గజ్వేల్, న్యూస్‌లైన్: తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంలో జరుగుతున్న ఈ సాధారణ ఎన్నికలు చారిత్రాత్మకమని టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ పేర్కొన్నారు. బుధవారం ఆయన గజ్వేల్‌లో అసెంబ్లీ స్థానానికి నామినేషన్ వేయడానికి హెలికాప్టర్‌లో వచ్చారు. స్థానిక తహశీల్దార్ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేసిన అనంతరం ప్రజ్ఞా గార్డెన్స్‌లో ఏర్పాటుచేసిన చేసిన సభలో నియోజకవర్గానికి చెందిన నాయకుడు పొన్నాల రఘుపతిరావు, టీడీపీ ఎస్సీసెల్ ఉపాధ్యక్షులు నంది దుర్గయ్య తదితరులు కేసీఆర్ సమక్షంలో టీఆర్‌ఎస్ తీర్థం పుచ్చుకున్నారు.
ఈ సందర్భంగా కేసీఆర్ ప్రసంగిస్తూ 1969లో చేసిన ప్రత్యేక రాష్ట్ర పోరాటంతో పాలకులు బుద్ది తెచ్చుకోకపోవడంతోనే మలి విడత ఉద్యమం వచ్చిందన్నారు. తెలంగాణ బాష, యాస, సంస్కృతిని సినిమాల్లో అవమానపరిచారని ఆవేదన వ్యక్తం చేశారు. 1996లో తానూ నిర్మల్ ఉప ఎన్నికకు వెళ్లి వస్తూ శ్రీరామ్‌సాగర్ కట్టపై కూర్చున్న సందర్భంలో కట్టపై గజం లోతు గుంతలు కనిపించాయని, ఎవరు పట్టించుకోకపోవడం వల్ల అది ఓ పోరంబోకు ప్రాజెక్ట్‌గా మారిపోయి ఆందోళన కలిగించిందని చెప్పారు. తన ఆరోగ్యం సహకరిస్తే తెలంగాణ ఉద్యమానికి నేతృత్వం వహిస్తానని అదే కట్టపై 30 మంది మిత్రులతో ప్రతిన బూనినట్లు గుర్తుచేసుకున్నారు. ఇదే క్రమంలో టీఆర్‌ఎస్‌ను స్థాపించానని వెల్లడించారు. టీఆర్‌ఎస్ ఆవిర్భావం తర్వాత ‘అదో ఓ పార్టీయా? మఘలో పుట్టింది....పుబ్బలో బందయితది’ అని ఎంతోమంది మిత్రులు ఎద్దేవా చేశారని చెప్పారు. అయినా ఏనాడూ నిరుత్సాహపడకుండా తెలంగాణ కోసం కోట్లాడనని అభిప్రాయపడ్డారు.
ఎన్నో పోరాటాల ఫలితంగా సాధించుకున్న తెలంగాణను అన్ని రంగాల్లో అభివృద్ది చేసుకోవాల్సిన అవసరమేర్పడిందన్నారు. ఈ ఎన్నికల్లో ఇచ్చే తీర్పే రేపటి భవితకు బంగారు బాటవుతుందని పేర్కొన్నారు. సిద్దిపేట డివిజన్‌కు చెందిన తానూ పూర్తి ఇక్కడి మనిషినేనని చెప్పారు. తానూ పోటీ చేస్తున్న గజ్వేల్ నియోజకవర్గంతోపాటు డివిజన్ పరిధిలోని సిద్దిపేట, దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారిస్తానన్నారు. కరీంనగర్ జిల్లా మిడ్‌మానేరు నుంచి ఎత్తిపోతల పథకాన్ని రూపొందించి ఈ మూడు నియోజకవర్గాల్లో 6 లక్షల ఎకరాలకు సాగునీరందిస్తామని హామీ ఇచ్చారు.
నామినేషన్ కార్యక్రమానికి తరలి వచ్చిన కార్యకర్తలు
గజ్వేల్‌లో బుధవారం కేసీఆర్ నామినేషన్ దాఖలు కార్యక్రమానికి నియోజకవర్గంలోని గజ్వేల్‌తోపాటు తూప్రాన్, ములుగు, వర్గల్, జగదేవ్‌పూర్, కొండపాక మండలాల నుంచి నాయకులు, కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. పట్టణంలోని మహతి పాఠశాల సమీపంలో ఏర్పాటుచేసిన హెలిపాడ్ స్థలంలో టీఆర్‌ఎస్ అధినేత రాక కోసం టీఆర్‌ఎస్ నేత, మాజీ డీజీపీ పేర్వారం రాములు, నాయకుడు రమణాచారి, టీఆర్‌ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇన్‌చార్జి మడుపు భూంరెడ్డి, నాయకులు ఎలక్షన్‌రెడ్డి, జహంగీర్, రఘుపతిరావు, డాక్టర్ యాదవరెడ్డి, గాడిపల్లి భాస్కర్, చెట్టి సురేష్‌గౌడ్, టీఆర్‌ఎస్వీ జిల్లా మదాసు శ్రీనివాస్ తదితరులు వేచివున్నారు. కేసీఆర్ రాగానే మహిళలు తిలకం దిద్ది మంగళహారతులతో స్వాగతం పలికారు. అక్కడి నుంచి కారులో స్థానిక తహశీల్దార్ కార్యాలయానికి కేసీఆర్ చేరుకున్నారు. మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ లక్ష్మీకాంతారావుతోపాటు మరో ముగ్గురు, కేసీఆర్ లోపలికి వెళ్లి నామినేషన్ దాఖలు చేశారు.
ఈ ఎన్నికలు చారిత్రాత్మకం
Published Wed, Apr 9 2014 11:57 PM | Last Updated on Wed, Aug 15 2018 9:17 PM
Advertisement
Advertisement