పవన్‌.. ఈ ప్రశ్నలకు సమాధానం ఉందా?: గడికోట శ్రీకాంత్‌రెడ్డి | Gadikota Srikanth Reddy Fires On Pawan Kalyan | Sakshi
Sakshi News home page

పవన్‌.. ఈ ప్రశ్నలకు సమాధానం ఉందా?: గడికోట శ్రీకాంత్‌రెడ్డి

Published Sat, Dec 28 2024 6:47 PM | Last Updated on Sat, Dec 28 2024 7:27 PM

Gadikota Srikanth Reddy Fires On Pawan Kalyan

సాక్షి, హైదరాబాద్‌: రాజకీయంగా వైఎస్సార్‌సీపీకి వ్యతిరేకంగా వ్యవహరించడమే తన విధానంగా డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌ తీరు ఉందని వైఎస్సార్‌సీపీ సీనియర్‌ నాయకుడు, మాజీ చీఫ్‌ విప్‌ గడికోట శ్రీకాంత్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌  ప్రెస్‌ క్లబ్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన, అన్నమయ్య జిల్లా గాలివీడులో పవన్‌కళ్యాణ్‌ పర్యటన పూర్తిగా రాజకీయ ప్రయోజనాలకే పరిమితమైందని విమర్శించారు. అదే ప్రాంతంలో జరిగిన రైతు ఆత్మహత్యను హేళన చేసేలా డిప్యూటీ సీఎం మాట్లాడటం దారుణమని అన్నారు.

గడికోట శ్రీకాంత్‌రెడ్డి ఇంకా ఏమన్నారంటే..:

వాస్తవాలు తెలుసుకోకుండా విమర్శలు:
గాలివీడు మండల పరిషత్‌ కార్యాలయంలో దాడిని రాజకీయం చేస్తూ, డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్‌ హుటాహుటిన పర్యటించారు. కడపలో చికిత్స పొందుతున్న ఎంపీడీఓను పరామర్శించడంతో పాటు, గాలివీడు మండల పరిషత్‌ కార్యాలయం సందర్శించిన ఆయన, ఏ మాత్రం వాస్తవాలు తెలుసుకోకుండా, ఏకపక్షంగా మాట్లాడడం దారుణం. పిచ్చిగా విమర్శలు చేయడం, హెచ్చరికలు జారీ చేయడం అత్యంత హేయం.

గాలివీడులో వాస్తవంగా ఏం జరిగింది?:
మాజీ ఎంపీపీ సుదర్శన్‌రెడ్డి ఆ ప్రాంతంలో 30 ఏళ్లుగా రాజకీయాల్లో మచ్చ లేని నాయకుడుగా ఉన్నారు. ప్రజల కోసం ఆయన నిరంతరం పని చేస్తున్నారు. ఆయన తల్లి ఎంపీపీగా ఉన్నారు. కిందిస్థాయి సిబ్బంది పిలవడంతోనే ఆయన ఎంపీపీ ఛాంబర్‌కు వెళ్లారు. ఒక పథకం ప్రకారం పెద్ద ఎత్తున తరలివచ్చిన తెలుగుదేశం పార్టీ వారు ఆయనపై దాడి చేశారు. ఏకంగా పెప్పర్‌ స్ప్రే ఉపయోగించారంటే వారి ఉద్దేశం అర్థమవుతోంది. అటువంటి దారుణ ఘటనలో న్యాయవాదిగా, మంచిపేరున్న నాయకుడుగా ఉన్న సుదర్శన్‌రెడ్డిపై పోలీసులు హేయంగా వ్యవహరించారు.

ఈ ఘటనలో వాస్తవాలు తెలుసుకోవాలంటే, ఘటన జరిగిన సమయంలో ఆ ప్రాంతంలో కాల్స్‌ డేటా పరిశీలిస్తే, ఎవరు దీనికి ఆదేశాలు ఇచ్చారు? ఎవరు హింసను ప్రేరేపించారు? అన్నది తెలుస్తుంది. బాధ్యతాయుతమైన డిప్యూటీ సీఎం పదవిలో ఉన్న పవన్‌కళ్యాణ్‌కు ఇవ్వన్నీ తెలుసుకునే ఓపిక లేదు. ఏకపక్షంగా ఆయన మాట్లాడటం, వైయస్‌ఆర్‌సీపీని రాజకీయ లక్ష్యంగా చేసుకుని ఆరోపణలు చేయడాన్ని ఖండిస్తున్నాం.

రాయలసీమపై చులకన భావం:
పవన్‌కళ్యాణ్‌ మాటల్లో రాయలసీమ ప్రజలపై చులకనభావం కనిపిస్తోంది. చంద్రబాబు సీఎం అయిన నాటి నుంచి ఈ వైఖరి పెరిగిపోయింది. ఎక్కడో రైలు తగలబడితే రాయలసీమ గూండాలు చేశారంటూ గతంలో ఆయన మాట్లాడిన మాటలను మరిచిపోలేదు. రాయలసీమ ప్రాంతం నుంచి హైకోర్ట్‌ను, లా వర్సిటీని తీసుకుపోతున్నా పవన్‌ ఎందుకు స్పందించడం లేదు? ఆయనకు కూడా ఈ ప్రాంతం పట్ల మంచి భావం లేదనేదే దీనికి అర్థం.

రైతు ఆత్మహత్యలు కనిపించడం లేదా?:
గాలివీడు పర్యటన సందర్భంగా అక్కడకు సమీపంలోనే రైతు ఆత్మహత్య జరిగింది. దీనిపై మీడియా పవన్‌కళ్యాణ్‌ను ప్రశ్నించగా ఆయన స్పందించిన తీరు చాలా దారుణంగా ఉంది. రైతులకు పంటలు బాగానే వచ్చాయి. డబ్బులు బాగానే ఉన్నాయి. అయినా, ఎందుకు చనిపోయారు? అంటూ పవన్‌ చాలా హేళనతో మాట్లాడిన తీరు బాధ కలిగిస్తోంది.

దళితులపై అత్యాచారాలు, అవమానాలు జరిగినప్పుడు, తన పార్టీ ఎమ్మెల్యేలే దాడి చేసినప్పుడు పవన్‌ ఎందుకు మౌనంగా ఉన్నారు? కడప అనగానే రాజకీయం చేయాలని ప్రత్యేక విమానంలో వచ్చారు. అక్కడ ఢిల్లీలో మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌ అంత్యక్రియలు పూర్తి అధికార లాంఛనాలతో జరుగుతున్న సమయంలో, ఇక్కడ కడపలో పవన్‌కళ్యాణ్‌ రాజకీయం చేశారు. రైతుల ఆత్మహత్యలపై చులకనగా మాట్లాడారు. ఒక  బాధ్యతాయుతమైన పదవిలో ఉండి ఇలా వ్యవహరిస్తారా?

తెలుగుదేశం పార్టీకి మేలు చేయడమే పవన్‌ లక్ష్యం:
తెలుగుదేశం పార్టీకి మేలు చేయడమే తన లక్ష్యంగా, వైఎస్సార్‌సీపీని రాజకీయంగా దూషించడమే తన విధానంగా పవన్‌ వ్యవహరిస్తున్నారు. ఎక్కడ ఏం జరిగినా, దానిలో వైయస్సార్‌సీపీ ప్రమేయం ఉందనే ఆరోపణలు రాగానే అక్కడికి పరిగెత్తుకుంటూ వెళ్తు్తన్నారు. కనీసం ఏం జరిగిందనేది తెలుసుకునే ప్రయత్నం కూడా చేయడం లేదు. ఏకపక్షంగా విషయాన్ని వింటూ, రాజకీయంగా వైయస్‌ఆర్‌సీపీపై పిచ్చి ఆరోపణలు చేస్తున్నారు.

వాటన్నింటిపై ఎందుకు స్పందించలేదు?:
కూటమి ప్రభుత్వం వచ్చాక కొన్నాళ్లకే వినుకొండలో నడిరోడ్డుపై ఒక వ్యక్తిని దారుణంగా నరికి చంపారు. దానిపై పవన్‌ మౌనంగా ఉన్నారు. నందికొట్కూరులో బీసీ మెనర్‌ బాలికపై దారుణ  అత్యాచారం చేసి, హతమార్చినా ఆ కుటుంబాన్ని ఇంత వరకు పరామర్శించ లేదు. ఎన్నికల ముందు సుగాలి ప్రీతి విషయాన్ని పెద్ద ఎత్తున ప్రస్తావించారు. ఈరోజు దానిపై ఎక్కడా మాట్లాడటం లేదు. బద్వేల్‌కు చెందిన ఒక బాలికపై పెట్రోల్‌ పోసి నిప్పంటించారు. ఆ బాలిక కడప రిమ్స్‌లో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచింది. బాలిక కుటుంబసభ్యులను కూడా పవన్‌ పరామర్శించ లేదు.

కాకినాడలో జనసేన ఎమ్మెల్యే నానాజీ ఒక దళిత ప్రోఫెసర్‌ను అసభ్య పదజాలంతో దూషిస్తూ దాడి చేసినా కనీసం తన ఎమ్మెల్యేను ప్రశ్నించే సాహసం చేయలేదు. పవన్‌ సొంత నియోజకవర్గం పిఠాపురంలో 16 ఏళ్ల బాలికపై అత్యాచారం జరిగితే దానిపైనా మాట్లాడలేదు. యలమంచిలిలో జనసేన ఎమ్మెల్యే విలేకరులను నిర్భందించి వేధిస్తే కనీసం పెదవి విప్పలేదు. ఇదేనా పవన్‌కళ్యాణ్‌ విధానం?. ప్రశ్నిస్తాను అన్న ఆయన నైజం?

హామీలపైనా నోరు మెదపడం లేదు:
కూటమి ప్రభుత్వం వచ్చి ఆరు నెలలైనా సూపర్‌ సిక్స్‌ హామీల అమలు లేదు. దానిపై పవన్‌ మాట్లాడ్డం లేదు. ఈ ప్రభుత్వంలో పెద్ద ఎత్తున కాంట్రాక్ట్, అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగాలు తొలగిస్తున్నారు. ఉద్యోగులకు డీఎ, ఐఆర్‌ ఇవ్వలేదు. విద్యుత్‌ ఛార్జీలను పెద్ద ఎత్తున పెంచుతున్నారు. రైతులను ఆదుకునే చర్యలు అంతకన్నా లేవు. వీటన్నింటిపై పవన్‌ ప్రశ్నలు ఏమయ్యాయి? సన్నాతన ధర్మం అన్నారు. తిరుపతి లడ్డూ అన్నారు. తరువాత వాటిపై మాట్లాడటమే మానేశారు.

ఇకనైనా వైఖరి మార్చుకోవాలి:
రాజకీయం కోసమే పవన్‌కళ్యాణ్‌ ఇలా వ్యవహరించడం దారుణం. అన్నమయ్య జిల్లా గాలివీడులో జరిగిన సంఘటనలో జవహర్‌బాబుకు మంచి జరగాలి. అదే క్రమంలో ఎందుకు పెప్పర్‌ స్ప్రే చల్లారనే దానిపైనా విచారణ జరగాలి. అలా కాకుండా ఏకపక్షంగా వైయస్సార్‌సీపీని లక్ష్యంగా చేసుకుంటూ, ఆ పార్టీని ఎక్కడా ఉండనివ్వకూడదు అనేది దారుణమైన ఆలోచనలు చేయడం అత్యంత హేయం. ఎక్కడైనా అవాంఛనీయ ఘటనలు జరిగితే అధికారంలో ఉన్న వారు ముందుగా నిజానిజాలు తెలుసుకుని మాట్లాడాలి. అలా కాకుండా ఏకపక్షంగా ఒత్తిళ్లకు లోనై వ్యవహరిస్తే మూల్యం చెల్లించుకోక తప్పదు. అందుకే పవన్‌కళ్యాణ్‌ ఇకనైనా తన వైఖరి మార్చుకోవాలని మాజీ చీఫ్‌ విప్‌ గడికోట శ్రీకాంత్‌రెడ్డి తేల్చి చెప్పారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement