ప్రపంచీకరణ అనంతరం వ్యక్తివాదం పెరిగి పోయి ఉద్యమాలు ఉండవు అనే ప్రచారం బలంగా నడుస్తున్న కాలంలో ప్రాంతీయ అస్తిత్వ వేదనలోంచి ఎగిసిన విముక్తి పోరాటం తెలంగాణ ఉద్యమం. పల్లెల నుండి పట్టణాల దాకా తెలంగాణ అనని మనిషి లేడు. కులాలు, మతాలకతీతంగా అందరూ ఒక్క గొంతుకగా నినదించిన నినాదం ‘జై తెలంగాణ’. అందులో ముఖ్య భూమిక విద్యార్థులది.
మంటలై మండింది, రైళ్ళకు ఎదురెళ్లి ముక్కలైంది, ఉరిపోసుకున్నది, పురుగుల మందు తాగింది. ఏది చేసినా తెలంగాణ అనే ఉద్యమ కాగడను ఆరిపోకుండా చమురు పోసి మండించేందుకే. పాలకులు, ప్రధాన స్రవంతి రాజకీయ నాయకులు ఉద్యమానికి ద్రోహం చేసినప్పుడు మొత్తం తెలంగాణ ఉద్యమాన్ని నడిపించింది విద్యార్థులే.
విద్యార్థులు ఉద్యమాన్ని తమ చేతుల్లోకి తీసుకోవడం వెనుక స్వాతంత్య్ర ఉద్యమం, రైతాంగ సాయుధ పోరాటం, తొలిదశ తెలంగాణ ఉద్యమం, నక్సల్బరీ పోరాటాల స్పూర్తి, ప్రభా వాలు ఉన్నాయి. ఆ చైతన్యమే తెలంగాణ ఉద్యమాన్ని ఉవ్వెత్తున ఎగిసేలా చేసింది. అట్లా ఎగిసిన విద్యార్థి ఉద్యమం రాజకీయ పార్టీల కనుసన్నల్లోకి ఎలా పోయింది? దానికి పని చేసిన శక్తులేవి? తెలంగాణ ఉద్యమం ఏకశిలా సదృశ్యం అనుకుంటున్న చోట నిలబడిన, కలబడిన, వెనక్కి తగ్గిన శక్తులను బహిర్గత పరచిన పరిశోధన ఈ పుస్తకం. ఒక్కమాటలో, కళ్ళముందే వక్రీకరణలకు గురవుతున్న తెలంగాణ ఉద్యమ వాస్తవ చరిత్ర ఇది. ఈ పరిశోధన తెలంగాణ ఉద్యమకారుడే (నలమాస కృష్ణ) పరిశోధకుడిగా చేసిన ప్రయత్నం.
ఇది అకడమిక్ పరిశోధన కాబట్టి దీనికి పరిమితులు ఉన్నా... ఇది ఉస్మానియా యూనివర్సిటీ కేంద్రంగా జరిగిన మలిదశ తెలంగాణ ఉద్యమాన్ని సమగ్రంగా నమోదు చేసిందని మాత్రం చెప్పవచ్చు. అలా భవిష్యత్తు పరిశోధనకు దారులు వేసిందన్నమాట. ఉద్యమం నడుస్తుండగానే తీరికలేని కార్యాచరణలో దాని తీరూ తెన్నులపై చేసిన ఓ విశ్లేషణ ఇది. ఆ పరిమితుల్లో దీన్ని అర్థం చేసుకుంటూ అధ్యయం చేయాల్సి ఉంటుంది. ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ ప్రాంగణంలో జరుగనున్న ఈ పుస్తకావిష్కరణకు అందరూ ఆహ్వానితులే. – అరుణాంక్, డేవిడ్ (నేడు హైదరాబాద్‌లో ‘ఉస్మానియా వెలుగులో తెలంగాణ విద్యార్థి ఉద్యమం’ పుస్తకావిష్కరణ)
Comments
Please login to add a commentAdd a comment