అమరుల కుటుంబాలకు రూ.10 లక్షలు
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ ఉద్యమంలో ప్రాణాలర్పించిన అమరవీరుల కుటుంబాలకు హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి ఆర్థిక సహాయం చేశారు. శనివారం సచివాలయంలో ఐదు కుటుంబాలకు రూ. 10 లక్షల చొప్పున చెక్కులు ఇచ్చారు. 1969 తెలంగాణ ఉద్యమంలో అసువులుబాసిన కె.వెంకటేశ్వరరావు, ఎన్.నాగభూషణం, ఎస్.నర్సింగరావు, పి.విజయ్ కుటుంబ సభ్యులకు, 2001 మలి దశ ఉద్యమంలో ప్రాణాలర్పించిన చెట్టి కనకయ్యలకు చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నాయిని మాట్లాడుతూ, హైదరాబాద్ జిల్లాలో అమరవీరుల కుటుంబాల నుంచి 23 దరఖాస్తులు అందాయని, వాటిలో 8 మందికి ఇప్పటికే ఆర్థిక సహాయం చేశామని తెలిపారు.
ఎంత డబ్బు ఇచ్చినా వారిని తిరిగి తీసుకురాలేమని, కానీ వారి త్యాగాన్ని గుర్తు చేసుకుంటూ తమ ప్రభుత్వం ఎల్లవేళలా సహకరిస్తుందన్నారు. ఇళ్లు లేనివారికి ఇళ్లు, ఉద్యోగం లేని వారికి ఉద్యోగం ఇవ్వడం వంటి నిర్ణయాలను మంత్రివర్గం ఆమోదించిందన్నారు. జిల్లా మంత్రులు వారి జిల్లాల్లో అమరవీరులను గుర్తించి వారి కుటుంబాలకు ఆర్థిక సహాయం చేశారన్నారు. జీఓను సవరించి 1969లో చనిపోయిన వారికీ ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నామన్నారు. ఇంకా ఎవరైనా అమరవీరుల కోటా కింద దరఖాస్తు చేసుకోదలిస్తే సంబంధిత కలెక్టర్ కార్యాలయంలో చేయవచ్చని సూచించారు.
తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ఉద్యమకారులపై పెట్టిన వెయ్యి కేసులు ఎత్తివేశామన్నారు. ఇంకేమైనా కేసులు పెండింగ్‌లో ఉంటే వాటిని కూడా ఎత్తివేసే ప్రయత్నం చేస్తామన్నారు. రైల్వే కేసులకు సంబంధించిన కేసుల పరిష్కారం కోసం కేంద్రానికి లేఖ రాశామన్నారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ కలెక్టర్ రాహుల్ బొజ్జా, డీఆర్‌ఓ అశోక్‌కుమార్, ఆర్డీఓ నిఖిల, తహశీల్దార్లు శ్రీనివాస్‌రెడ్డి, సుజాత, అనురాధ పాల్గొన్నారు.