సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పేద దళితులకు ఇస్తున్న దళితబంధు పథకంలో ఎమ్మెల్యే సిఫార్సు అవసరం లేదని హైకోర్టు స్పష్టం చేసింది. లబ్ధిదారుడి అర్హత మేరకు పథకానికి ఎంపిక చేయాలని అధికారులను ఆదేశించింది. ప్రభుత్వ పథకాల్లో రాజకీయ జోక్యం కూడదని తేల్చిచెప్పింది. అసలు లబ్ధిదారులను ఎంపిక చేయడానికి వారెవరని ప్రశ్నించింది. తమకు దళితబంధు ఇప్పించాలంటూ కొందరు వరంగల్ కలెక్టర్‌కు దరఖాస్తు చేసుకున్నారు.
అయితే ఎమ్మెల్యే సిఫార్సు లేకుండా దరఖాస్తు స్వీకరించలేమని తిరస్కరించారు. దీంతో టీఆర్‌ఎస్ పార్టీ కార్యకర్తలకు మాత్రమే పథకాన్ని అందజేస్తున్నారని.. ఇతరులు అర్హులైనా వారి దరఖాస్తును తిరస్కరిస్తున్నారని వరంగల్‌కు చెందిన జన్ను నూతన్‌బాబు సహా పలువురు హైకోర్టును ఆశ్రయించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, సాంఘిక సంక్షేమ శాఖ కార్యదర్శి, ఎస్సీ అభివృద్ధి శాఖ కమిషనర్, వరంగల్ జిల్లా కలెక్టర్, వరంగల్ ఎస్సీ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌ను ప్రతివాదులుగా చేర్చారు.
దీనిపై న్యాయమూర్తి జస్టిస్ పి.మాధవిదేవి విచారణ చేపట్టారు. పిటిషనర్ల తరఫున న్యాయవాది రాపోలు భాస్కర్ వాదనలు వినిపించారు. ప్రజల డబ్బుతోనే పథకాలు నిర్వహణ జరుగుతోందని.. అర్హులైన వారికి వాటిని వర్తింపజేయాల్సి ఉందన్నారు. అయితే కొన్నిచోట్ల ఎమ్మెల్యేల సిఫార్సు ఉంటే తప్ప.. దరఖాస్తులు స్వీకరించమని అధికారులు చెబుతున్నారని వెల్లడించారు.
దీంతో టీఆర్‌ఎస్ కార్యకర్తలకు మాత్రమే దళితబంధు అందుతోందని.. ఇతర అర్హులకు నిరాశే ఎదురవుతోందని చెప్పారు. వాదనలు విన్న న్యాయమూర్తి.. అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వరంగల్ జిల్లా కలెక్టర్ ఈ ఏడాది మార్చి 17న, ఏప్రిల్ 20న విడుదల చేసిన ఆదేశాలను తప్పుబడుతూ కొట్టివేసింది. పిటిషనర్ల దరఖాస్తులను ఎంపిక కమిటీకి పంపాలని ఆదేశించింది. పథకం మార్గదర్శకాల మేరకు అర్హులైతే వారిని ఎంపిక చేయాలంది. రాజకీయ నాయకుల జోక్యం లేకుండా అర్హులను ఎంపిక చేయాలని ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment