రైతులకు పెట్టుబడి రాయితీ చెక్కు అందజేస్తున్న సీఎం వైఎస్ జగన్. చిత్రంలో మంత్రులు, అధికారులు
సాక్షి, అమరావతి: ఏ సీజన్‌లో పంట నష్టం జరిగితే అదే సీజన్ ముగియక ముందే పరిహారం (ఇన్‌పుట్ సబ్సిడీ) చెల్లిస్తూ రైతన్నకు తోడుగా నిలుస్తున్నామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు. రాష్ట్ర చరిత్రలోనే కాకుండా ఏ రాష్ట్రంలోనూ ఇలా అన్నదాతలకు తోడుగా నిలిచిన దాఖలాలు లేవన్నారు. గత సర్కారు అండగా నిలవకపోగా పంట నష్టపోయి కష్టాల్లో ఉన్న రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీని ఎగ్గొట్టి వెన్ను విరిచిందన్నారు. ఒకవేళ ఇచ్చినా ఏడాది తరువాత అరకొరగా విదిలించటాన్ని చూశామని గుర్తు చేశారు. గత సర్కారుకు, మన ప్రభుత్వానికి తేడాను గమనించాలని కోరారు.
గత నవంబరులో కురిసిన భారీ వర్షాలు, వరదల వల్ల జరిగిన పంట నష్టంతోపాటు నేలకోత, ఇసుక మేట కారణంగా నష్టపోయిన 5,97,311 మంది రైతన్నలకు రూ.542.06 కోట్ల ఇన్‌పుట్ సబ్సిడీ, 1,220 రైతు గ్రూపులకు వైఎస్సార్ యంత్రసేవా పథకం కింద రూ.29.51 కోట్లతో కలిపి మొత్తం రూ.571.57 కోట్లను ముఖ్యమంత్రి జగన్ మంగళవారం తన క్యాంపు కార్యాలయం నుంచి బటన్ నొక్కి లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేశారు. ఈ సందర్భంగా రైతులనుద్దేశించి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు.
మంత్రులు కురసాల కన్నబాబు, ముత్తంశెట్టి శ్రీనివాసరావు, ఎం.శంకరనారాయణ, అగ్రికల్చర్ మిషన్ వైస్ ఛైర్మన్ ఎంవీయస్ నాగిరెడ్డి, వ్యవసాయశాఖ సలహాదారు అంబటి కృష్ణారెడ్డి, వ్యవసాయశాఖ స్పెషల్ సీఎస్ పూనం మాలకొండయ్య తదితరులు ఇందులో పాల్గొన్నారు. సీఎం ప్రసంగంలో ముఖ్యాంశాలు ఇవీ..
రూ.63 కోట్లతో విత్తనాలు
మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి దేవుడి దయ వల్ల మంచి వర్షాలు కురుస్తున్నాయి. రాయలసీమ లాంటి కరువు ప్రాంతాల్లో సైతం భూగర్భ జలాలు బాగా పెరిగి చెరువులు, రిజర్వాయర్లు నీటితో కళకళలాడుతున్నాయి. వెలుగు కింద చీకటి కూడా ఉన్నట్లే అధిక వర్షాల వల్ల కొద్ది మేర పంట నష్టం జరిగింది. రైతన్నల కోసం ఎన్నో కార్యక్రమాలు చేస్తున్న ప్రభుత్వంగా నవంబరులో వర్షాలు, వరదలతో నష్టపోయిన వారిని ఆదుకుంటూ 1.21 లక్షల క్వింటాళ్ల విత్తనాలను దాదాపు 1.43 లక్షల మంది రైతన్నలకు రూ.63 కోట్లు ఖర్చు చేసి అందచేశాం.
నేడు కౌలు రైతులకూ న్యాయం..
కౌలు రైతులను గత సర్కారు ఏరోజూ గుర్తుంచుకోలేదు. కానీ ఇవాళ అర్హులెవరూ మిగిలిపోకుండా ఇ–క్రాప్ డేటాతో శాస్త్రీయంగా ఆర్బీకేల స్ధాయిలోనే పంట నష్టాలను అంచనా వేసే విధానాన్ని ప్రవేశపెట్టాం. పారదర్శకతకు పెద్దపీట వేస్తూ గ్రామ సచివాలయాల్లోనే అర్హుల జాబితాను ప్రదర్శిస్తూ ఏ సీజన్‌లో జరిగిన నష్ట పరిహారాన్ని అదే సీజన్‌లో రైతుల ఖాతాల్లో జమ చేస్తున్న ప్రభుత్వం మనదే. కౌలు రైతులకు సైతం ఇ– క్రాప్ డేటా ఆధారంగా ఇన్‌పుట్ సబ్సిడీని అందచేస్తున్న ప్రభుత్వం కూడా ఇదే.
మిస్ అయిన వారికి మరో చాన్స్
ఇ– క్రాప్ డేటా ఆధారంగా ఏ ఒక్కరూ మిస్ కాకుండా గ్రామ స్థాయిలోనే ఆర్బీకేలలో జాబితా ప్రదర్శిస్తున్న ప్రభుత్వం మనది. ఒకవేళ ఎవరైనా మిస్ అయితే తిరిగి దరఖాస్తు చేసుకునే వెసులుబాటు కల్పిస్తూ మంచి చేస్తున్నాం. పంట నష్టానికి ఇన్‌పుట్ సబ్సిడీని కౌలు రైతులతో సహా అన్నదాతలందరికీ చెల్లిస్తున్నాం.
ఇప్పటివరకు ఇన్‌పుట్ సబ్సిడీగా రూ.1,612 కోట్లు
మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి నేటి వరకూ రెండున్నరేళ్లలో ప్రకృతి వైపరీత్యాలతో పంటలు నష్టపోయిన 19.93 లక్షల మంది రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీగా రూ.1,612 కోట్లు అందచేశాం.
ఇన్‌పుట్‌కు నాడు ఎగనామం..
► 2014 ఖరీఫ్‌లో సంభవించిన కరువుకు 2015 నవంబరులో గానీ ఇవ్వలేదు. 2015 కరువుకు 2016 నవంబరు కంటే కంటే ముందు ఇచ్చిన పరిస్ధితి చూడలేదు.
► 2015 నవంబరు, డిసెంబరులో భారీ వర్షాలకు రూ.263 కోట్ల పంట నష్టం జరిగితే టీడీపీ సర్కారు ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా ఎగ్గొట్టింది.
► 2016 కరువు ఇన్‌పుట్ సబ్సిడీ 2017 జూన్‌లో ఇచ్చారు. 2017 ఇన్‌పుట్ సబ్సిడీని
2018 ఆగస్టులోగానీ ఇవ్వలేదు.
► 2018లో కరువు వల్ల ఖరీఫ్‌లో జరిగిన రూ.1,832 కోట్ల పంట నష్టాన్ని, రబీలో రూ.356 కోట్ల మేర పంట నష్టాన్ని పూర్తిగా గత సర్కారు పూర్తిగా ఎగ్గొట్టిన పరిస్ధితిని గుర్తు తెచ్చుకోవాలి.
నేడు ఆగమేఘాలపై పరిహారం
► దాదాపు 1.56 లక్షల రైతు కుటుంబాలకు రూ.123 కోట్ల మేర ఇన్‌పుట్ సబ్సిడీని 2020 ఏప్రిల్‌లో అందించాం.
► 2020లో ఏప్రిల్ నుంచి అక్టోబరు వరకు కురిసిన భారీ వర్షాలు, వరదల వల్ల నష్టపోయిన 3.71 లక్షల మంది రైతులకు రూ.278 కోట్లను అదే ఏడాది అక్టోబరులో ఇన్‌పుట్ సబ్సిడీగా అందించాం.
► 2020 నవంబరులో నివర్ తుపానుతో నష్టపోయిన 8.35 లక్షల మంది రైతన్నలకు సుమారు రూ.646 కోట్లను నెల తిరగక ముందే అదే ఏడాది డిసెంబరులో అందజేశాం. – 2021 సెప్టెంబరులో గులాబ్ తుపాన్‌తో నష్టపోయిన 34,556 మంది రైతన్నలకు సుమారు రూ.22 కోట్లను అదే ఏడాది నవంబరులో అందజేశాం.
రెండున్నరేళ్లలో రైతన్నలకు ఏం చేశామంటే...
► వైఎస్సార్ రైతు భరోసా – పీఎం కిసాన్ ద్వారా ఇప్పటివరకూ రూ.19,126 కోట్ల మేర సాయం.అరకోటి మంది రైతన్నల కుటుంబాలకు లబ్ధి. దేశంలో ఎక్కడా లేని విధంగా ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, బీసీ కౌలు రైతులు, అటవీ, దేవదాయ భూములు సాగు చేసుకుంటున్న రైతులకు కూడా ఏటా రూ.13,500 చొప్పున రైతు భరోసా సాయం అందిస్తున్న ఏకైక ప్రభుత్వం.
► వైఎస్సార్ సున్నా వడ్డీ పంట రుణాల పథకంతో 65.64 లక్షల మంది రైతులకు వడ్డీ రాయితీ కింద రూ.1,218 కోట్లు. గత సర్కారు బకాయిలు కూడా చెల్లింపు.
► రాష్టంలో 18.70 లక్షల మంది రైతన్నలకు పగటిపూటే 9 గంటల నాణ్యమైన విద్యుత్
కోసం సంవత్సరానికి రూ.9 వేల కోట్ల వ్యయం. ఇప్పటివరకు రూ.23 వేల కోట్లు ఖర్చు. ఫీడర్ల సామర్థ్యం పెంచేందుకు మరో రూ.1,700 కోట్లు వ్యయం.
► వైఎస్సార్ ఉచిత పంటల బీమా పథకం ద్వారా ఇప్పటివరకు 31.07 లక్షల మంది రైతులకు రూ.3,788 కోట్లు. ఈ ఖరీఫ్ నుంచి ప్రతి రైతు వద్ద రూ.10 చొప్పున తీసుకుని సంతకంతో రశీదు ఇవ్వాలని నిర్ణయం. దాదాపు రూ.2 వేల కోట్లతో ప్రకృతి వైపరీత్యాల నిధి, రూ.3 వేల కోట్లతో ధరల స్ధిరీకరణ నిధి ఏర్పాటు.
► ధాన్యం సేకరణ, కొనుగోలు కోసం రెండున్నరేళ్లలో రూ.39 వేల కోట్లకు పైగా వ్యయం. గత సర్కారు హయాంలో సంవత్సరానికి రూ.7 నుంచి రూ.8 వేల కోట్లు మాత్రమే కేటాయించి అది కూడా సమయానికి చెల్లించని దుస్థితి. ఇప్పుడు ఏటా
రూ.16 వేల కోట్లు ఖర్చు చేస్తున్న ప్రభుత్వం. రైతులకు 21 రోజుల్లోనే చెల్లింపులు. ఇది కాకుండా పత్తి రైతులకు రూ.1,800 కోట్లు, ఇతర పంటల కొనుగోళ్లకు మరో రూ.6,465 కోట్లతో గిట్టుబాటు ధరలతో ఆదుకుంటున్న ప్రభుత్వం.
► గత సర్కారు 2018లో రైతులకు ఎగ్గొట్టిన రూ.960 కోట్ల ధాన్యం సేకరణ బకాయిలను చెల్లించిన రాష్ట్ర ప్రభుత్వం. రూ.9 వేల కోట్ల ఉచిత విద్యుత్తు బకాయిలు కూడా చెల్లింపు. గత సర్కారు దిగిపోతూ పెట్టిన రూ.384 కోట్ల విత్తన బకాయిలు సైతం చెల్లింపు.
► ఆర్బీకేలను బ్యాంకింగ్ సేవలతో అనుసంధానం చేస్తూ ఇప్పటికే 9,160 బ్యాంకింగ్ కరస్పాండెంట్లు ఆర్బీకేలలో అందుబాటులోకి. వైఎస్సార్ యంత్ర సేవా పథకం కింద 1,720 రైతు గ్రూపులకు గతంలో రూ.25.50 కోట్ల సబ్సిడీ.
► దాదాపు రూ.2134 కోట్ల వ్యయంతో ఆర్బీకేల స్ధాయిలో యంత్రసేవా కేంద్రాలు ( కమ్యూనిటీ హైరింగ్ సెంటర్ల) ఏర్పాటుకు శ్రీకారం. రానున్న సంవత్సరానికి అన్ని ఆర్బీకేల్లో ఈ సేవలు అందుబాటులోకి.
► ఆర్బీకేల స్ధాయిలోనే వ్యవసాయ సలహా మండళ్ల ఏర్పాటు. నాలుగు అంచెల్లో సమావేశాలు నిర్వహించి సమస్యలను యుద్ధ ప్రాతిపదికన పరిష్కరించేలా చర్యలు.
► ప్రాథమిక సహకార సంఘాల నుంచి ఆప్కాబ్ వరకు ఆధునికీకరణ. సహకార వ్యవస్థలో హెచ్‌ఆర్ విధానం.
► ఎక్కడైనా రైతులకు కనీస గిట్టుబాటు ధరలు లభించకుంటే వెంటనే సీఎం యాప్
(కంటిన్యూస్ మానిటరింగ్ ఆఫ్ అగ్రికల్చర్ ప్రైస్ అండ్ ప్రొడ్యూస్) ద్వారా గ్రామ అగ్రికల్చర్ అసిస్టెంట్ సమాచారం అందించేలా ఏర్పాట్లు. మార్కెటింగ్ శాఖ, జాయింట్ కలెక్టర్ తక్షణమే జోక్యం చేసుకుని కనీస గిట్టుబాటు ధరతో రైతుల నుంచి కొనుగోలు చేసేలా చర్యలు. ఇవేకాకుండా జలకళ, ఏపీ అమూల్ ద్వారా రైతులకు తోడుగా నిలుస్తున్న రాష్ట్ర ప్రభుత్వం.
Comments
Please login to add a commentAdd a comment