రైతుల ఖాతాల్లోకి నేరుగా ఇన్‌పుట్ సబ్సిడీ
సంగారెడ్ది అర్బన్ : జిల్లాలోని రైతులకు చెల్లించే ఇన్‌పుట్ సబ్సిడీని వెంటనే అందించే విధంగా చర్యలు చేపట్టాలని కలెక్టర్ రాహుల్ బొజ్జా వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ వీడియోకాన్ఫరెన్స్ హాల్‌లో జిల్లాలోని వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు, బ్యాంకు అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇన్‌పుట్ సబ్సిడీని జిల్లాకు కేటాయించడం జరిగిందన్నారు. మెదక్ ఉప ఎన్నిక కోడ్ అమలులో ఉన్నందున ఇన్‌పుట్ సబ్సిడీని రైతుల ఖాతాలోకి జమచేయలేదన్నారు. గతంలో వ్యవసాయ శాఖ జేడీ ఖాతానుంచి నేరుగా బ్యాంకులకు , బ్యాంకు నుంచి రైతుల ఖాతాలోకి ఆన్‌లైన్ ద్వారా జమ అయ్యేవన్నారు.
ప్రస్తుతం వ్యవసాయ శాఖ జేడీ ఖాతా నుంచి వ్యవసాయ శాఖ సహాయ సంచాలకుల ఖాతాలో జమ చేసిన అనంతరం నేరుగా రైతుల ఖాతాలో జమ అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. దీనివల్ల రైతులకు ఏవైనా ఇబ్బందులు వస్తే నేరుగా వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులను కలిసి తమ సమస్యలను పరిష్కరించుకోవచ్చన్నారు. రైతుల రుణాల రీషెడ్యూల్ సంబంధించి ఈనెల 23న మండలంలోని తహాశీల్దార్లు , మండల పరిషత్ అభివృద్ధి అధికారులు సంయుక్తంగా బ్యాంక్ అధికారులతో కలిసి రుణ మాఫీకి అర్హులైన రైతుల వివరాలను సిద్ధంచేయాలని వ్యవసాయశాఖ అధికారులను ఆదేశించారు. నివేదికలో ఎలాంటి డూప్లికేషన్‌కు ఆస్కారం లేకుండా చర్యలు చేపట్టాలన్నారు.అర్హులైన రైతుల జాబితాను ఈ నెల 24న గ్రామాల వారీగా గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో ్రపదర్శించాలన్నారు.
రీషెడ్యూల్ దరఖాస్తులపై సంబంధిత రైతులు తప్పని సరిగా సంతకం చేయాలన్నారు. రీషెడ్యూల్‌కు కొత్తగా ఇచ్చే రుణాలకు సంబంధం లేదని, రైతులకు కొత్తగా రుణాలను బ్యాంకులు అందజేస్తాయన్నారు. ఈ రుణాల రీషెడ్యూల్‌ను , కొత్త రుణాల పంపిణీని మండల ప్రత్యేకాధికారులు పర్యవేక్షించాలన్నారు. రైతుల వివరాలు డూప్లికేషన్ ఉత్పన్నమైన పక్షంలో తనిఖీ చేయించాలని అధికారులకు సూచించారు. జిల్లాలో ఏర్పడ్డ వర్షాభావ పరిస్థితుల దృష్ట్యా ప్రత్యామ్నాయ పంటలను వేసేలా రైతులను చైతన్యపర్చాలని కలెక్టర్ వ్యవసాయాధికారులకు సూచించారు. సమావేశంలో వ్యవసాయ శాఖ సంయుక్త సంచాలకులు హుక్యానాయక్ , లీడ్‌బ్యాంక్ మేనేజర్ రమణారెడ్డి పాల్గొన్నారు.
26న జిల్లా ప్రణాళికా కమిటీ సమావేశం
జిల్లా ప్రణాళికా కమిటీ సమావేశం ఈనెల 26న జెడ్పీ చైర్‌పర్సన్ రాజమణి మురళీ యాదవ్ అధ్యక్షతన నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ రాహుల్ బొజ్జా తెలపారు. 26 వ తేది ఉదయం 11 గంటలకు జెడ్పీ హాల్‌లో జరిగే సమావేశంలో 2014-15 వార్షిక ప్రణాళిక ఆమోదించనున్నట్లు ఆయన ఒక ప్రకటనలో తెలిపారు.