పాత బకాయిలు కలిపి విడుదలకు వ్యవసాయశాఖ విన్నపం
సాక్షి, హైదరాబాద్: భారీ వర్షాలు, వడగండ్లతో రాష్ట్రంలో 2010 నుంచి ఇప్పటివరకు వ్యవసాయ, ఉద్యానశాఖలకు జరిగిన నష్టానికి ఇన్‌పుట్ సబ్సిడీ కింద రైతులకు రూ. 147.77 కోట్లు విడుదల చేయాలని ఆర్థికశాఖకు వ్యవసాయశాఖ విన్నవించింది. జరిగిన నష్టం... ఇన్‌పుట్ సబ్సిడీకి సంబంధించి మంగళవారం ఆర్థికమంత్రి ఈటల రాజేందర్‌తో వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి, ఆ శాఖ కార్యదర్శి సి.పార్థసారధి ప్రత్యేకంగా సమావేశం అయ్యారు.
ఈ సందర్భంగా మంత్రి పోచారం ఇప్పటివరకు జరిగిన నష్టాన్ని ఆర్ధికమంత్రికి విన్నవించారు. 2010 నుంచి ఈ ఏడాది జూన్ వరకు భారీ వర్షాలు, వడగండ్లు, అకాల వర్షాలతో ఉద్యాన పంటలకు జరిగిన నష్టం కింద రూ. 86.56 కోట్ల ఇన్‌పుట్ సబ్సిడీ అందజేయాలని ఆయన కోరారు. అలాగే 2012 నుంచి ఈ ఏడాది వరకు వ్యవసాయ పంటలకు జరిగిన నష్టానికి రూ. 61.21 కోట్లు ఇన్‌పుట్ సబ్సిడీ అందజేయాలని కోరారు. అకాల వర్షాలతో 2014 ఫిబ్రవరి, మార్చి నెలల్లో కరీంనగర్, వరంగల్, రంగారెడ్డి జిల్లాల్లో జరిగిన పంటల నష్టానికి రూ. 23.90 కోట్లు కేటాయించాలని కోరారు.
ఈ ఏడాది ఏప్రిల్‌లో అకాల వర్షాలతో జరిగిన నష్టానికి రూ. 21.92 కోట్లు విడుదల చేయాలన్నారు. 2013 ఫిబ్రవరి, మార్చి, మే నెలల్లో అకాల వర్షాలకు వరంగల్, మెదక్, రంగారెడ్డి, ఆదిలాబాద్, కరీంనగర్, మహబూబ్‌నగర్, నిజామాబాద్, ఖమ్మం, నల్లగొండ జిల్లాల్లో ఉద్యాన పంటలకు జరిగిన నష్టానికి రూ. 39.74 కోట్లు విడుదల చేయాలన్నారు. తమ విన్నపం మేరకు ఆర్థికశాఖ పచ్చజెండా ఊపిందని వ్యవసాయశాఖ అధికారులు తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో వర్షాభావం నేపథ్యంలో రైతులు ఇబ్బందులు పడుతున్నందున ఇన్‌పుట్ సబ్సిడీ సొమ్ము అందితే వారికి మేలు జరుగుతుందనే ఉద్దేశంతో ఆగమేఘాల మీద ఆర్థికశాఖకు ఈ విన్నపం చేశామన్నారు.
పంటల నష్టానికి ఇన్‌పుట్ సబ్సిడీ రూ. 147 కోట్లు
Published Wed, Aug 12 2015 3:18 AM | Last Updated on Sun, Sep 3 2017 7:14 AM
Advertisement