Land price hike
-
రియల్ దందా
నిర్మల్ : ‘మామ.. నమస్తే.. అంత మంచిదేనా.. మనోళ్లందరూ బాగున్నారా.. అవ్‌గానీ నిర్మల్ల ప్లాట్లు ఏం రేటు నడుస్తున్నయే. జిల్లా అయ్యింది గదా ఒక ప్లాటు తీసుకుందమనుకుంటున్న. పిల్లలు అక్కడనే చదువుతున్నరు. ఇగ ఎప్పటికైనా ఆన్నే ఇల్లు కట్టుకోవాలనుంది. నీకు జర ప్లాట్లు, భూముల గురించి తెలుసు గదా.. మరి ఎప్పుడు రమ్మంటవ్..’ అని ఓ మండల కేంద్రంలో కిరాణా దుకాణం నడుపుకుంటున్న రాజేశ్ తనకు వరసకు మామ అయిన గంగాధర్‌కు ఫోన్ చేశాడు. ‘అల్లుడు.. ఇప్పుడైతే నిర్మల్ల ప్లాట్ల రేట్లు మస్తు పెరిగినై. జిల్లా అవుడేమో గానీ.. ఎటు చూసినా ప్లాట్లే. కానీ ధరలే భగ్గు మంటున్నయి. ఈడ కొనే బదులు ఊళ్లే ఒక ఎకరం పొలం కొనొచ్చు..’ అంటూ నిర్మల్‌లో రియల్‌దందా గురించి గంగాధర్ చెప్పుకుంటూ వచ్చాడు. ఈ మాటలకు ‘అమ్మా... ఇంత ధరలా..’ అంటూ రాజేశ్ అవాక్కయ్యాడు. ప్రస్తుతం నిర్మల్‌తో పాటు భైంసా, ఖానాపూర్ వంటి పట్టణాల్లో నడుస్తున్న రియల్‌దందా చూస్తే ఎవరైనా అవాక్కవ్వాల్సిందే. రెండు నెలల కిందట రూ.3లక్షలు పలికిన ప్లాటు ధర ఇప్పుడు ఏకంగా రూ.10–12లక్షలు పలుకుతోంది. అదీ.. ఎలాంటి అనుమతులు తీసుకోకుండానే చేసిన భూముల్లోనే.. ఇక అన్ని అనుమతులు తీసుకుని చేసిన కాలనీల్లో రూ.25లక్షల వరకు ప్లాట్ల ధరలున్నాయి. జిల్లా పేరు చెప్పి.. సమీకృత భవనాల నిర్మాణాలంటూ.. ఇష్టానుసారంగా ధరలు పెంచేస్తున్నారు. నిబంధనలు తుంగలో తొక్కుతూ.. వెంచర్లు వేస్తూ.. ప్లాట్లు విక్రయిస్తున్నారు. ప్రస్తుత బూమ్‌ను రియల్టర్లు క్యాష్ చేసుకుంటున్నారు. రియల్ ‘పంట’.. నిర్మల్ జిల్లా కావడం ప్రజలకు ఎంత ఉపయోగకరంగా ఉందో..లేదో తెలియదు గానీ.. రియల్ వ్యాపారుల పంట మాత్రం పండుతోంది. పెద్దనోట్ల రద్దుతో కాస్త బలహీనపడ్డ వెంచర్లు.. ఇప్పుడు మళ్లీ ఊపందుకుంటున్నాయి. నిన్నమొన్నటి వరకు రూ.2–4లక్షలు పలికిన ప్లాట్లు కూడా ఇప్పుడు రూ.10లక్షల వరకు పలుకుతున్నాయి. నిర్మల్ చుట్టూ కొన్ని కిలోమీటర్ల దూరం వరకు ప్లాట్లు చేస్తున్నారు. ప్రధానంగా సమీకృత భవనాలు ఇక్కడే నిర్మిస్తారంటూ నిర్మల్–ఎల్లపెల్లి మార్గంలో విపరీతంగా వెంచర్లు ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో చాలా వాటికి అనుమతులు, నిబంధనలు మాత్రం కనిపించడం లేదు. పచ్చని పొలాలే ప్లాట్లుగా.. నెలక్రితం వరకు పంటలు పండించిన పొలాల్లో ఇప్పుడు ప్లాట్లు వెలిశాయి. పచ్చని పంటలను పండించిన భూములను కాస్త విశాల వెంచర్లు మార్చేస్తున్నారు. జిల్లాకేంద్రం కావడంతోనే భూముల ధరలకు బూమ్ వచ్చింది. జిల్లాలోని వివిధ మండలాల వాళ్లు నిర్మల్‌లో సెటిల్ కావాలని కోరుకుంటున్నారు. ఉద్యోగ, ఉపాధ్యాయ, వ్యాపార వర్గాల వారూ ప్లాట్లు కొనిపెట్టుకోవాలనుకుంటున్నారు. దీన్నే రియల్ వ్యాపారులు క్యాష్ చేసుకుంటున్నారు. గతంలో ఉన్న ధరలను మూడింతలు, నాలుగింతలు చేసి విక్రయిస్తున్నారు. ప్రస్తుతం నిర్మల్ నుంచి 10 కిలో మీటర్ల వరకు ఎటు చూసినా ప్లాట్లే కనిపిస్తున్నాయనడంలో అతిశయోక్తి లేదు. పల్లెల్లోకి చొచ్చుకెళ్లిన వెంచర్లు.. నిర్మల్‌కు చుట్టూ ఉన్న మంజులాపూర్, తల్వేద, లంగ్డాపూర్, వెంగ్వాపేట్, చిట్యాల, కడ్తాల్, వెంకటాపూర్, అక్కాపూర్, కొండాపూర్, ఎల్లపెల్లి, అనంతపేట్, విశ్వనాథ్‌పేట్ ఇవన్నీ ఇప్పుడు ప్లాట్లకు కేరాఫ్‌గా మారాయి. నిన్నటి దాకా పచ్చని పంటలు పండిన పల్లెభూములు ఇప్పుడు రియల్ వెంచర్లుగా మారిపోయాయి. రోడ్లు, మొరం, సూచికలతో కనిపిస్తున్నాయి. ఒకప్పుడు పల్లెల నుంచి పట్టణానికి వస్తే.. ఇప్పుడు భూములు కొనేందుకు పట్నంవాసులు చుట్టుపక్కల ఉన్న పల్లెలకు పరుగుపెడుతున్నారు. నిర్మల్ పట్టణంలో ప్రస్తుతం ప్లాటు ధర రూ.15లక్షల నుంచి రూ.25లక్షల వరకు పలుకుతోంది. పల్లెల్లో రూ.4లక్షల నుంచి రూ.8లక్షల వరకు ఉంది. ఇప్పుడే కొనిపెట్టుకుంటే మున్ముందు మంచి ధర వస్తుందన్న నమ్మకంతో పల్లెలోనూ ప్లాట్లు కొనుగోలు చేస్తున్నారు. ‘సమీకృతం’ పేరు చెప్పి.. జిల్లాకేంద్రంలో గతంలో భీమన్నగుట్టపై సమీకృత కలెక్టరేట్ నిర్మించనున్నారని తెలియడంతోనే చుట్టుపక్కల ఇష్టానుసారంగా ప్లాట్లు చేశారు. అనంతరం వివిధ సంఘాలు, పార్టీల ఆందోళనలతో భీమన్నగుట్టపై నిర్మాణాలు రద్దయ్యాయి. ఇప్పుడు అదే మార్గంలో ఇంకాస్త ముందుకు వెళ్తే.. బత్తీస్గఢ్ పక్కన గల కొచ్చెరువు ప్రాంతంలో నిర్మాణాలు చేపట్టేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే అక్కడ నాగార్జున కన్స్ట్రక్షన్ కంపెనీ భూమి చదును పనులు చేపడుతోంది. ఈక్రమంలో ఇక్కడే సమీకృత భవనాలు నిర్మించనున్నారని చెప్పి చుట్టూ ఉన్న ఐదు కిలోమీటర్ల వరకు పంటభూములన్నింటినీ ప్లాట్లుగా మార్చేశారు. ఇక్కడ ధరలు రెండింతలు చేశారు. ఈ ప్రాంతంలో రూ.2లక్షలు ఉన్న ప్లాటు ధర ఇప్పుడు రూ.8.50లక్షలకు విక్రయిస్తున్నారు. పైగా ప్లాటు స్థలాన్ని కూడా తగ్గిస్తున్నారు. నిబంధనల మాటే లేదు.. జిల్లాకేంద్రం చుట్టూ చేస్తున్న వెంచర్లలో 90శాతం నిబంధనలకు విరుద్ధంగానే ఉన్నాయి. లే అవుట్ పర్మిషన్ లేకుండా, నాలా పన్ను చెల్లించకుండా, అనుమతి లేకుండానే ప్లాట్లు చేసి విక్రయిస్తున్నారు. ఈ విషయం అధికారులకు తెలిసినా ఏం చేయలేని పరిస్థితి. నిర్మల్‌లో ఉన్న రియల్ వ్యాపారంలో అధికశాతం రాజకీయంగా పెద్ద తలకాయల చేతుల్లోనే ఉంది. వారిని కాదని.. తామేం చేయలేమని కొంతమంది అధికారులు బహిరంగంగా చెబుతున్నారు. ఇక.. ఈ ప్లాట్ల ఏర్పాటు కోసం ఇష్టానుసారంగా గుట్టలు తవ్వేస్తున్నారు. అనుమతి లేకుండా లారీలకొద్దీ మొరం తరలిస్తున్నారు. ప్రకృతి సంపదను కొల్లగొడుతున్నా.. ‘అధికార’ పక్షం అండ ఉండడంతో అధికారులు ఏం చేయలేని పరిస్థితి. నాలా ప్రకారం పన్ను చెల్లించాలి నాలా(నాన్ అగ్రికల్చరల్ ల్యాండ్స్ అసెస్మెంట్) యాక్ట్ ప్రకారం పన్ను చెల్లించిన తర్వాతనే వ్యవసాయ భూములను వ్యవసాయేతర భూములుగా మార్చుకోవాల్సి ఉంటుంది. అలా కాకుండా వ్యవసాయ భూముల్లో ప్లాట్లు చేయడం చట్టవిరుద్ధం. అనుమతి తీసుకున్న తర్వాతే వ్యవసాయేతర భూముల్లో ప్లాట్లు వేయాలి. – ప్రసూనాంబా, ఆర్డీవో, నిర్మల్ అనుమతుల్లేని వాటికి నోటీసులు మున్సిపల్ పరిధిలో ఏర్పాటు చేస్తున్న వెంచర్లు, ప్లాట్లు కచ్చితంగా లే అవుట్ పర్మిషన్లు తీసుకోవాలి. అలా అనుమతి లేకుండానే ప్లాట్లు చేసి, విక్రయిస్తున్న విషయం మా దృష్టికి వచ్చింది. ఇప్పటికే పలు వెంచర్లకు నోటీసులు అందించాం. సోఫీనగర్, గాజుల్పేట్ తదితర చోట్ల ప్లాట్లలో రాళ్లు తొలగించాం. నిర్మల్‌కు పూర్తిస్థాయి టీపీఎస్, సరిపడా సిబ్బంది లేకపోవడం కూడా వీటి నివారణలో కొంత ఇబ్బందిగా మారుతోంది. – మంద రవిబాబు, మున్సిపల్ కమిషనర్, నిర్మల్ -
రూ.20 లక్షల్లోపు ఇల్లెక్కడ?
ఫ్లాటు.. ఏ వెంచర్లో చూసినా చ.అ.కు రూ.1,800 నుంచి రూ.3,800 పెట్టాల్సిందే. ఇండిపెండెంట్ హౌసు.. అర కోటి ఉంటే కానీ సాధ్యం కాదు. విల్లా.. ప్రత్యేకంగా కుబేరులకేనని చెప్పాలి!!ఇదీ ఇప్పటివరకు హైదరాబాద్‌లో భూముల ధరల పరిస్థితి. ఇది చాలదన్నట్టు ఆగస్టు1 నుంచి ఇప్పుడున్న ధరల కంటే 20-50 శాతం మేర భూముల ధరలను ప్రభుత్వం పెంచనుంది.మరీ భాగ్యనగరంలో సామాన్యులకు గృహ యోగం లేదా? రూ.25 లక్షల్లోపు ఇళ్లు ఎక్కడ దొరుకుతాయనే అంశంపై ‘సాక్షి రియల్టీ’ నగరంలో పర్యటించింది. నగరం నుంచి కొంత దూరం వెళ్లడానికి సిద్ధపడితే చాలు.. సామాన్యులకు సైతం అందుబాటులో ఉండే ఇళ్లున్నాయని గుర్తించింది. ఏయే ప్రాంతాల్లో తక్కువ ధరలకు ఫ్లాట్లున్నాయో చ దవండి మరి. సాక్షి, హైదరాబాద్ : హైదరాబాద్‌లో మిగతా ప్రాంతాలతో పోలిస్తే ఇప్పటికీ సామాన్యులకు అందుబాటు ధరల్లో ఉన్న ప్రాంతం వరంగల్ రహదారే అని చెప్పవచ్చు. సింగపూర్ సిటీ, ఇన్ఫోసిస్, రహేజా ఐటీ పార్కులతో ఈ ప్రాంతంలో నిర్మాణ రంగం ఊపందుకుంటోంది. ఉప్పల్ రింగ్‌రోడ్డు నుంచి నాలుగైదు కిలో మీటర్ల పరిధిలోనే ఉన్న ఫీర్జాదిగూడ, పర్వతాపూర్, బోడుప్పల్, మల్లాపూర్, చెంగిచెర్ల గ్రామాలు.. సింగపూర్ సిటీకి దగ్గర్లో ఉన్న చౌదరిగూడ, అన్నోజిగూడ, పోచారం గ్రామాల్లో పెద్ద సంఖ్యలో ఇండిపెండెంట్ హౌస్‌లు, డ్యూప్లేలు, అపార్ట్మెంట్లు నిర్మాణ దశలో ఉన్నాయి. ఫ్లాటుకు అయితే రూ.12- 16 లక్షల వరకు, ఇండిపెండెంట్ హౌస్‌కు రూ.18 - 25 లక్షలు పెడితే చాలు. మీ అవసరాన్ని బట్టి 100, 120, 150, 200 చదరపు గజాల్లో ఇల్లు, 1,000, 1,300, 1,600 చ.అ.ల్లో ఉన్నాయి. హైవే అయినా అందుబాటే.. జాతీయ రహదారి వెంబడి ఉన్న ప్రాంతం అయినప్పటికీ హయత్‌నగర్ మండల పరిధిలో అందుబాటు ధరల్లోనే ఇళ్లు దొరుకుతున్నాయి. వనస్థలిపురం, ఆటోనగర్ తదితర ప్రాంతాల్లో రూ. 35 లక్షల వరకు పెడితేగానీ సొంతిల్లు దొరకడం లేదు. ఇవి కూడా కొత్త నిర్మాణాలు కావు. హైవే వెంట ఉన్న కుంట్లూరులో ఇప్పుడు ఇళ్ల నిర్మాణం వేగంగా కొనసాగుతోంది. ఎక్కువగా 100, 120, 150 చదరపు గజాల్లోనే ఇళ్లు నిర్మిస్తున్నారు. రూ 12 లక్షల నుంచి రూ.15 లక్షల వరకూ చెబుతున్నారు. బేరసారాలకు అవకాశం ఉంటుంది. పసుమాముల, పెద్ద అంబర్‌పేట, అబ్దుల్లాపూర్ మెట్, అనాజ్‌పూర్, బాటసింగారం గ్రా మాల్లో రూ.12 లక్షలలోపే ఇళ్లు దొరుకుతున్నా యి. ఇక్కడ బిల్డర్లతో పాటూ 100, 120, 150 గజాల్లో మేస్త్రీలు కట్టిన ఇళ్లు లభిస్తున్నాయి. ఊరు దాటామన్న అనుభూతి.. చాలామంది దృష్టిపడని ప్రాంతాల్లో సాగర్‌రోడ్డు ఒకటి, ప్రభుత్వ పరంగా ఇప్పటివరకు ఈ రహదారికి పెద్దగా ప్రోత్సాహం లేకపోవడం కూడా ఇందుకు కారణం. బీఎన్‌రెడ్డి నగ ర్ దాటిన తర్వాత ఎయిర్‌ఫీల్డ్, రహదారి వెంబ డి రెండు కిలోమీటర్ల మేరకు అటవీశాఖ భూ ములు ఉండడంతో వెంటనే నగరాన్ని దాటి వెళ్లిపోతున్న అనుభూతి వస్తుంది. ఔటర్ రింగ్‌రోడ్ జంక్షన్ బొంగ్లూరు వద్ద నిర్మిస్తుండటంతో ఇప్పుడు ఈ ప్రాంతానికి కూడా గిరాకీ పెరిగింది. గుర్రంగూడ, ఇంజాపూర్, తుర్కయాంజాల్, రాగన్నగూడ తదితర గ్రామాల్లో ఇప్పుడు జోరుగా ఇళ్లు నిర్మిస్తున్నారు. ఈ గ్రామాల పరిధిలో సొంతిల్లు కావాలంటే.. రూ.15 లక్షల వరకు పెట్టాల్సి ఉంటుంది. రహదారికి దగ్గరగా ఉంటే మాత్రం.. మరో రెండు లక్షలు అదనం. పన్నెండు లక్షల నుంచి ప్రారంభం.. సరూర్‌నగర్ మండల పరిధిలోని గ్రామాల్లో ఇప్పటికే రూ.15 లక్షలలోపు ఇళ్లు వెతకటం పెద్ద కష్టమేమీ కాదు. జిల్లెలగూడ, మీర్పేట్, అల్మాస్గూడ, బడంగ్‌పేట, నాదర్గుల్ గ్రామాల్లో చిన్న, పెద్ద వెంచర్లలో జోరుగా ఇళ్ల నిర్మాణం జరుగుతోంది. జిల్లెలగూడలో రూ.15 నుంచి రూ.18 లక్షల వరకున్నాయి. మీర్‌పేట, అల్మాస్గూడ గ్రామాల్లో 150 గజాల ఇల్లుకోసం రూ.16 లక్షలు, 120 గజాల ఇంటికోసం రూ.12 లక్షల నుంచి పెట్టాల్సి వస్తుంది. బడంగ్‌పేట పరిధిలో వంద గజాల స్థలంలో నిర్మించిన ఇంటికి రూ.13 లక్షల నుంచి ధర పలుకుతోంది. 150 గజాల ఇంటికో సం రూ.14 నుంచి రూ.16 లక్షల వరకున్నాయి. నాదర్గుల్ పరిధిలో రూ.12 లక్షల నుంచి రూ.14 లక్షల వరకు వెచ్చిస్తే చాలు. చేరువైనా చౌకే.. కుషాయిగూడ చుట్టుపక్కల అన్నీ అభివృద్ధి చెందిన ప్రాంతాలే.. అయినా అక్కడ ఇల్లు కొనడానికి నిన్నమొన్నటి వరకూ చాలామంది తటపటాయించేవారు. ఇప్పుడా పరిస్థితి మారింది. కుషాయిగూడ, పక్కనే ఉన్న దమ్మాయిగూడ, నాగారం, రాంపల్లి గ్రామాల్లో పదుల సంఖ్యలో గృహసముదాయాలు నిర్మాణంలో ఉన్నాయి. 150, 200 గజాల ఇళ్లు రూ.17- 25 లక్షల్లో దొరుకుతున్నాయి. ఈ ప్రాంతంలో 900, 1,000, 1,100 చ.అ. ఫ్లాటుకు రూ.15 లక్షల వరకున్నాయి. రూ.20 లక్షలు.. ఆపైన ఇప్పుడు అందరి దృష్టి రాజీవ్ రహదారిలోని శామీర్‌పేట్, పాత ముంబై మార్గంలోని కొం పల్లి, మేడ్చల్ ప్రాంతాలపైనే. వీటిలో సొంతిల్లు కావాలంటే రూ.25 లక్షలపై మాటే. అలాగని నిరాశ పడక్కర్లేదు. శామీర్‌పేట వరకు వెళితే.. రూ.16 - 18 లక్షల్లో దొరుకుతున్నాయి. 200 గజాల్లో ఇండిపెండెంట్ హౌస్ అయితే రూ.22 నుంచి రూ.24 లక్షల వరకు ఉన్నాయి. రహదారికి సమీపంలో, అదీ గేటెడ్ కమ్యూనిటీ సదుపాయాలతో.. నగరానికి దూరమే అయినా, సౌకర్యాలకు మాత్రం లోటు లేదు. -
‘భారం’ ప్రజలపైనే!
కర్నూలు(అర్బన్): ఆర్థిక వనరులను పెంపొందించుకునేందుకు ప్రభుత్వం ప్రజలపైనే భారం మోపుతోంది. ప్రధానంగా రిజిస్ట్రేషన్ల శాఖపై దృష్టి సారించింది. భూముల ధర పెంచడం ద్వారా ఆదాయం రాబట్టేందుకు నిర్ణయించింది. ఆగస్టు 1వ తేదీ నుంచి సవరించిన ధరలను అమల్లోకి తీసుకొచ్చేందుకు ఇప్పటికే ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఆ మేరకు జిల్లా రిజిస్ట్రేషన్ల శాఖ అధికారులు కసరత్తు పూర్తి చేసి ఉన్నతాధికారుల అనుమతికి నివేదిక పంపారు. ఇందుకు సంబంధించిన ఫైలు ముఖ్యమంత్రి వద్దకు వెళ్లినట్లు సమాచారం. పెంపు భారం అందరిపై వేస్తే ప్రభుత్వంపై పూర్తి స్థాయిలో వ్యతిరేకత తప్పదనే ఉద్దేశంతో ముందుగా మున్సిపల్ ప్రాంతాల్లో మాత్రమే పెంపునకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో జిల్లాలోని కర్నూలు నగరపాలక సంస్థతో పాటు నంద్యాల, ఆదోని, ఎమ్మిగనూరు, డోన్, నందికొట్కూరు మున్సిపాలిటీలు.. గూడూరు, ఆత్మకూరు, ఆళ్లగడ్డ నగర పంచాయతీల్లో భూముల రేట్లను పెంచాలని నిర్ణయించారు. అయితే ఈ ప్రాంతాల్లో 0 నుంచి 30 శాతం వరకు పెంచేందుకు ఆయా ప్రాంతాలను బట్టి అధికారులు ధరలను నిర్ణయించినట్లు సమాచారం. పెంచిన రేట్లపై నేటి(గురువారం) సాయంత్రానికి స్పష్టత రానుంది. ప్రాంతాన్ని బట్టి చదరపు గజానికి రూ.1000 నుంచి రూ.2వేల వరకు పెంపు ఉండొచ్చని అధికారులు పేర్కొంటున్నారు. ఇదిలాఉండగా భూముల ధరతో పాటు రిజిస్ట్రేషన్ చార్జీలు పెరగనున్నాయనే సమాచారంతో ప్రజలు క్రయవిక్రయాలు జోరుగా సాగిస్తున్నారు. ఫలితంగా రిజిస్ట్రార్ కార్యాలయాలకు తాకిడి పెరిగింది. గత నెల ఆషాడం కావడం.. ప్రస్తుతం శ్రావణ మాసం మొదలవడంతో లావాదేవీలు జోరందుకున్నాయి. జిల్లాలోని కర్నూలు, నంద్యాల పరిధిలోని రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఈ ఆర్థిక సంవత్సరం మూడు నెలలకు రూ.3,889.07 లక్షలు లక్ష్యం కాగా.. ఇప్పటికే రూ.2483.18 లక్షల పురోగతి సాధించినట్లు అధికారుల ద్వారా తెలిసింది. నగరపాలక సంస్థలో పెరగనున్న రేట్లు నగరపాలక సంస్థలో ఇటీవల విలీనమైన స్టాంటన్‌పురం, మామిదాలపాడు, మునగాలపాడు గ్రామ పంచాయతీలతో పాటు జోహరాపురంలోని ప్రాంతాల్లో రిజిస్ట్రేషన్ చార్జీలు స్వల్పంగా పెరగనున్నాయి. స్టాంటన్‌పురం గ్రామ పంచాయతీ పరిధిలోని ప్రాంతాల్లో ప్రస్తుతం ఒక చదరపు గజం రూ.2,500 ఉండగా.. చార్జీలు పెరిగితే రూ.5 వేలకు చేరుకోనుంది. 45వ వార్డు పరిధిలో రూ.7 వేల నుంచి రూ.8 వేలు.. మామిదాలపాడులో రూ.2,500 నుంచి రూ.3 వేలు.. మునగాలపాడులో రూ.700 నుంచి రూ.1000 వరకు, జోహరాపురంలోని పలు ప్రాంతాల్లో రూ.1200 నుంచి రూ.3 వేలు.. ప్రకాష్‌నగర్, బంగారుపేటలో రూ.7 వేల నుంచి రూ.8 వేలకు ధర పెరగనుంది. నగరంలోని మిగిలిన ప్రాంతాల్లో చార్జీల పెంపు ఉండకపోవచ్చని తెలుస్తోంది. మిగిలిన అన్ని మున్సిపల్, నగర పంచాయతీల్లో భూముల ధర పెంపు ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేయనుంది