అందరి దృష్టి గజ్వేల్‌పైనే
గజ్వేల్, న్యూస్‌లైన్: హాట్ టాపిక్‌గా మారిన గజ్వేల్ అసెంబ్లీ నియోజకవర్గ ఎన్నికల ఫలితాలపై క్షణక్షణం ఉత్కంఠ నెలకొంది. టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌తో కాంగ్రెస్ నుంచి తూంకుంట నర్సారెడ్డి, టీడీపీ నుంచి బూర్గుపల్లి ప్రతాప్‌రెడ్డి ఢీకొంటున్న వేళ...ఫలితాలు తీరు ఎలా ఉండబోతున్నదనే అంశంపై అందరి దృష్టి అటే పడింది. ఇప్పటికే నియోజకవర్గంలో నగర పంచాయతీ, ప్రాదేశిక ఎన్నికల ఫలితాలు వెలువడిన తరుణంలో సార్వత్రిక ఫలితంపై అంచనాలు జోరందుకున్నాయి.
సార్వత్రికంలో ఈ రెండు ఎన్నికల ఫలితాల ప్రభావం ఉండదని కొందరు, ఉంటుందని మరి కొందరు విశ్లేషిస్తున్నారు. కేసీఆర్ ఏప్రిల్ 9న ఇక్కడ ఇక్కడి అసెంబ్లీ స్థానానికి నామినేషన్ వేయగా అప్పటికే నగర పంచాయతీ ఎన్నికలు ముగి శాయి. ఆ తర్వాత ప్రాదేశిక ఎన్నికలు జరిగాయి. అయినా ఈ రెండు ఎన్నికల్లో కేసీఆర్ ప్రభంజనం ఆశించినంతంగా కనిపించలేదనే విషయం స్పష్టమైంది. నగర పంచాయతీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీల ఎన్నికల ఫలితాల్లో మొత్తంగా కాంగ్రెస్‌కు 65038 ఓట్లు, టీడీపీకి 64231ఓట్లు వచ్చాయి. టీఆర్‌ఎస్ మాత్రం 57578 ఓట్లతో వెనకంజలో ఉంది. అంతేకాకుండా నగర పంచాయతీలో 9స్థానాలకు పరిమితం కావడం, మరోవైపు నియోజకవర్గంలోని గజ్వేల్, తూప్రాన్, వర్గల్, జగదేవ్‌పూర్, ములుగు, కొండపాక మండలాల్లో జెడ్పీటీసీ స్థానం దక్కలేదు.
అదేవిధంగా ఎంపీపీ పదవులను కైవసం చేసుకోవడానికి కావాల్సిన ఎంపీటీసీ స్థానాలు రాకపోవడం ఆ పార్టీ శ్రేణులను కలవర పరుస్తోంది. ఇదిలావుంటే విద్యార్థి ఉద్యమాల ద్వారా గజ్వేల్‌లో టీఆర్‌ఎస్ బలోపేతానికి తనదైన పాత్ర పోషించిన టీఆర్‌ఎస్వీ జిల్లా అధ్యక్షుడు మాదాసు శ్రీనివాస్ జెడ్పీటీసీగా పోటీ చేసి టీడీపీ అభ్యర్థి జేజాల వెంకటేశంగౌడ్ చేతిలో పరాజయం చవిచూడటం, పార్టీకి నియోజకవర్గ ఇన్‌చ్జాగా ఉన్న భూంరెడ్డి తెలంగాణ ఉద్యమ ప్రభావం ఎక్కువగా ఉన్న సొంత మండలం కొండపాకలో తన సతీమణిని జెడ్పీటీసీగా బరిలో నిలిపి కాంగ్రెస్ అభ్యర్థి చిట్టి మాధురి చేతిలో ఓటమి పాలవటంతో టీఆర్‌ఎస్ వర్గాలు ఏమాత్రం జీర్ణించుకోలేపోతున్నాయి. మరో ముఖ్యమైన అంశమేమిటంటే కేసీఆర్ ఫామ్‌హౌస్ ఉన్న జగదేవ్‌పూర్ మండలంలో టీఆర్‌ఎస్‌కు పెద్దగా ఆదరణ లభించకపోవడం కూడా చర్చనీయాంశంగా మారింది.
నియోజకవర్గంలోని గ్రామాల్లో టీఆర్‌ఎస్‌కు బలమైన క్యాడ ర్ లేక బూత్ స్థాయిలో ఓటర్ల వద్దకు వెళ్లి ఓట్లు రాబట్టడంలో విఫలమయ్యారనే విషయం స్పష్టంగా బయటపడుతున్నది. అయినా సార్వత్రికంలో కేసీఆర్ ప్రభంజనం ఉంటుందన్న ధీమా టీఆర్‌ఎస్‌లో కనిపిస్తున్నది. కాంగ్రెస్ విషయానికొస్తే నగర పంచాయతీ ఎన్నికల సందర్భంగా పార్టీనుంచి కొందరు సీనియర్ నాయకులు వెళ్లిపోవడంతో కాంగ్రెస్‌లో తీవ్ర నిరుత్సాహాం అలుముకున్నది. దీంతో నగ ర పంచాయతీలో ఒకే ఒక స్థానానికి ఆ పార్టీ పరిమితమైంది. అయినా తాజా మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి మాత్రం ఏమాత్రం అధైర్య పడకుండా ప్రాదేశికంలో తానూ గట్టిగా పనిచేయడమే కాకుండా కార్యకర్తలను కార్యోన్ముఖులను చేసి నగర పంచాయతీ లోటును భర్తీ చేస్తూ ప్రాదేశికంలో ఉత్తమ ఫలితాలను పొందారు.
అసెంబ్లీ ఎన్నికల విషయానికొచ్చేసరికి కాంగ్రెస్‌కు చెందిన కొందరు ముఖ్యనేతలు ఓ పార్టీతో లోపాయికారి ఒప్పందం కుదుర్చుకున్నారనే ప్రచారం సాగింది. అలాంటిదేం లేదని కొందరు నేతలు అంటున్నారు. టీడీపీ అభ్యర్థి బూర్గుపల్లి ప్రతాప్‌రెడ్డి మాత్రం తెలంగాణ ఉద్యమ ప్రభావంతో తెలుగుదేశంకు ప్రతికూల పరిస్థితులు ఏర్పడినా తన వ్యక్తిగత ఇమేజీతో పార్టీని నడుపుతూ టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌లకు గట్టి పోటీనిస్తున్నారు. నగర పంచాయతీ, ప్రాదేశికంలో మంచి ఫలితాలను సాధించి ఆయన మంచి దూకుడుమీదున్నారు.
ఈ మూడు పార్టీల మధ్య జరుగుతున్న పోరు తెలంగాణలోనే కాదు...దేశ విదేశాల్లోనూ చర్చనీయాంశంగా మారింది. అమెరికాలాంటి అగ్రరాజ్యంలో నివాసముంటు న్న ప్రవాసాంధ్రులు ఇక్కడివారితో ఈ వ్యవహారంపై నిత్యం సంప్రదింపులు జరుపుతున్నారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. చాలా చోట్ల ఈ పోటీపై బెట్టింగ్‌లు కూడా సాగుతున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈ వ్యవహారం తుది దశకు చేరుకోవడంతో అందరిలోనూ ఆసక్తి నెలకొన్నది. గజ్వేల్ నే‘తలరాత’ తెలుసుకోవాలంటే మరికొద్ది గంటలు వేచిచూడాల్సిందే.