
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్‌లో ఎస్సీ వర్గీకరణ చిచ్చు రేపుతోంది. పార్టీలో ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకిస్తే చర్యలు తప్పవంటూ ఏఐసీసీ కార్యదర్శి సంపత్ తేల్చి చెప్పారు. ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా ఎమ్మెల్యే వినోద్ లాంటి వారు సమావేశాలు నిర్వహిస్తున్నారని తెలిసిందన్న సంపత్.. పార్టీ నిర్ణయాలకు వ్యతిరేకంగా మాట్లాడితే చర్యలు తప్పవంటూ ఆయన హెచ్చరించారు.
‘‘ఎస్సీ వర్గీకరణ విషయంలో ప్రధాన చర్చ జరుగుతుంది. బీఆర్‌ఎస్‌కు మాదిగల గురించి మాట్లాడే హక్కు లేదు. 10 ఏళ్లు మాదిగల గురించి ఆలోచించని బీఆర్‌ఎస్ నాయకులు ఇప్పుడు ఏదో చేస్తామని చెప్తున్నారు. వర్గీకరణ అమలు జరిగిందంటే.. అది కాంగ్రెస్ వల్లనే జరుగుతుంది. మాదిగలు గుండె మీద చెయ్యి వేసుకుని పడుకోండి. చంద్రబాబు హయాంలో వర్గీకరణకు ఎదురైనా సాంకేతిక లోపాలు తెలిసిన వాడిగా సీఎం క్యాబినెట్ కమిటీ వేశారు. ఏక సభ్య కమిటీ వేశారు కమిటీ నివేదిక వచ్చాక ఎస్సీ వర్గీకరణ జరగబోతుంది.
వర్గీకరణ పకడ్బందీగా అమలు చేయాలనే దృఢమైన సంకల్పంతో సీఎం ముందుకెళ్తున్నారు. తరతరాలుగా అవమానాలు, అసమానతలు ఎదురొడ్డినా మాదిగలు ధైర్యంగా ఉండండి. అధికారిక సమావేశంలోనే కాంగ్రెస్‌ని డిమాండ్ చేశాను’’ అని సంపత్ పేర్కొన్నారు.