పుస్తక ప్రదర్శనలో సందర్శకుల కిటకిట
సాక్షి, హైదరబాద్: నగరంలోని ఎన్టీఆర్ స్టేడియంలో కొలువుదీరిన హైదరాబాద్ జాతీయ పుస్తక ప్రదర్శన ఆదివారం సందర్శకులతో పోటెత్తింది.సెలవురోజు కావడంతో పుస్తక ప్రియులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. యువత, విద్యార్థులు, పిల్లలతో స్టాళ్లు కిటకిటలాడాయి. ముఖ్యంగా చిన్నారులు తమకిష్టమైన ఆంగ్ల కథలు, క్లాసిక్స్ పుస్తకాలను విరివిగా కొనుగోలు చేశారు. ఒకవైపు పుస్తక ఆవిష్కరణలు, మరోవైపు సాంస్కృతిక కార్యక్రమాలు, పుస్తక సమీక్షలు, అమ్మకాలతో సందడి నెలకొంది.
పుస్తక ప్రదర్శన కేవలం పుస్తకాల అమ్మకాలకు మాత్రమే పరిమితం కాకుండా రచయితలను, పాఠకులను ఒకచోట చేర్చే వేదికగా మారింది. ప్రదర్శన ప్రారంభమై నాలుగు రోజులైంది. రెండు రోజులుగా పుస్తక ప్రియుల నుంచి అనూహ్య స్పందన కనిపిస్తోందని నిర్వాహకులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ‘కొత్త సంవత్సరం పుస్తక పఠనంతో ప్రారంభం కావాలనే ఆకాంక్షతో ఎక్కువ మంది తమకు నచి్చన పుస్తకాలను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. సాధారణంగా వయోధికులే ఎక్కువగా పుస్తకాల పట్ల ఆసక్తి, అభిరుచి కలిగి ఉంటారనే అభిప్రాయాన్ని పటాపంచలు చేస్తూ యువత పెద్ద సంఖ్యలో కనిపించడం విశేషం.
రాజ్యాంగం 5 రకాలుగా..
భూమిపుత్ర, బహుజన పుస్తక ప్రచురణ సంస్థలకు చెందిన స్టాల్ నంబర్లు 203, 204లలో భారత రాజ్యాంగం గ్రంథాలు అందుబాటులో ఉన్నాయి. బాబా సాహెబ్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ రాసిన రాజ్యాంగాన్ని పిల్లలు, పెద్దలు నచ్చేలా 5 రకాలుగా ముద్రించి ప్రదర్శనలో ఉంచారు.
నేడు పుస్తక నడక..
పుస్తక పఠనంపై ప్రజల్లో ఆసక్తిని, అభిరుచిని, అవగాహనను పెంపొందించే లక్ష్యంతో సొమవారం పుస్తక నడక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామని హైదరాబాద్ బుక్ ఫెయిర్ కమిటీ నిర్వాహకులు తెలిపారు. లోయర్ ట్యాంక్‌బండ్ నుంచి ఎనీ్టఆర్ స్టేడియం వరకు జరగనున్న ప్రదర్శనలో పాఠకులు, రచయితలు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు పాల్గొననున్నారు.
Comments
Please login to add a commentAdd a comment