గజ్వేల్: గజ్వేల్ నియోజకవర్గ అభివృద్ధిపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఈనెల 30న నిర్వహించనున్న సమీక్షకు అధికారులు వాస్తవ నివేదికలతో హాజరుకావాలని జిల్లా కలెక్టర్ రాహుల్ బొజ్జా ఆదేశించారు. సీఎం సమీక్ష నేపథ్యంలో కలెక్టర్ రాహుల్ బొజ్జా, జేసీ శరత్, ‘గడా’ (గజ్వేల్ ఏరియా డెవలప్‌మెంట్ అథారిటీ) ఓఎస్‌డీ హన్మంతరావులతో కలిసి గురువారం సాయంత్రం గజ్వేల్‌లోని లక్ష్మీ గార్డెన్స్‌లో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు.
వివిధ శాఖల జిల్లా అధికారులు, నియోజకవర్గస్థాయి అధికారులు పాల్గొన్న ఈ సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ, గజ్వేల్‌ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి రాష్ట్రంలోనే ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దడానికి ముఖ్యమంత్రి శ్రమిస్తున్నారని, ఈ నేపథ్యంలో ఈ సమీక్ష సమావేశం ప్రతిష్టాత్మకమన్నారు. ముఖ్యమంత్రి ఆశయాలకనుగుణంగా పనిచేయాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. ఈ సందర్భంగా శాఖలవారీగా ప్రగతి, ప్రణాళికలపై సమీక్షించారు. చాలావరకు నివేదికలు వాస్తవాలను ప్రతిబింబించే విధంగా లేవని అసంతృప్తి వ్యక్తం చేశారు. వెంటనే వీటిని సరి చేసి మరో నివేదిక రూపొందించాలని సూచించారు. ప్రధానంగా గజ్వేల్ వాటర్ గ్రిడ్, రోడ్లు, విద్యుత్ తదితర శాఖల తీరుపై చర్చించారు.
విద్యుత్ సంబంధించిన సమీక్షలో కొత్తగా తూప్రాన్‌లో 220కేవీ సబ్‌స్టేషన్‌ను ప్రతిపాదించినట్లు ఎస్‌ఈ రాములు కలెక్టర్ వివరించి, ఇందుకోసం సేకరించిన పదెకరాల భూమిని తమకు స్వాధీనం చేయాలని కోరారు. స్పందించిన కలెక్టర్ వెంటనే తూప్రాన్ తహశీల్దార్‌కు ఆదేశాలు జారీ చేశారు. అదేవిధంగా నియోజకవర్గంలో పెండింగ్‌లో ఉన్న మిగతా సబ్‌స్టేషన్‌ల స్థల సేకరణ ప్రక్రియను సైతం పూర్తి చేయాలని ఆయా మండలాల తహశీల్దార్‌లను ఆదేశించారు.
అంతకుముందు జేసీ శరత్ గజ్వేల్‌లో రూ.10 కోట్లతో నిర్మించతలపెట్టిన ప్రభుత్వ కార్యాలయాల ఇంటిగ్రేటేడ్ కాంప్లెక్స్‌కు సంబంధించి స్థల సేకరణ, ప్రగతిపై గజ్వేల్ తహశీల్దార్ బాల్‌రెడ్డితో సమీక్షించారు. వెంటనే భవన నిర్మాణానికి అనువైన రెండెకరాల స్థలాన్ని సేకరించాలని ఆదేశించారు. సమావేశంలో డీఎఫ్‌ఓ సోనిబాల, సిద్దిపేట ఆర్‌డీఓ ముత్యంరెడ్డి, జేడీఏ హుక్యా నాయక్, డీఆర్‌డీఏ పీడీ సత్యనారాయణరెడ్డి, డీపీఓ ప్రభాకర్‌రెడ్డి, ఇరిగేషన్ శాఖ ఎస్‌ఈ సురేంద్ర, ఆర్‌డబ్ల్యూస్ ఎస్‌ఈ విజయప్రకాశ్, ఇరిగేషన్ ఈఈ ఆనంద్, ఆర్‌అండ్‌బీ ఈఈ బాల్‌నర్సయ్య తదితరులు పాల్గొన్నారు.
వాస్తవ నివేదిక లతో రండి
Published Thu, Nov 27 2014 11:38 PM | Last Updated on Wed, Aug 15 2018 9:22 PM
Advertisement