రూ.20 లక్షల్లోపు ఇల్లెక్కడ?
ఫ్లాటు.. ఏ వెంచర్‌లో చూసినా చ.అ.కు రూ.1,800 నుంచి రూ.3,800 పెట్టాల్సిందే. ఇండిపెండెంట్ హౌసు.. అర కోటి ఉంటే కానీ సాధ్యం కాదు. విల్లా.. ప్రత్యేకంగా కుబేరులకేనని చెప్పాలి!!ఇదీ ఇప్పటివరకు హైదరాబాద్‌లో భూముల ధరల పరిస్థితి. ఇది చాలదన్నట్టు ఆగస్టు1 నుంచి ఇప్పుడున్న ధరల కంటే 20-50 శాతం మేర భూముల ధరలను ప్రభుత్వం పెంచనుంది.మరీ భాగ్యనగరంలో సామాన్యులకు గృహ యోగం లేదా? రూ.25 లక్షల్లోపు ఇళ్లు ఎక్కడ దొరుకుతాయనే అంశంపై ‘సాక్షి రియల్టీ’ నగరంలో పర్యటించింది. నగరం నుంచి కొంత దూరం వెళ్లడానికి సిద్ధపడితే చాలు.. సామాన్యులకు సైతం అందుబాటులో ఉండే ఇళ్లున్నాయని గుర్తించింది. ఏయే ప్రాంతాల్లో తక్కువ ధరలకు ఫ్లాట్లున్నాయో చ దవండి మరి.
సాక్షి, హైదరాబాద్ : హైదరాబాద్‌లో మిగతా ప్రాంతాలతో పోలిస్తే ఇప్పటికీ సామాన్యులకు అందుబాటు ధరల్లో ఉన్న ప్రాంతం వరంగల్ రహదారే అని చెప్పవచ్చు. సింగపూర్ సిటీ, ఇన్ఫోసిస్, రహేజా ఐటీ పార్కులతో ఈ ప్రాంతంలో నిర్మాణ రంగం ఊపందుకుంటోంది. ఉప్పల్ రింగ్‌రోడ్డు నుంచి నాలుగైదు కిలో మీటర్ల పరిధిలోనే ఉన్న ఫీర్జాదిగూడ, పర్వతాపూర్, బోడుప్పల్, మల్లాపూర్, చెంగిచెర్ల గ్రామాలు.. సింగపూర్ సిటీకి దగ్గర్లో ఉన్న చౌదరిగూడ, అన్నోజిగూడ, పోచారం గ్రామాల్లో పెద్ద సంఖ్యలో ఇండిపెండెంట్ హౌస్‌లు, డ్యూప్లేలు, అపార్ట్‌మెంట్లు నిర్మాణ దశలో ఉన్నాయి.
ఫ్లాటుకు అయితే రూ.12- 16 లక్షల వరకు, ఇండిపెండెంట్ హౌస్‌కు రూ.18 - 25 లక్షలు పెడితే చాలు. మీ అవసరాన్ని బట్టి 100, 120, 150, 200 చదరపు గజాల్లో ఇల్లు, 1,000, 1,300, 1,600 చ.అ.ల్లో ఉన్నాయి.
హైవే అయినా అందుబాటే..
జాతీయ రహదారి వెంబడి ఉన్న ప్రాంతం అయినప్పటికీ హయత్‌నగర్ మండల పరిధిలో అందుబాటు ధరల్లోనే ఇళ్లు దొరుకుతున్నాయి. వనస్థలిపురం, ఆటోనగర్ తదితర ప్రాంతాల్లో రూ. 35 లక్షల వరకు పెడితేగానీ సొంతిల్లు దొరకడం లేదు. ఇవి కూడా కొత్త నిర్మాణాలు కావు. హైవే వెంట ఉన్న కుంట్లూరులో ఇప్పుడు ఇళ్ల నిర్మాణం వేగంగా కొనసాగుతోంది. ఎక్కువగా 100, 120, 150 చదరపు గజాల్లోనే ఇళ్లు నిర్మిస్తున్నారు. రూ 12 లక్షల నుంచి రూ.15 లక్షల వరకూ చెబుతున్నారు. బేరసారాలకు అవకాశం ఉంటుంది.
పసుమాముల, పెద్ద అంబర్‌పేట, అబ్దుల్లాపూర్ మెట్, అనాజ్‌పూర్, బాటసింగారం గ్రా మాల్లో రూ.12 లక్షలలోపే ఇళ్లు దొరుకుతున్నా యి. ఇక్కడ బిల్డర్లతో పాటూ 100, 120, 150 గజాల్లో మేస్త్రీలు కట్టిన ఇళ్లు లభిస్తున్నాయి.
ఊరు దాటామన్న అనుభూతి..
చాలామంది దృష్టిపడని ప్రాంతాల్లో సాగర్‌రోడ్డు ఒకటి, ప్రభుత్వ పరంగా ఇప్పటివరకు ఈ రహదారికి పెద్దగా ప్రోత్సాహం లేకపోవడం కూడా ఇందుకు కారణం. బీఎన్‌రెడ్డి నగ ర్ దాటిన తర్వాత ఎయిర్‌ఫీల్డ్, రహదారి వెంబ డి రెండు కిలోమీటర్ల మేరకు అటవీశాఖ భూ ములు ఉండడంతో వెంటనే నగరాన్ని దాటి వెళ్లిపోతున్న అనుభూతి వస్తుంది.
ఔటర్ రింగ్‌రోడ్ జంక్షన్ బొంగ్లూరు వద్ద నిర్మిస్తుండటంతో ఇప్పుడు ఈ ప్రాంతానికి కూడా గిరాకీ పెరిగింది. గుర్రంగూడ, ఇంజాపూర్, తుర్కయాంజాల్, రాగన్నగూడ తదితర గ్రామాల్లో ఇప్పుడు జోరుగా ఇళ్లు నిర్మిస్తున్నారు. ఈ గ్రామాల పరిధిలో సొంతిల్లు కావాలంటే.. రూ.15 లక్షల వరకు పెట్టాల్సి ఉంటుంది. రహదారికి దగ్గరగా ఉంటే మాత్రం.. మరో రెండు లక్షలు అదనం.
పన్నెండు లక్షల నుంచి ప్రారంభం..
సరూర్‌నగర్ మండల పరిధిలోని గ్రామాల్లో ఇప్పటికే రూ.15 లక్షలలోపు ఇళ్లు వెతకటం పెద్ద కష్టమేమీ కాదు. జిల్లెలగూడ, మీర్‌పేట్, అల్మాస్‌గూడ, బడంగ్‌పేట, నాదర్‌గుల్ గ్రామాల్లో చిన్న, పెద్ద వెంచర్లలో జోరుగా ఇళ్ల నిర్మాణం జరుగుతోంది. జిల్లెలగూడలో రూ.15 నుంచి రూ.18 లక్షల వరకున్నాయి. మీర్‌పేట, అల్మాస్‌గూడ గ్రామాల్లో 150 గజాల ఇల్లుకోసం రూ.16 లక్షలు, 120 గజాల ఇంటికోసం రూ.12 లక్షల నుంచి పెట్టాల్సి వస్తుంది.
బడంగ్‌పేట పరిధిలో వంద గజాల స్థలంలో నిర్మించిన ఇంటికి రూ.13 లక్షల నుంచి ధర పలుకుతోంది. 150 గజాల ఇంటికో సం రూ.14 నుంచి రూ.16 లక్షల వరకున్నాయి. నాదర్‌గుల్ పరిధిలో రూ.12 లక్షల నుంచి రూ.14 లక్షల వరకు వెచ్చిస్తే చాలు.
చేరువైనా చౌకే..
కుషాయిగూడ చుట్టుపక్కల అన్నీ అభివృద్ధి చెందిన ప్రాంతాలే.. అయినా అక్కడ ఇల్లు కొనడానికి నిన్నమొన్నటి వరకూ చాలామంది తటపటాయించేవారు. ఇప్పుడా పరిస్థితి మారింది. కుషాయిగూడ, పక్కనే ఉన్న దమ్మాయిగూడ, నాగారం, రాంపల్లి గ్రామాల్లో పదుల సంఖ్యలో గృహసముదాయాలు నిర్మాణంలో ఉన్నాయి.
150, 200 గజాల ఇళ్లు రూ.17- 25 లక్షల్లో దొరుకుతున్నాయి. ఈ ప్రాంతంలో 900, 1,000, 1,100 చ.అ. ఫ్లాటుకు రూ.15 లక్షల వరకున్నాయి.
రూ.20 లక్షలు.. ఆపైన
ఇప్పుడు అందరి దృష్టి రాజీవ్ రహదారిలోని శామీర్‌పేట్, పాత ముంబై మార్గంలోని కొం పల్లి, మేడ్చల్ ప్రాంతాలపైనే. వీటిలో సొంతిల్లు కావాలంటే రూ.25 లక్షలపై మాటే. అలాగని నిరాశ పడక్కర్లేదు. శామీర్‌పేట వరకు వెళితే.. రూ.16 - 18 లక్షల్లో దొరుకుతున్నాయి. 200 గజాల్లో ఇండిపెండెంట్ హౌస్ అయితే రూ.22 నుంచి రూ.24 లక్షల వరకు ఉన్నాయి. రహదారికి సమీపంలో, అదీ గేటెడ్ కమ్యూనిటీ సదుపాయాలతో.. నగరానికి దూరమే అయినా, సౌకర్యాలకు మాత్రం లోటు లేదు.