భూములు పరిరక్షిస్తా...
సిటీబ్యూరో: హైదరాబాద్ జిల్లాలో ప్రభుత్వ భూముల పరిరక్షణే లక్ష్యంగా పని చేస్తానని కలెక్టర్ రాహుల్ బొజ్జా తెలిపారు. నగరంలో భూ సమస్య ప్రధానమైనదిగా గుర్తించినట్లు పేర్కొన్నారు. హైదరాబాద్ నూతన కలెక్టర్‌గా సోమవారం ఆయన పదవీ బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా మీడియాతోమాట్లాడుతూ ఇతర జిల్లాలకు, హైదరాబాద్‌కు పాలన పరంగా చాలా వ్యత్యాసం ఉంటుందన్నారు. అర్బన్ ప్రజల అవసరాలకు అనుగుణంగా ప్రభుత్వ ప్రాధాన్యాల మేరకు సేవలు అందించాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. విద్య, వైద్యం, సంక్షేమ రంగాలపై ప్రత్యేక దృష్టి సారించనున్నట్లు తెలిపారు. గతంలో వరంగల్, మెదక్‌లలో కలెక్టర్‌గా పని చేసిన అనుభవంతో హైదరాబాద్ జిల్లా సమగ్రాభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. ఇక్కడ భూ వివాదాలు ఎక్కువగా ఉన్నట్టు గ్రహించానన్నారు. వాటి పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. జీవో 59కు అనుగుణంగా ఇళ్ల క్రమబద్ధీకరణ వేగవంతానికి చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.
కలెక్టర్‌ను కలిసిన అధికారులు
నూతనంగా బాధ్యతలు చేపట్టిన కలెక్టర్ రాహుల్ బొజ్జాను ఉన్నతాధికారులు, వివిధ శాఖల అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. జాయింట్ కలెక్టర్ కె. సురేంద్రమోహన్, ఏజేసీ కె.రాజేందర్, డీఆర్‌ఓ అశోక్ కుమార్, ఆర్డీఓలు నిఖిల, రఘురాం శర్మ, జిల్లా అధికారులు మోతీలాల్, సోమిరెడ్డి, వివిధ సంక్షేమ శాఖల అధికారులు, జిల్లా గెజిటెడ్ అధికారుల సంఘ అధ్యక్షుడు కృష్ణయాదవ్, రెవెన్యూ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు విష్ణుసాగర్ , వీఆర్‌ఓల సంఘ నాయకుడు సతీష్, నాలుగో తరగతి సిబ్బంది అసోసియేషన్ అధ్యక్షుడు సదానంద్, కలెక్టరేట్ అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది కలిశారు. పుష్పగుచ్ఛాలు అందించి కలెక్టర్‌కు స్వాగతం పలికారు.