రియల్‌ దందా  | land rates are hiked by real estaters in nirmal districts | Sakshi
Sakshi News home page

రియల్‌ దందా 

Published Mon, Feb 19 2018 3:59 PM | Last Updated on Mon, Feb 19 2018 3:59 PM

land rates are hiked by real estaters in nirmal districts - Sakshi

కొచ్చెరువు ప్రాంతంలో ఎల్లపెల్లి–బంగల్‌పేట్‌ మార్గంలో ఏర్పాటు చేసిన వెంచర్‌ 

నిర్మల్‌ : ‘మామ.. నమస్తే.. అంత మంచిదేనా.. మనోళ్లందరూ బాగున్నారా..  అవ్‌గానీ నిర్మల్‌ల ప్లాట్లు ఏం రేటు నడుస్తున్నయే. జిల్లా అయ్యింది గదా ఒక ప్లాటు తీసుకుందమనుకుంటున్న. పిల్లలు అక్కడనే చదువుతున్నరు. ఇగ ఎప్పటికైనా ఆన్నే ఇల్లు కట్టుకోవాలనుంది. నీకు జర ప్లాట్లు, భూముల గురించి తెలుసు గదా.. మరి ఎప్పుడు రమ్మంటవ్‌..’ అని ఓ మండల కేంద్రంలో కిరాణా దుకాణం నడుపుకుంటున్న రాజేశ్‌ తనకు వరసకు మామ అయిన గంగాధర్‌కు ఫోన్‌ చేశాడు. ‘అల్లుడు.. ఇప్పుడైతే నిర్మల్‌ల ప్లాట్ల రేట్లు మస్తు పెరిగినై. జిల్లా అవుడేమో గానీ.. ఎటు చూసినా ప్లాట్లే. కానీ ధరలే భగ్గు మంటున్నయి. ఈడ కొనే బదులు ఊళ్లే ఒక ఎకరం పొలం కొనొచ్చు..’ అంటూ నిర్మల్‌లో రియల్‌దందా గురించి గంగాధర్‌ చెప్పుకుంటూ వచ్చాడు. ఈ మాటలకు ‘అమ్మా... ఇంత ధరలా..’ అంటూ రాజేశ్‌ అవాక్కయ్యాడు. ప్రస్తుతం నిర్మల్‌తో పాటు భైంసా, ఖానాపూర్‌ వంటి పట్టణాల్లో నడుస్తున్న రియల్‌దందా చూస్తే ఎవరైనా అవాక్కవ్వాల్సిందే. రెండు నెలల కిందట రూ.3లక్షలు పలికిన ప్లాటు ధర ఇప్పుడు ఏకంగా రూ.10–12లక్షలు పలుకుతోంది. అదీ.. ఎలాంటి అనుమతులు తీసుకోకుండానే చేసిన భూముల్లోనే.. ఇక అన్ని అనుమతులు తీసుకుని చేసిన కాలనీల్లో రూ.25లక్షల వరకు ప్లాట్ల ధరలున్నాయి. జిల్లా పేరు చెప్పి.. సమీకృత భవనాల నిర్మాణాలంటూ.. ఇష్టానుసారంగా ధరలు పెంచేస్తున్నారు. నిబంధనలు తుంగలో తొక్కుతూ.. వెంచర్లు వేస్తూ.. ప్లాట్లు విక్రయిస్తున్నారు. ప్రస్తుత బూమ్‌ను రియల్టర్‌లు క్యాష్‌ చేసుకుంటున్నారు. 


రియల్‌ ‘పంట’.. 


నిర్మల్‌ జిల్లా కావడం ప్రజలకు ఎంత ఉపయోగకరంగా ఉందో..లేదో తెలియదు గానీ.. రియల్‌ వ్యాపారుల పంట మాత్రం పండుతోంది. పెద్దనోట్ల రద్దుతో కాస్త బలహీనపడ్డ వెంచర్లు.. ఇప్పుడు మళ్లీ ఊపందుకుంటున్నాయి. నిన్నమొన్నటి వరకు రూ.2–4లక్షలు పలికిన ప్లాట్లు కూడా ఇప్పుడు రూ.10లక్షల వరకు పలుకుతున్నాయి. నిర్మల్‌ చుట్టూ కొన్ని కిలోమీటర్ల దూరం వరకు ప్లాట్లు చేస్తున్నారు. ప్రధానంగా సమీకృత భవనాలు ఇక్కడే నిర్మిస్తారంటూ నిర్మల్‌–ఎల్లపెల్లి మార్గంలో విపరీతంగా వెంచర్లు ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో చాలా వాటికి అనుమతులు, నిబంధనలు మాత్రం కనిపించడం లేదు.

 
పచ్చని పొలాలే ప్లాట్లుగా..  


నెలక్రితం వరకు పంటలు పండించిన పొలాల్లో ఇప్పుడు ప్లాట్లు వెలిశాయి. పచ్చని పంటలను పండించిన భూములను కాస్త విశాల వెంచర్లు మార్చేస్తున్నారు. జిల్లాకేంద్రం కావడంతోనే భూముల ధరలకు బూమ్‌ వచ్చింది. జిల్లాలోని వివిధ మండలాల వాళ్లు నిర్మల్‌లో సెటిల్‌ కావాలని కోరుకుంటున్నారు. ఉద్యోగ, ఉపాధ్యాయ, వ్యాపార వర్గాల వారూ ప్లాట్లు కొనిపెట్టుకోవాలనుకుంటున్నారు. దీన్నే రియల్‌ వ్యాపారులు క్యాష్‌ చేసుకుంటున్నారు. గతంలో ఉన్న ధరలను మూడింతలు, నాలుగింతలు చేసి విక్రయిస్తున్నారు. ప్రస్తుతం నిర్మల్‌ నుంచి 10 కిలో మీటర్ల వరకు ఎటు చూసినా ప్లాట్లే కనిపిస్తున్నాయనడంలో అతిశయోక్తి లేదు. 


పల్లెల్లోకి చొచ్చుకెళ్లిన వెంచర్లు.. 


నిర్మల్‌కు చుట్టూ ఉన్న మంజులాపూర్, తల్వేద, లంగ్డాపూర్, వెంగ్వాపేట్, చిట్యాల, కడ్తాల్, వెంకటాపూర్, అక్కాపూర్, కొండాపూర్, ఎల్లపెల్లి, అనంతపేట్, విశ్వనాథ్‌పేట్‌ ఇవన్నీ ఇప్పుడు ప్లాట్లకు కేరాఫ్‌గా మారాయి. నిన్నటి దాకా పచ్చని పంటలు పండిన పల్లెభూములు ఇప్పుడు రియల్‌ వెంచర్లుగా మారిపోయాయి. రోడ్లు, మొరం, సూచికలతో కనిపిస్తున్నాయి. ఒకప్పుడు పల్లెల నుంచి పట్టణానికి వస్తే.. ఇప్పుడు భూములు కొనేందుకు పట్నంవాసులు చుట్టుపక్కల ఉన్న పల్లెలకు పరుగుపెడుతున్నారు. నిర్మల్‌ పట్టణంలో ప్రస్తుతం ప్లాటు ధర రూ.15లక్షల నుంచి రూ.25లక్షల వరకు పలుకుతోంది. పల్లెల్లో రూ.4లక్షల నుంచి రూ.8లక్షల వరకు ఉంది. ఇప్పుడే కొనిపెట్టుకుంటే మున్ముందు మంచి ధర వస్తుందన్న నమ్మకంతో పల్లెలోనూ ప్లాట్లు కొనుగోలు చేస్తున్నారు.

 
‘సమీకృతం’ పేరు చెప్పి.. 


జిల్లాకేంద్రంలో గతంలో భీమన్నగుట్టపై సమీకృత కలెక్టరేట్‌ నిర్మించనున్నారని తెలియడంతోనే చుట్టుపక్కల ఇష్టానుసారంగా ప్లాట్లు చేశారు. అనంతరం వివిధ సంఘాలు, పార్టీల ఆందోళనలతో భీమన్నగుట్టపై నిర్మాణాలు రద్దయ్యాయి. ఇప్పుడు అదే మార్గంలో ఇంకాస్త ముందుకు వెళ్తే.. బత్తీస్‌గఢ్‌ పక్కన గల కొచ్చెరువు ప్రాంతంలో నిర్మాణాలు చేపట్టేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే అక్కడ నాగార్జున కన్‌స్ట్రక్షన్‌ కంపెనీ భూమి చదును పనులు చేపడుతోంది. ఈక్రమంలో ఇక్కడే సమీకృత భవనాలు నిర్మించనున్నారని చెప్పి చుట్టూ ఉన్న ఐదు కిలోమీటర్ల వరకు పంటభూములన్నింటినీ ప్లాట్లుగా మార్చేశారు. ఇక్కడ ధరలు రెండింతలు చేశారు. ఈ ప్రాంతంలో రూ.2లక్షలు ఉన్న ప్లాటు ధర ఇప్పుడు రూ.8.50లక్షలకు విక్రయిస్తున్నారు. పైగా ప్లాటు స్థలాన్ని కూడా తగ్గిస్తున్నారు.  

 
నిబంధనల మాటే లేదు.. 


జిల్లాకేంద్రం చుట్టూ చేస్తున్న వెంచర్లలో 90శాతం నిబంధనలకు విరుద్ధంగానే ఉన్నాయి. లే అవుట్‌ పర్మిషన్‌ లేకుండా, నాలా పన్ను చెల్లించకుండా, అనుమతి లేకుండానే ప్లాట్లు చేసి విక్రయిస్తున్నారు. ఈ విషయం అధికారులకు తెలిసినా ఏం చేయలేని పరిస్థితి. నిర్మల్‌లో ఉన్న రియల్‌ వ్యాపారంలో అధికశాతం రాజకీయంగా పెద్ద తలకాయల చేతుల్లోనే ఉంది. వారిని కాదని.. తామేం చేయలేమని కొంతమంది అధికారులు బహిరంగంగా చెబుతున్నారు. ఇక.. ఈ ప్లాట్ల ఏర్పాటు కోసం ఇష్టానుసారంగా గుట్టలు తవ్వేస్తున్నారు. అనుమతి లేకుండా లారీలకొద్దీ మొరం తరలిస్తున్నారు. ప్రకృతి సంపదను కొల్లగొడుతున్నా.. ‘అధికార’ పక్షం అండ ఉండడంతో అధికారులు ఏం చేయలేని పరిస్థితి.


నాలా ప్రకారం పన్ను చెల్లించాలి 


నాలా(నాన్‌ అగ్రికల్చరల్‌ ల్యాండ్స్‌ అసెస్‌మెంట్‌) యాక్ట్‌ ప్రకారం పన్ను చెల్లించిన తర్వాతనే వ్యవసాయ భూములను వ్యవసాయేతర భూములుగా మార్చుకోవాల్సి ఉంటుంది. అలా కాకుండా వ్యవసాయ భూముల్లో ప్లాట్లు చేయడం చట్టవిరుద్ధం. అనుమతి తీసుకున్న తర్వాతే వ్యవసాయేతర భూముల్లో ప్లాట్లు వేయాలి. 
ప్రసూనాంబా, ఆర్డీవో, నిర్మల్‌ 

అనుమతుల్లేని వాటికి నోటీసులు 


మున్సిపల్‌ పరిధిలో ఏర్పాటు చేస్తున్న వెంచర్లు, ప్లాట్లు కచ్చితంగా లే అవుట్‌ పర్మిషన్లు తీసుకోవాలి. అలా అనుమతి లేకుండానే ప్లాట్లు చేసి, విక్రయిస్తున్న విషయం మా దృష్టికి వచ్చింది. ఇప్పటికే పలు వెంచర్లకు నోటీసులు అందించాం. సోఫీనగర్, గాజుల్‌పేట్‌ తదితర చోట్ల ప్లాట్లలో రాళ్లు తొలగించాం. నిర్మల్‌కు పూర్తిస్థాయి టీపీఎస్, సరిపడా సిబ్బంది లేకపోవడం కూడా వీటి నివారణలో కొంత ఇబ్బందిగా మారుతోంది. 
మంద రవిబాబు, మున్సిపల్‌ కమిషనర్, నిర్మల్‌  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement