'మీ కాలిలో ముల్లు దిగితే నా పంటితో తీస్తా'
గజ్వేల్: నిజమైన అభివృద్ధి జరగాలంటే రాజకీయ అవినీతి అంతం కావాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. రాజకీయ అవినీతిని కూకటి వేళ్లతో పెకలించి బయడపడేస్తామన్నారు. అవినీతికి పాల్పడేవారు ఎంతటివారైనా ఉపేక్షించబోమన్నారు. సంక్షేమంలో కొత్త ఒరవడి సృష్టిస్తామన్నారు.
బలహీనవర్గాల సంక్షేమం, వ్యవసాయాభివృద్ధి తమ ప్రాధాన్యాలని చెప్పారు. బలహీన వర్గాల సంక్షేమానికి రూ. లక్ష కోట్ల రూపాయలు ఖర్చు చేస్తామని చెప్పారు. అందుకోసమే ఈ మంత్రిత్వ శాఖను తన వద్దనే ఉంచుకున్నట్టు వెల్లడించారు. రైతుల పంట రుణాలను మొత్తం మాఫీ చేస్తామని ప్రకటించారు. జిల్లాకొకటి చొప్పున నిమ్స్ ఆస్పత్రులు కట్టిస్తామన్నారు.
గజ్వేల్ ను తెలంగాణ ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతామని హామీయిచ్చారు. పార్టీలకు అతీతంగా గజ్వేల్ అభివృద్ధికి పాటు పడాలని కేసీఆర్ పిలుపునిచ్చారు. తనను భారీ మెజారిటీతో గెలిపించిన గజ్వేల్ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. గజ్వేల్ ప్రజలకు ఏమిచ్చినా రుణం తీర్చుకోలేనని అంటూ.. మీ కాలిలో ముల్లు దిగితే నా పంటితో తీస్తానన్నారు. గజ్వేల్ ప్రజలకు సేవలు అందించేందుకు ప్రత్యేక అధికారిని, తన నివాసంలో పీఏను నియమించినట్టు కేసీఆర్ వెల్లడించారు. ఏ సమస్య వచ్చినా వీరిని సంప్రదించవచ్చని సూచించారు.