సాక్షి, హైదరాబాద్: ‘ఒలింపిక్ క్రీడల జాబితాలో లేకపోవడంతో చెస్‌కు ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి పెద్దగా ప్రోత్సాహం దక్కడం లేదు. అయితే భవిష్యత్తులో చదరంగం ఆటగాళ్లకు కూడా అన్ని ప్రయోజనాలు అందేలా చేస్తాం. మా కార్యక్రమాల్లో చెస్‌ను కూడా భాగం చేసేందుకు ప్రయత్నిస్తున్నాం’ అని ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ (శాప్) మేనేజింగ్ డెరైక్టర్ రాహుల్ బొజ్జా అన్నారు.
కోట్ల విజయ భాస్కర రెడ్డి స్టేడియంలో మంగళవారం ముగిసిన గ్రాండ్‌మాస్టర్ చెస్ టోర్నమెంట్ ముగింపు కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ చెస్‌కు కూడా తగిన న్యాయం చేసేందుకు నిబంధనల మార్పు విషయాన్ని పరిశీలిస్తున్నట్లు రాహుల్ వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మరో ఐఏఎస్ అధికారి, ఏపీఐఐసీ సంస్థ ఎండీ జయేష్ రంజన్ మాట్లాడుతూ హైదరాబాద్ చెస్ టోర్నీ తమ స్థాయి పెంచుకోవాలని సూచించారు.
‘భారత్‌లో చెస్ అంటే ఢిల్లీ పార్శ్వనాథ్, కోల్‌కతా గోద్రెజ్ టోర్నీలే గుర్తుకు వస్తాయి. ఈసారి టోర్నీ బాగా నిర్వహించారు. దీనికి మరింత మెరుగులు దిద్ది ఆ స్థాయికి చేరుకోవాలి’ అని ఆయన ఆకాంక్షించారు. ఏపీ చెస్ సంఘం, సైబర్ అకాడమీ ఈ స్థాయి టోర్నీలు కనీసం రెండేళ్లకు ఒకటైనా నిర్వహించాలని, అందుకు తమ సహకారం అందిస్తామని ప్రధాన స్పాన్సర్‌గా వ్యవహరించిన టెక్ మహీంద్రా సీటీఓ ఏఎస్ మూర్తి అన్నారు. ఈ ముగింపు కార్యక్రమంలో నిర్వాహక కార్యదర్శి లంక రవి, గ్రాండ్‌మాస్టర్లు శశికిరణ్, ద్రోణవల్లి హారిక, ఏపీ చెస్ సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు. జీఎం టోర్నీలో రాణించిన మట్టా వినయ్ కుమార్, చొల్లేటి సహజశ్రీలు ఉత్తమ ఆంధ్రప్రదేశ్ ప్లేయర్లుగా ఎంపికయ్యారు.
ఆనందంగా ఉంది: వరుణ్
‘బి’ కేటగిరిలో విజేతగా నిలిచిన ఏపీ ఆటగాడు వాడపల్లి వరుణ్ తన ప్రదర్శన పట్ల సంతోషం వ్యక్తం చేశాడు. టోర్నీలో ఆడిన 10 రౌండ్లలో 7 విజయాలు, 3 డ్రాలతో అతను అజేయంగా నిలిచాడు. ప్రస్తుతం 2094 రేటింగ్ ఉన్న వరుణ్, కోచ్ వేణుమాధవ్ వద్ద శిక్షణ పొందుతున్నాడు. ‘గత ఏడాది ‘బి’లో 2200 రేటింగ్ టోర్నీ కూడా నెగ్గాను. ఈసారి నా ప్రదర్శన మరింత మెరుగ్గా ఉంది. టైటిల్ గెలుస్తానని ఊహించలేదు. కానీ ఒక్క గేమ్ కూడా ఓడిపోకూడదని పట్టుదలగా ఆడాను. వీలైనంత త్వరలో ఐఎం నార్మ్ సాధించడమే ప్రస్తుత లక్ష్యం’ అని వరుణ్ చెప్పాడు.
చదరంగాన్నీ ప్రోత్సహిస్తాం!
Published Wed, Dec 4 2013 12:00 AM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM
Advertisement