burgupalli pratap reddy
-
‘ఆసరా’ ఇవ్వరా..?
గజ్వేల్/రామాయంపేట/రేగోడు/జగదేవ్‌పూర్ : ప్రజ్ఞాపూర్‌లోని నగర పంచాయతీ కార్యాలయం వద్ద ఉదయం అధికారులు పింఛన్లు ఇవ్వడానికి సన్నద్దమయ్యారు. ఈ క్రమంలో ఒక్కొక్కరి పేర్లు చదువుతూ పంపిణీ చేపడుతుండగా.. ఆ జాబితాలో చోటు దక్కని వారంతా ఒకచోట చేరి అధికారులు తీరుపై నిప్పులు చెరిగారు. తమకు అన్ని రకాల అర్హతలున్నా పింఛన్ ఇవ్వకపోవడంపై మండిపడ్డారు. అంతటితో ఆగకుండా పక్కనున్న గజ్వేల్ ప్రజ్ఞాపూర్ రహదారిపై బైఠాయించారు. ఈ ఆందోళనకు టీడీపీ గజ్వేల్ నియోజకవర్గ ఇన్చార్జ్ బూర్గుపల్లి ప్రతాప్‌రెడ్డి సంఘీభావం ప్రకటించి వారితో పాటు ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాతినిథ్యం వహిస్తున్న నియోజకవర్గంలోనే ఈ రకమైన పరిస్థితి ఉంటే.. మిగితా చోట్ల ఏ విధంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చన్నారు. అర్హులందరికీ పథకం అందేవరకు టీడీపీ పక్షాన పోరాటం చేస్తామన్నారు. గజ్వేల్ మాజీ జెడ్పీటీసీ బొల్లారం ఎల్లయ్య, డీబీఎఫ్ (దళిత బహుజన ఫ్రంట్) జిల్లా అధ్యక్షుడు దాసరి ఏగొండస్వామిలు సైతం ఆందోళనకు మద్దతు పలికారు. రాస్తారోరో కారణంగా గజ్వేల్-ప్రజ్ఞాపూర్ రహదారి కొద్దిసేపు స్తంభించిపోయింది. సమాచారం అందుకున్న ఎస్ఐ జార్జి సంఘటనా స్థలానికి ప్రతాప్‌రెడ్డిని అదుపులోకి తీసుకొని ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు. ఈ క్రమంలోనే అక్కడికి చేరుకున్న నగర పంచాయతీ కమిషనర్ సంతోష్‌కుమార్ మాట్లాడుతూ అర్హల వివరాలను పరిశీలించి వారికి న్యాయం జరిగేలా చూస్తానని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. రామాయంపేటలో.. మండల ంలోని అక్కన్నపేట, బచ్చురాజ్‌పల్లి, రామాయంపేటకు చెందిన వృద్ధులు, వికలాంగులు, వితంతువులు పలువురు పింఛన్ల కో సం స్థానిక ఎంపీపీ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. వీరికి బీజేపీ నాయకులు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా వారు కార్యాలయం ఎదుట భైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భ ంగా పలువురు వృద్ధులు ఎంపీడీఓ అనసూయాబాయితో గొడవకు దిగారు. బీజేపీ నాయకులు వెల్ముల సిద్దరాంలు, నరసింహులు మాట్లాడుతూ పింఛన ్లపేరిట ప్రభుత్వం పేద ప్రజలను మోసగిస్తుందని ఆరోపించారు. అనంతరం వారు ఎంపీడీఓకు వినతిపత్రం అందజేశారు. రేగోడ్‌లో.. ప్రభుత్వం పంపిణీ చేసే పింఛన్ జాబితాలో పేర్లు లేపోవడంతో మండలంలోని ఖాదిరాబాద్‌కు చెందిన పలువురు వృద్ధులు, వికలాంగులు, వితంతువులు సోమవారం ఎంపీడీఓ కార్యాలయాన్ని ముట్టడించి గంటపాటు ధర్నా చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామంలో గతంలో నాలుగువందల మందికి పింఛన్లు మంజూరు కాగా.. ప్రస్తుతం 370 పింఛన్లు మంజూరు చేశారని తెలిపారు. అయితే మిగిలిన 70 మందికి అర్హత ఉన్నా.. అధికారులు నిర్లక్ష్యం చేశారని ఆరోపించారు. ఎంపీడీఓ బయటకు వచ్చి సమాధానం చెప్పాలని నినదించారు. ఎంపీడీఓ రత్నమాల బయటకు రావడంతో ఆమెతో లబ్ధిదారులు గొడవకు దిగారు. పింఛన్ మంజూరు చేయకపోతే ఎలా బతికేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. వీరికి ధర్నాకు ఖాదిరాబాద్ సర్పంచ్ రమేష్‌జోషీ, దళిత సంఘాల మండల అధ్యక్షుడు దేవరాజ్‌లు మద్దతు తెలిపారు. ఏపని చేతగాని వృద్ధులకు పింఛన్ ఎందుకు మంజూరు చేయలేదని సర్పంచ్ రమేష్‌జోషీ ఎంపీడీఓను నిలదీశారు. అర్హులందరికీ పింఛన్లు మంజూరు చేస్తామని ఎంపీడీఓ తెలిపారు. జగదేవ్‌పూర్‌లో.. పింఛన్ ఇస్తారా.. లేకుంటే చావమంటారా.. కూలీనాలీ చేసుకుని బతుకేటోళ్లం.. మాకే పింఛన్ రాకపోతే ప్రభుత్వం ఇంకెవ్వరికి ఇస్తారంటూ మండలంలోని తిగుల్ గ్రామానికి చెందిన 30 మంది వృద్ధులు, వికలాంగులు, వితంతువులు మండలంలోని గణేష్‌పల్లి చౌరస్తాలో ధర్నాకు దిగారు. వీరికి టీడీపీ, కాంగ్రెస్, సీపీఐ పార్టీల నాయకులు మద్దతు ఇచ్చారు. ఈ సందర్భంగా టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర ప్రచార కార్యదర్శి భూమయ్యయాదవ్, యువజన కాంగ్రెస్ గజ్వేల్ నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి భానుప్రకాష్రావులు మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్కరికి ఫించన్లు అందిస్తామని చెప్పినసీఎం కేసీఆర్ నేడు అర్హులకు అందించడంలో విఫలమయ్యారని ఆరోపించారు. దళితుల సంక్షేమమే లక్ష్యమని చెప్పిన సీఎం దళితులకే పింఛన్లు కట్ చేశారని వారు ఆరోపించారు. సమాచారం అందుకున్న ఎస్ఐ వీరన్న. తహశీల్దార్ శ్రీనివాసులు, ఈఓఆర్డీ రాంరెడ్డిలు సంఘటనా స్థలానికి చేరుకుని ధర్నాను విరమించాలని కోరారు. తహశీల్దార్ శ్రీనివాసులు మాట్లాడుతూ వారం రోజులోగా అర్హులైన వారందరికీ ఫించన్ అందిస్తామని హమీ ఇవ్వడంతో ధర్నాను విరమించారు. కార్యక్రమంలో ఎంపీటీసీ సభ్యుడు కోటయ్య, టీడీపీ, కాంగ్రెస్, సీపీఐ నాయకులు మల్లేశం, నరసింహులు, బాలకృష్ణరెడ్డి, లింగం, ఎల్లారెడ్డి, ఐలయ్య, రాజు, రాములు తదితరులు పాల్గొన్నారు. -
అందరి దృష్టి గజ్వేల్‌పైనే
గజ్వేల్, న్యూస్‌లైన్: హాట్ టాపిక్‌గా మారిన గజ్వేల్ అసెంబ్లీ నియోజకవర్గ ఎన్నికల ఫలితాలపై క్షణక్షణం ఉత్కంఠ నెలకొంది. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌తో కాంగ్రెస్ నుంచి తూంకుంట నర్సారెడ్డి, టీడీపీ నుంచి బూర్గుపల్లి ప్రతాప్‌రెడ్డి ఢీకొంటున్న వేళ...ఫలితాలు తీరు ఎలా ఉండబోతున్నదనే అంశంపై అందరి దృష్టి అటే పడింది. ఇప్పటికే నియోజకవర్గంలో నగర పంచాయతీ, ప్రాదేశిక ఎన్నికల ఫలితాలు వెలువడిన తరుణంలో సార్వత్రిక ఫలితంపై అంచనాలు జోరందుకున్నాయి. సార్వత్రికంలో ఈ రెండు ఎన్నికల ఫలితాల ప్రభావం ఉండదని కొందరు, ఉంటుందని మరి కొందరు విశ్లేషిస్తున్నారు. కేసీఆర్ ఏప్రిల్ 9న ఇక్కడ ఇక్కడి అసెంబ్లీ స్థానానికి నామినేషన్ వేయగా అప్పటికే నగర పంచాయతీ ఎన్నికలు ముగి శాయి. ఆ తర్వాత ప్రాదేశిక ఎన్నికలు జరిగాయి. అయినా ఈ రెండు ఎన్నికల్లో కేసీఆర్ ప్రభంజనం ఆశించినంతంగా కనిపించలేదనే విషయం స్పష్టమైంది. నగర పంచాయతీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీల ఎన్నికల ఫలితాల్లో మొత్తంగా కాంగ్రెస్‌కు 65038 ఓట్లు, టీడీపీకి 64231ఓట్లు వచ్చాయి. టీఆర్ఎస్ మాత్రం 57578 ఓట్లతో వెనకంజలో ఉంది. అంతేకాకుండా నగర పంచాయతీలో 9స్థానాలకు పరిమితం కావడం, మరోవైపు నియోజకవర్గంలోని గజ్వేల్, తూప్రాన్, వర్గల్, జగదేవ్‌పూర్, ములుగు, కొండపాక మండలాల్లో జెడ్పీటీసీ స్థానం దక్కలేదు. అదేవిధంగా ఎంపీపీ పదవులను కైవసం చేసుకోవడానికి కావాల్సిన ఎంపీటీసీ స్థానాలు రాకపోవడం ఆ పార్టీ శ్రేణులను కలవర పరుస్తోంది. ఇదిలావుంటే విద్యార్థి ఉద్యమాల ద్వారా గజ్వేల్‌లో టీఆర్ఎస్ బలోపేతానికి తనదైన పాత్ర పోషించిన టీఆర్ఎస్వీ జిల్లా అధ్యక్షుడు మాదాసు శ్రీనివాస్ జెడ్పీటీసీగా పోటీ చేసి టీడీపీ అభ్యర్థి జేజాల వెంకటేశంగౌడ్ చేతిలో పరాజయం చవిచూడటం, పార్టీకి నియోజకవర్గ ఇన్చ్జాగా ఉన్న భూంరెడ్డి తెలంగాణ ఉద్యమ ప్రభావం ఎక్కువగా ఉన్న సొంత మండలం కొండపాకలో తన సతీమణిని జెడ్పీటీసీగా బరిలో నిలిపి కాంగ్రెస్ అభ్యర్థి చిట్టి మాధురి చేతిలో ఓటమి పాలవటంతో టీఆర్ఎస్ వర్గాలు ఏమాత్రం జీర్ణించుకోలేపోతున్నాయి. మరో ముఖ్యమైన అంశమేమిటంటే కేసీఆర్ ఫామ్‌హౌస్ ఉన్న జగదేవ్‌పూర్ మండలంలో టీఆర్ఎస్కు పెద్దగా ఆదరణ లభించకపోవడం కూడా చర్చనీయాంశంగా మారింది. నియోజకవర్గంలోని గ్రామాల్లో టీఆర్ఎస్కు బలమైన క్యాడ ర్ లేక బూత్ స్థాయిలో ఓటర్ల వద్దకు వెళ్లి ఓట్లు రాబట్టడంలో విఫలమయ్యారనే విషయం స్పష్టంగా బయటపడుతున్నది. అయినా సార్వత్రికంలో కేసీఆర్ ప్రభంజనం ఉంటుందన్న ధీమా టీఆర్ఎస్లో కనిపిస్తున్నది. కాంగ్రెస్ విషయానికొస్తే నగర పంచాయతీ ఎన్నికల సందర్భంగా పార్టీనుంచి కొందరు సీనియర్ నాయకులు వెళ్లిపోవడంతో కాంగ్రెస్‌లో తీవ్ర నిరుత్సాహాం అలుముకున్నది. దీంతో నగ ర పంచాయతీలో ఒకే ఒక స్థానానికి ఆ పార్టీ పరిమితమైంది. అయినా తాజా మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి మాత్రం ఏమాత్రం అధైర్య పడకుండా ప్రాదేశికంలో తానూ గట్టిగా పనిచేయడమే కాకుండా కార్యకర్తలను కార్యోన్ముఖులను చేసి నగర పంచాయతీ లోటును భర్తీ చేస్తూ ప్రాదేశికంలో ఉత్తమ ఫలితాలను పొందారు. అసెంబ్లీ ఎన్నికల విషయానికొచ్చేసరికి కాంగ్రెస్‌కు చెందిన కొందరు ముఖ్యనేతలు ఓ పార్టీతో లోపాయికారి ఒప్పందం కుదుర్చుకున్నారనే ప్రచారం సాగింది. అలాంటిదేం లేదని కొందరు నేతలు అంటున్నారు. టీడీపీ అభ్యర్థి బూర్గుపల్లి ప్రతాప్‌రెడ్డి మాత్రం తెలంగాణ ఉద్యమ ప్రభావంతో తెలుగుదేశంకు ప్రతికూల పరిస్థితులు ఏర్పడినా తన వ్యక్తిగత ఇమేజీతో పార్టీని నడుపుతూ టీఆర్ఎస్, కాంగ్రెస్‌లకు గట్టి పోటీనిస్తున్నారు. నగర పంచాయతీ, ప్రాదేశికంలో మంచి ఫలితాలను సాధించి ఆయన మంచి దూకుడుమీదున్నారు. ఈ మూడు పార్టీల మధ్య జరుగుతున్న పోరు తెలంగాణలోనే కాదు...దేశ విదేశాల్లోనూ చర్చనీయాంశంగా మారింది. అమెరికాలాంటి అగ్రరాజ్యంలో నివాసముంటు న్న ప్రవాసాంధ్రులు ఇక్కడివారితో ఈ వ్యవహారంపై నిత్యం సంప్రదింపులు జరుపుతున్నారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. చాలా చోట్ల ఈ పోటీపై బెట్టింగ్‌లు కూడా సాగుతున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈ వ్యవహారం తుది దశకు చేరుకోవడంతో అందరిలోనూ ఆసక్తి నెలకొన్నది. గజ్వేల్ నే‘తలరాత’ తెలుసుకోవాలంటే మరికొద్ది గంటలు వేచిచూడాల్సిందే. -
చావబాదారు
వర్గల్, న్యూస్‌లైన్ : రైతులకు గిట్టుబాటు ధర కల్పన ధ్యేయంగా బుధవారం వర్గల్ మండలంలో టీడీపీ గజ్వేల్ నియోజక వర్గ ఇన్చార్జ్ బూర్గుపల్లి ప్రతాప్‌రెడ్డి పాదయాత్ర సందర్భంగా తీవ్ర ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. పాములపర్తి, పాతూరు మీదుగా సాగిన పాదయాత్ర ఆధ్యంతం కాంగ్రెస్, టీడీపీ కార్యకర్తలు పరస్పరం రాళ్లు రువ్వుకోవడం, దూషణలకు పాల్పడడం, పలుమార్లు పోలీసులు లాఠీల కు పనిచెప్పి ఇరువర్గాలను చెదరగొట్టడం లాంటి సంఘటనలు చోటుచేసుకున్నాయి. ఈ సందర్భంగా పోలీస్ కానిస్టేబుల్ సహా ఇరువర్గాలకు చెందిన పలువురు గాయాలపాలయ్యారు. టీడీపీ నేత బూర్గుపల్లి ప్రతాప్‌రెడ్డి నేతృత్వంలో పార్టీ మండల అధ్యక్షుడు యాదగిరి గౌడ్, ప్రధాన కార్యదర్శి బాల్‌రెడ్డి, మండల సర్పంచుల ఫోరం ప్రధాన కార్యదర్శి టేకులపల్లి శ్రీనివాస్‌రెడ్డి, నాయకులు విరాసత్ అలి, వంటేరు శ్రీనివాస్‌రెడ్డి తదితర నేతలతో కూడినృబందం బుధవారం ఉదయం 9.30 గంటల ప్రాంతంలో ములుగు మండలం నుంచి పాములపర్తి చేరుకుంది. అయితే తెలంగాణ ద్రోహులు తమ గ్రామంలోకి రావద్దంటూ కొంతమంది కాంగ్రెస్ కార్యకర్తలు గ్రామ పంచాయతీ వద్ద బ్యానర్లు తగులబెట్టారు. తెలంగాణ నినాదాలు చేస్తూ పాదయాత్రను అడ్డుకునేందుకు ప్రయత్నించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్, టీడీపీ వర్గాలూ పరస్పరం దూషణలకు దిగడం, నినాదాలు చేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దీంతో గౌరారం, గజ్వేల్ ఎస్ఐలు ఆంజనేయులు, ఆంజనేయులు సిబ్బంది లాఠీలకు పని చెప్పి ఇరువర్గాలను చెదరగొట్టారు. మరోవైపు పరిస్థితి పూర్తి అదుపులోకి తెచ్చేందుకు సిద్దిపేట రూరల్ సీఐ నాగభూషణం, సిద్దిపేట, కుకునూరుపల్లి, బేగంపేట ఎస్ఐలు వరప్రసాద్, యాదిరెడ్డి, కృష్ణబాబు తమ బలగాలతో పాములపర్తి చేరుకున్నారు. దాడుల ఘటనలో కుకునూర్‌పల్లి కానిస్టేబుల్ రాజాగౌడ్‌తో పాటు గజ్వేల్ టీఎన్ఎస్ఎఫ్ నేత హన్మంతరెడ్డి తదితరులు గాయపడ్డారు. మరోవైపు కాంగ్రెస్ వర్గాల దాడిని నిరసిస్తూ పాములపర్తి పంచాయతీ ఎదురుగా రోడ్డు మీద బూర్గుపల్లి ప్రతాప్‌రెడ్డి బైఠాయించారు. దాడులకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేశారు. అనంతరం సీఐ నాగభూషణం హామీ మేరకు ఆయన ఆందోళన విరమించారు. ఆ తరువాత పాదయాత్ర పాతూరు గ్రామ ప్రారంభంలోనూ తెలంగాణ నినాదాలు చేస్తూ కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ దశలో పోలీసులు వారిని అక్కడినుంచి తరిమేశారు. డీఎస్పీ సందర్శన : పాములపర్తి, పాతూరు పాదయాత్ర ఉద్రిక్తతల నేపథ్యంలో బుధవారం సిద్దిపేట డీఎస్పీ శ్రీధర్‌రెడ్డి పాతూరు సందర్శించారు. స్థానిక ఎస్ఐ ఆంజనేయులుతో ఉద్రిక్తతకు దారితీసిన పరిస్థితులపై సమీక్షించారు. పాదయాత్రలో వివిధ గ్రామాల కార్యకర్తలు పాల్గొన్నారు.