీనివాస్, తెలంగాణ బహుజన శక్తి రాష్ట్ర అధ్యక్షులు దేవీ రవీందర్, నాయకులు గాడిపల్లి భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.
టీఆర్‌ఎస్‌లో పలువురి చేరిక
గజ్వేల్‌రూరల్: గజ్వేల్‌లో శుక్రవారం రాత్రి టీఆర్‌ఎస్ అధ్వర్యంలో నిర్వహించిన ‘మెతుకుసీమ’ గర్జన ఎన్నికల ప్రచారసభలో పలువురు నేతలు టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ సమక్షంలో గులాబీదళంలో చేరారు. పార్టీలో చేరిన వారిలో టీడీపీ మైనార్టీ సెల్ రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి ఎంఏ హకీమ్, మాజీ కౌన్సిలర్ సుభాన్, గజ్వేల్‌కు చెందిన పలువురు నాయకులు ఉన్నారు. ఈ సందర్భంలోనే పలువురు నేతలు కేసీఆర్‌కు జ్ఞాపికలను అందించారు.
ప్రభుత్వాన్నే గజ్వేల్‌కు రప్పిస్తా
Published Fri, Apr 18 2014 11:51 PM | Last Updated on Wed, Aug 15 2018 9:06 PM
Advertisement
Advertisement