చావబాదారు | fighting between Congress and TDP activists | Sakshi
Sakshi News home page

చావబాదారు

Published Wed, Dec 11 2013 11:59 PM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM

fighting between Congress and  TDP activists

వర్గల్, న్యూస్‌లైన్ :  రైతులకు గిట్టుబాటు ధర కల్పన ధ్యేయంగా బుధవారం వర్గల్ మండలంలో టీడీపీ గజ్వేల్ నియోజక వర్గ ఇన్‌చార్జ్ బూర్గుపల్లి ప్రతాప్‌రెడ్డి పాదయాత్ర సందర్భంగా తీవ్ర ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. పాములపర్తి, పాతూరు మీదుగా సాగిన పాదయాత్ర ఆధ్యంతం కాంగ్రెస్, టీడీపీ కార్యకర్తలు పరస్పరం రాళ్లు రువ్వుకోవడం, దూషణలకు పాల్పడడం, పలుమార్లు పోలీసులు లాఠీల కు పనిచెప్పి ఇరువర్గాలను చెదరగొట్టడం లాంటి సంఘటనలు చోటుచేసుకున్నాయి. ఈ సందర్భంగా పోలీస్ కానిస్టేబుల్ సహా ఇరువర్గాలకు చెందిన పలువురు గాయాలపాలయ్యారు.

 టీడీపీ నేత బూర్గుపల్లి ప్రతాప్‌రెడ్డి నేతృత్వంలో పార్టీ మండల అధ్యక్షుడు యాదగిరి గౌడ్, ప్రధాన కార్యదర్శి బాల్‌రెడ్డి, మండల సర్పంచుల ఫోరం ప్రధాన కార్యదర్శి టేకులపల్లి శ్రీనివాస్‌రెడ్డి, నాయకులు విరాసత్ అలి, వంటేరు శ్రీనివాస్‌రెడ్డి తదితర నేతలతో కూడినృబందం బుధవారం ఉదయం 9.30 గంటల ప్రాంతంలో ములుగు మండలం నుంచి పాములపర్తి చేరుకుంది. అయితే తెలంగాణ ద్రోహులు తమ గ్రామంలోకి రావద్దంటూ కొంతమంది కాంగ్రెస్ కార్యకర్తలు గ్రామ పంచాయతీ వద్ద బ్యానర్లు తగులబెట్టారు. తెలంగాణ నినాదాలు చేస్తూ పాదయాత్రను అడ్డుకునేందుకు ప్రయత్నించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్, టీడీపీ వర్గాలూ పరస్పరం దూషణలకు దిగడం, నినాదాలు చేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దీంతో గౌరారం, గజ్వేల్ ఎస్‌ఐలు ఆంజనేయులు, ఆంజనేయులు సిబ్బంది లాఠీలకు పని చెప్పి ఇరువర్గాలను చెదరగొట్టారు.

మరోవైపు పరిస్థితి పూర్తి అదుపులోకి తెచ్చేందుకు సిద్దిపేట రూరల్ సీఐ నాగభూషణం, సిద్దిపేట, కుకునూరుపల్లి, బేగంపేట ఎస్‌ఐలు వరప్రసాద్, యాదిరెడ్డి, కృష్ణబాబు తమ బలగాలతో పాములపర్తి చేరుకున్నారు. దాడుల ఘటనలో కుకునూర్‌పల్లి కానిస్టేబుల్ రాజాగౌడ్‌తో పాటు గజ్వేల్ టీఎన్‌ఎస్‌ఎఫ్ నేత హన్మంతరెడ్డి తదితరులు గాయపడ్డారు. మరోవైపు కాంగ్రెస్ వర్గాల దాడిని నిరసిస్తూ పాములపర్తి పంచాయతీ ఎదురుగా రోడ్డు మీద బూర్గుపల్లి ప్రతాప్‌రెడ్డి బైఠాయించారు. దాడులకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేశారు. అనంతరం సీఐ నాగభూషణం హామీ మేరకు ఆయన ఆందోళన విరమించారు. ఆ తరువాత పాదయాత్ర పాతూరు గ్రామ ప్రారంభంలోనూ తెలంగాణ నినాదాలు చేస్తూ కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ దశలో పోలీసులు వారిని అక్కడినుంచి తరిమేశారు.

 డీఎస్పీ సందర్శన : పాములపర్తి, పాతూరు పాదయాత్ర ఉద్రిక్తతల నేపథ్యంలో బుధవారం సిద్దిపేట డీఎస్పీ శ్రీధర్‌రెడ్డి పాతూరు సందర్శించారు. స్థానిక ఎస్‌ఐ ఆంజనేయులుతో ఉద్రిక్తతకు దారితీసిన పరిస్థితులపై సమీక్షించారు. పాదయాత్రలో వివిధ గ్రామాల కార్యకర్తలు పాల్గొన్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement