గజ్వేల్, న్యూస్‌లైన్: గజ్వేల్‌లో శుక్రవారం నిర్వహించనున్న కేసీఆర్ సభను సక్సెస్ చేసేందుకు గులాబీదళం తీవ్రంగా శ్రమిస్తోంది. జనసమీకరణ ద్వారా తమ సత్తా చాటాలని ఉవ్విళ్లూరుతున్న టీఆర్‌ఎస్ నాయకులు గజ్వేల్, సిద్దిపేట, దుబ్బాక, నర్సాపూర్, సంగారెడ్డి, పటాన్‌చెరు, మెదక్ ల నుంచి భారీగా జనాన్ని తరలించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. గజ్వేల్‌లోని పిడిచెడ్ రోడ్ వైపు గల అన్నపూర్ణ రైసుమిల్లు సమీపంలోని మైదానంలో శుక్రవారం సాయంత్రం 5 గంటలకు నిర్వహించనున్న ఈ సభ ఏర్పాట్లన్నీ దాదాపు పూర్తయ్యాయి. కేసీఆర్ హెలికాప్టర్‌లో ఇక్కడికి రానుండడంతో పార్టీశ్రేణులు హెలీప్యాడ్‌ను సైతం సిద్ధం చేశారు.
సభలో జిల్లాలోని అన్ని నియోజకవర్గాలకు చెందిన ఎంపీ, ఎమ్మెల్యేల అభ్యర్థులు పాల్గొంటున్నందున టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు సత్యనారాయణ, సిద్దిపేట మున్సిపల్ మాజీ చైర్మన్ రాజనర్సు, గజ్వేల్ నాయకులు గాడిపల్లి భాస్కర్, పండరి రవీందర్‌రావు తదితరులు ఏర్పాట్లను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. టీఆర్‌ఎస్ ముఖ్య నాయకులు, మహిళలు, ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా కోసం ప్రత్యేక బారికేడ్లను ఏర్పాటు చేశారు. గురువారం ఏర్పాట్లను పరిశీలించిన సత్యనారాయణ అనంతరం విలేకరులతో మాట్లాడారు. గజ్వేల్‌లో నిర్వహించనున్న ఎన్నికల ప్రచారసభ పార్టీ వైభవాన్ని చాటుతుందన్నారు.
తెలంగాణ పునర్నిర్మాణ బాధ్యతలను తన భుజస్కందాలపై వేసుకున్న కేసీఆర్ ప్రభావం జిల్లాలో తప్పకుండా కనిపిస్తుందన్నారు. ఈ సభ ద్వారా జిల్లాలోని పది అసెంబ్లీ స్థానాల్లో టీఆర్‌ఎస్ గెలుపు ఖాయం కానుందని ధీమా వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీలు పాతూరి సుధాకర్‌రెడ్డి, మహమూద్ అలీ, పార్టీ జిల్లా ఇన్‌చార్జి రాజయ్యయాదవ్, గజ్వేల్ నియోజకవర్గ ఇన్‌చార్జి మడుపు భూంరెడ్డి, గజ్వేల్ ఎన్నికల సమన్వయకర్త కొత్త ప్రభాకర్‌రెడ్డి, టీఆర్‌ఎస్వీ జిల్లా అధ్యక్షుడు మాదాసు శ్రీనివాస్‌లు సభా ఏర్పాట్లు, జనసమీకరణను వేర్వేరుగా సమీక్షిస్తున్నారు.
నేడు గజ్వేల్‌లో కేసీఆర్ సభ
Published Fri, Apr 18 2014 12:21 AM | Last Updated on Wed, Aug 15 2018 8:58 PM
Advertisement