తెలుగు సాహిత్యానికి యువ రచయితల అక్షరాభిషేకం
విభిన్న ఇతివృత్తాలతో వైవిధ్యభరిత రచనలు
రెండో రోజు పుస్తక ప్రదర్శనలో సందర్శకుల సందడి
సాక్షి, హైదరాబాద్: పుస్తకం కొత్త పుంతలు తొక్కుతోంది. యువతరం సృజనాత్మకతకు పట్టం కడుతోంది. కథ, నవల, చరిత్ర, ప్రక్రియ ఏదైనా సరే కొత్త తరం ఆలోచనలకు, భావజాలానికి ఊపిరిలూదుతోంది. సామాజిక మాధ్యమాల ఉద్ధృతిలో.. పుస్తక పఠనం ప్రమాదంలో పడిపోయిందనే ఆందోళన వెల్లువెత్తుతున్న ప్రస్తుత తరుణంలోనూ ఠీవీగా దర్శనమిస్తోంది. వైవిధ్యభరితమైన సాహిత్యంతో పాఠకులను ఆకట్టుకొంటోంది. సామాజిక జీవనంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా సరికొత్త ఇతివృత్తాలతో పాఠక ప్రపంచాన్ని తట్టి లేపుతోంది. పుస్తకానికి ఏ మాత్రం ఆదరణ తగ్గలేదనేందుకు నిదర్శనంగా నిలుస్తోంది.
ఒక్కో వందలు, వేల సంఖ్యలో అమ్ముడవుతోంది. ఈ క్రమంలోనే నవ తరం పాఠకుల అభిరుచికి ప్రాతినిధ్యం వహించే కొత్తతరం రచయితలు ముందుకు వస్తున్నారు. తమదైన ప్రాపంచిక దృక్పథంతో, భావజాలంతో అద్భుతమైన రచనలు చేస్తున్నారు. హైదరాబాద్ జాతీయ పుస్తక ప్రదర్శనలో యువ రచయితల పుస్తకాలు, స్టాళ్లు పాఠకులను ఆకట్టుకుంటున్నాయి. హైదరాబాద్ బుక్ ఫెయిర్ కమిటీ రచయితల కోసం స్వయంగా 7 స్టాళ్లను ఏర్పాటు చేసింది. మరోవైపు పలు ప్రచురణ సంస్థలు సైతం యువ రచయితలకు సముచితమైన ప్రోత్సాహాన్ని అందజేస్తున్నాయి. ఇంచుమించు అన్ని స్టాళ్లలోనూ కొత్త తరం రచయితల పుస్తకాలు కనిపిస్తున్నాయి. రెండో రోజు శుక్రవారం పుస్తక ప్రదర్శన సందర్శకులతో కళకళలాడింది.
కొత్తగా.. పొత్తమొచ్చెనా..
హైదరాబాద్ పుస్తక ప్రదర్శన ప్రతి సంవత్సరం కొత్త రచయితలను పరిచయం చేస్తోంది. ఏటా లక్షలాది మంది పాఠకులు పుస్తక ప్రదర్శనకు తరలి వస్తున్నారు. వేలాది పుస్తకాలు అమ్ముడవుతున్నాయి. సమస్త ప్రపంచం మొబైల్ ఫోన్‌లోనే ఇమిడి ఉందని భావిస్తున్న పరిస్థితుల్లోనూ పుస్తకమే సమస్తమై పాఠకులకు చేరువవుతోంది. కొత్తగా రాయాలనుకొనే ఎంతోమందికి ఇది స్ఫూర్తినిస్తోంది. ‘ప్రతి సంవత్సరం బుక్‌ఫెయిర్‌కు వస్తాను. మొదట్లో పెద్దగా పుస్తకాలు చదివే అభిరుచి కూడా లేదు.. కానీ క్రమంగా అలవాటైంది. ఓ 20 పుస్తకాలు చదివిన తర్వాత నేను కూడా రాయగలననే ఆత్మస్థైర్యం వచ్చింది.
ఇప్పుడు రాస్తున్నాను’ అని ఓ యువ రచయిత అభిప్రాయపడ్డారు. సామాజిక దృక్పథంతో రాస్తున్నవాళ్లు కూడా వినూత్నంగా తమ ఆలోచనలను ఆవిష్కరిస్తున్నారు. ‘తాము సైతం’ అంటూ హైదరాబాద్ పుస్తక ప్రదర్శనలో భాగస్వాములవుతున్న పలువురు యువ రచయితలు ‘సాక్షి’తో తమ అభిప్రాయాలను, ఆలోచనలను ఇలా పంచుకున్నారు.
రచయితగా మారిన పాఠకుడిని: సురేంద్ర శీలం
నేను రచయితను కాదు. పాఠకుడిని. నిజానికి 2019 వరకు పుస్తకాలు పెద్దగా చదవలేదు. ప్రతి సంవత్సరం పుస్తక ప్రదర్శనకు మాత్రం వచ్చాను. మొదట పాఠకుడిగా మారాను. ఆ తర్వాత రాయడం అలవడింది. 2022లో రాసిన ‘పాల్వెట్ట’కు రావిశాస్త్రి సాహితీ పురస్కారం లభించింది. యండమూరి అవార్డు కూడా వచ్చింది. ఇప్పుడు ‘నడూరి మిద్దె’ నవలతో పాఠకుల ముందుకు వచ్చాను.
చిన్నప్పటి నుంచి రాస్తున్నాను కడలి, రచయిత్రి
మా నాన్న పేరు రవి. ఆయన రచయిత. ఆ స్ఫూర్తితో చిన్నప్పటి నుంచి రాస్తున్నాను. ప్రేమ, స్నేహం, మానవీయ విలువలను ప్రధాన అంశాలుగా చేసుకొని రాశాను. చిక్‌లిట్ కొత్తగా రాసిన నవల. వెయ్యి కాపీలు ప్రింట్ వేశాం. ఇప్పటికే 500 కాపీలు అమ్ముడయ్యాయి. స్త్రీలకు గొంతుకనివ్వడమే నా రచనల ప్రధాన లక్ష్యం. కొన్ని సినిమాలకు స్క్రీన్‌ప్లేలు కూడా రాశాను. గతంలో రాసిన ‘లెటర్స్ లవ్’ కథల పుస్తకం బాగా అమ్ముడైంది.ఇప్పటి వరకు మూడు, నాలుగు పుస్తకాలు రాశాను.
తాతి్వక దృక్పథంతో రాయడం ఇష్టం మహి బెజవాడ
మొదటిసారి 2013లో ‘ఊదారంగు చినుకులు’ కథ రాశాను.‘సాక్షి’ పత్రికలో అచ్చయింది. అంతకుముందు బ్లాగ్స్‌కు ఎక్కువగా రాసేవాడిని. సాక్షిలో ప్రచురించడంతో ఉత్సాహం వచ్చింది. ఏదైనా సరే కొత్తగా చూడడం ఇష్టం. జీవితం, ప్రేమ వంటి విలువల పట్ల నాదైన తాతి్వక దృక్పథంతో రాస్తున్నాను. ఇప్పుడు గన్స్‌అండ్ మాన్సూన్స్‌తో పాఠకుల వద్దకు వచ్చాను.
కష్టాల నుంచి ‘అన్విక్షికి’ ఆవిర్భావం: వెంకట్ శిద్ధారెడ్డి
మొదట్లో నేను రాసిన కథలు, నవలలు అచ్చువేయడం చాలా కష్టంగా ఉండేది. ప్రచురణ సంస్థలు ముప్పుతిప్పలు పెట్టేవి. ఒక పుస్తకాన్ని ప్రచురించి విక్రయించేందుకు రచయితలే డబ్బులు ఇవ్వాలి. చివరకు వాళ్లకు మిగిలేదేం ఉండదు. ఈ అనుభవాలే ‘అనీ్వక్షికి’ ప్రచురణ సంస్థను ఏర్పాటు చేసేందుకు దారితీశాయి. ఇప్పటి వరకు మా సంస్థ నుంచి 200 మంది కొత్త రచయితలు వెలుగులోకి వచ్చారు. ఈ ఏడాది 65 కొత్త పుస్తకాలను ప్రచురించాం. ఒక్కో పుస్తకం ఒక్క రోజులోనే వెయ్యి కాపీలు అమ్ముడైన సందర్భాలు ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment