సాక్షి, హైదరాబాద్: దళితబంధు పథకం రెండో విడత అమలుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతులు ఇవ్వడంతో ఆశావహుల్లో ఉత్సాహం రెట్టించింది. ఈ పథకం కింద 2022–23 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం రూ.17,700 కోట్లు బడ్జెట్‌లో కేటాయించినప్పటికీ.. పథకం అమలుకు మార్గదర్శకాలు జారీ చేయకపోవడంతో ఎంపిక ప్రక్రియ ముందుకు సాగలేదు. కాగా, ఈ ఏడాది కూడా ప్రభుత్వం బడ్జెట్‌లో రూ.17,700 కోట్లు కేటాయించింది.
ఈ క్రమంలో తాజాగా నియోజకవర్గస్థాయిలో పథకం అమలు, లబ్దిదారుల ఎంపిక ప్రక్రియ.. తదితరాలకు సంబంధించి అనుమతులిస్తూ ఎస్సీ అభివృద్ధి శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. తక్షణమే లబ్దిదారుల ఎంపిక ప్రక్రియను ప్రారంభించాలంటూ జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. ఇదిలా ఉండగా ఈ పథకానికి ఎస్సీ కుటుంబాలను గుర్తించి వారి అర్హతను నిర్ధారించాలని ఉత్తర్వుల్లో తెలిపినప్పటికీ అధికారుల్లో మాత్రం స్పష్టత లేదని తెలుస్తోంది.
ఎంపికపై స్పష్టత కరువు..!
ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ప్రభుత్వం దళితబంధు పథకాన్ని అమలు చేస్తున్నప్పటికీ.. ప్రత్యేకంగా దళితబంధు పోర్టల్‌ను రూపొందించింది. దీంతోపాటు మొబైల్ యాప్‌ను కూడా త యారు చేయించిన ప్రభుత్వం.. పథకం అమలులో పారదర్శ కత కోసం లబ్దిదారుల వివరాలు, యూనిట్ల ఏర్పాటు, పథ కం పురోగతి తదితరాలన్నీ పోర్టల్, యాప్‌ల ద్వారానే నిర్వ హించనుంది.
ఈ అంశాలన్నీ తాజాగా జారీ చేసిన ఉత్తర్వు ల్లో పేర్కొన్నప్పటికీ లబ్దిదారుల ఎంపికపైన మాత్రం ఉత్తర్వుల్లో వివరణ ఏమీ లేదని చెపుతున్నారు. నియోజకవర్గస్థాయిలో ప్రజాప్రతినిధి సహకారంతో ఎస్సీ కుటుంబాలను గు ర్తించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. దీంతో నియోజకవర్గస్థాయి ప్రజాప్రతినిధిగా ఎమ్మెల్యే ఉండడంతో ఆయన సహకారంతో అర్హులను ఎంపిక చేసే వీలుంటుంది. కానీ క్షేత్రస్థా యి నుంచి దరఖాస్తులు స్వీకరించాలా? లేక ఎమ్మెల్యే సూ చించిన పేర్లతో కూడిన జాబితాను ఆమోదించాలా? అనే అంశాన్ని అధికారులు తేల్చుకోలేకపోతున్నారని సమాచారం.
వసూళ్లపర్వం బహిరంగమే..
దళితబంధు పథకంలో పెద్ద ఎత్తున వసూళ్లు జరిగినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఒక్కో లబ్దిదారు నుంచి పెద్ద మొత్తంలోనే డబ్బులు వసూలు చేస్తున్నారని, ఇందుకు సంబంధించి పూర్తి సమాచారం తన వద్ద ఉందంటూ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సైతం హెచ్చరించారు. ఇలాంటివి సహించబోనని ఆయన స్పష్టంచేశారు. మరోవైపు ఈ పథకం అమలులో పక్షపాత వైఖరి ఉందంటూ కొందరు హైకోర్టును ఆశ్రయించగా.. అర్హుల ఎంపికలో ఎమ్మెల్యే జోక్యం ఉండకూదని తీర్పు ఇచ్చింది.
ఈ క్రమంలో కొత్తగా మార్గదర్శకాలు వస్తాయని ఎస్సీ కార్పొరేషన్ భావించింది. ఇందులో భాగంగానే గతేడాది ఈ పథకాన్ని అమలు చేయలేదని తెలుస్తోంది. తాజాగా ఎస్సీ అభివృద్ధి శాఖ ఇచ్చిన ఉత్తర్వుల్లోనూ ఈ అంశంపై స్పష్టత లేకపోవడం.. పాత విధానాన్నే అమలు చేసేలా సూచనలు ఇవ్వడం పట్ల క్షేత్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి. ఎమ్మెల్యేలకే లబ్దిదారుల ఎంపిక బాధ్యతలు ఇవ్వడంవల్ల అక్రమాలు మరింత ఎక్కువగా జరుగుతాయని పలువురు ఆక్షేపిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment