కొత్త కలెక్టర్ రోనాల్డ్ రాస్ ఈనెల 14న బాధ్యతలు చేపట్టనున్నారు. రాహుల్ బొజ్జా హైదరాబాద్‌కు బదిలీ అయిన విషయం తెలిసిందే
సాక్షి, సంగారెడ్డి : కొత్త కలెక్టర్ రోనాల్డ్ రాస్ ఈనెల 14న బాధ్యతలు చేపట్టనున్నారు. రాహుల్ బొజ్జా హైదరాబాద్‌కు బదిలీ అయిన విషయం తెలిసిందే. ఆయన స్థానంలో నిజామాబాద్ జిల్లా కలెక్టర్‌గా పనిచేసిన రోనాల్డ్‌రాస్‌ను ప్రభుత్వం మెదక్ జిల్లా కలెక్టర్‌గా నియమించింది. రోనాల్డ్ ప్రస్తుతం సెలవుల్లో ఉన్నారు. ఈనెల 14న ఆయన తిరిగి రానున్నారు. అదేరోజు బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉంది.
రోనాల్డ్ రాస్ ప్రస్థానం..
తమిళనాడు రాష్ట్రానికి చెందిన రోనాల్డ్ రాస్ మద్రాసు యూనివర్సిటీలో బీకాం పూర్తి చేశారు. 1980 జూన్ 24న జన్మించిన ఆయన మద్రాసు యూనివర్సిటీలో ఉన్నత విద్యనభ్యసిస్తూ 2006లో ఐఏఎస్‌కు ఎంపికయ్యారు. 2006 నుంచి 2007 వరకు ట్రైనింగ్ పూర్తి చేసిన రోస్‌కు 2007 జులై 22న అసిస్టెంట్ కలెక్టర్‌గా ల్యాండ్ రెవెన్యూ హైదరాబాద్ కార్యాలయంలో మొదటి పోస్టింగ్ ఇచ్చారు. అసిస్టెంట్ కలెక్టర్, సబ్‌కలెక్టర్ హోదాలలో అదే కార్యాలయంలో పనిచేసిన ఆయన 2008 సెప్టెంబర్‌లో నర్సాపూర్ సబ్‌కలెక్టర్‌గా నియమితులు కాగా అక్కడ 2010 వరకు పని చేశారు.
2010 ఫిబ్రవరి 19న రంపచోడవరం ఐటీడీఏ పీవోగా నియమితులైన రొనాల్డ్ 2011 ఆగస్టు 19 వరకు అక్కడే విధులు నిర్వహించారు. 2011 ఆగస్టు 20న పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కార్యాలయంలో అడిషనల్ సీఈవోగా పనిచేశారు. 2012 సెప్టెంబర్11న గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్‌లో అడిషనల్ కమిషనర్‌గా బదిలీ అయ్యారు. సుమారు రెండు సంవత్సరాల పాటు జీహెచ్‌ఎంసీలో వివిధ జోన్లలో పనిచేసిన ఆయన సిటీ ప్లానింగ్ విభాగంలో కీలకంగా వ్యవహరించారు.
విధుల్లో ముక్కుసూటిగా, నిజాయితీగా, నిక్కచ్చిగా వ్యవహరించే అధికారిగా పేరున్న రోనాల్డ్‌రాస్ సార్వత్రిక ఎన్నికల సమయంలో ఖైరతాబాద్ రిటర్నింగ్ అధికారిగా సమర్థంగా ఎన్నికలు నిర్వహించారన్న పేరుంది. సిటీ ప్లానింగ్ విభాగం నుంచి నిజామాబాద్ జిల్లా కలెక్టర్‌గా బదిలీ కాాగా అక్కడ నుంచి ప్రస్తుతం మెదక్ జిల్లాకు బదిలీ అయ్యారు.