ఉవ్వెత్తున ఎగసిన ‘ప్రత్యేక’ నినాదం
అమరుల త్యాగాలను ఎత్తిపట్టిన నేల
చార్మినార్, ఉస్మానియా విశ్వవిద్యాలయం, అమరులస్తూపం వేదికగా..
మానవహారాలై ఎగిసిపడి.. ఉరితాళ్లను ముద్దాడి..
నాడు మిలియన్ మార్చ్ నేడు కళాకారుల కవాతు
మహోన్నత తెలంగాణ ఉద్యమానికి ప్రాణం పోసిన భాగ్యనగరం
తొలి, మలిదశ పోరాటాలకు వేదికైన వేళ
నాలుగు వందల ఏళ్ల మహోన్నతమైన చరిత్ర కలిగిన భాగ్యనగరంలో కోటి గొంతుకల ఉద్యమ ఆకాంక్షలు వెల్లువెత్తాయి. ప్రత్యేక రాష్ట్రం కోసం హైదరాబాద్ మహానగరం ఎలుగెత్తి చాటింది. ‘జై తెలంగాణ’ నినాదమై మార్మోగింది. తెలంగాణ తొలి, మలిదశ ఉద్యమాల్లో ఎన్నెన్నో వీరోచితమైన పోరాటాలు ఇక్కడే ఊపిరిపోసుకున్నాయి. రహదారులు మానవ హారాలై, మిలియన్ మార్చ్‌లై హోరెత్తాయి. ప్రత్యేక రాష్ట్రం కోసం ఈ నేల నెత్తురోడింది. ఉద్యమకారులు పోలీసు తూటాలకు ఎదురొడ్డి నిలిచారు.
ప్రాణాలను తృణప్రాయంగా సమరి్పంచారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధనే ఏకైక లక్ష్యంగా అగ్నికీలలై ఎగిసిపడ్డారు. ఉరితాళ్లను ముద్దాడారు. పాతబస్తీ, అలియాబాద్, చార్మినార్, రాజ్‌భవన్, గన్‌పార్కు, ఉస్మానియా విశ్వవిద్యాలయం, సికింద్రాబాద్, ట్యాంక్‌బండ్, నెక్లెస్‌రోడ్డు, ఎల్‌బీనగర్, తార్నాక తదితర ప్రాంతాలు తొలి, మలిదశ ఉద్యమాలతో దద్దరిల్లాయి. నగరమంతటా భావోద్వేగాలు ఉప్పెనలా ఎగిసిపడ్డాయి. వందలాది మంది అమరుల బలిదానాల కలలను సాకారం చేస్తూ పదేళ్ల క్రితం ఆవిర్భవించిన తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం దశాబ్ది ఉత్సవాలకు ముస్తాబవుతోంది. ఈ సందర్భంగా హైదరాబాద్ కేంద్రంగా జరిగిన తెలంగాణ తొలి, మలి దశ ఉద్యమ ఘట్టాలపైన ‘సాక్షి’ ప్రత్యేక కథనం.
గైర్ ముల్కీ గో బ్యాక్...
👉 తెలంగాణేతరులు ఇక్కడి ఉద్యోగాలను కొల్లగొట్టుకొనిపోవడాన్ని నిరసిస్తూ మొదటిసారి 1952లో ‘గైర్ ముల్కీ గో బ్యాక్’ నినాదం నగరంలో ఆందోళనలు వెల్లువెత్తాయి. విద్యార్థులు చార్మినార్ నుంచి పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. విద్యార్ధుల ప్రదర్శనపై పోలీసులు విరుచుకుపడ్డారు. పెద్ద ఎత్తున లాఠీచార్జి చేశారు. పోలీసుల దమనకాండను నిరసిస్తూ పాతబస్తీలో భారీ నిరసన ప్రదర్శనలు చేపట్టారు. ఈ ప్రదర్శనలను అణచివేసేందుకు పోలీసులు జరిపిన కాల్పుల్లో అలియాబాద్ ప్రాంతంలో ఇద్దరు విద్యార్థులు చనిపోయారు.
👉 1952 సెప్టెంబర్ 4వ తేదీన సిటీకాలేజీ నుంచి విద్యార్థులు భారీ ఊరేగింపు చేపట్టారు. గైర్ ముల్కీ గో బ్యాక్ నినాదాలు మార్మోగాయి. ఈ ఊరేగింపును నిర్దాక్షిణ్యంగా అణచివేసేందుకు పోలీసులు మరోసారి కాల్పులకు దిగారు. ఈ ఘటనలో మరో ఇద్దరు విద్యార్థులు నేలకొరిగారు. ఈ దుర్ఘటనను నిరసిస్తూ సెప్టెంబర్ 5న హైదరాబాద్ నగరమంతటా పెద్ద ఎత్తున నిరసనలు జరిగాయి. ఆందోళనకారులు పత్తర్‌గట్టి పోలీస్‌స్టేషన్‌ను దహనం చేశారు. ఉద్యమాన్ని అణచివేసేందుకు 16 గంటల పాటు కర్ఫ్యూ విధించారు. అదేరోజు అప్పటి ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు నేతృత్వంలో ముల్కీ నిబంధనలపై శ్రీకృష్ణదేవరాయ భాషా నిలయంలో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆందోళనకారులు బూర్గుల కారుకు సైతం నిప్పుపెట్టారు. ఆ తర్వాత జరిగిన ఆందోళనల్లో మరో నలుగురు ఉద్యమకారులు పోలీసు తూటాలకు బలయ్యారు.
‘జై తెలంగాణ’ ఒక్కటే పరిష్కారం..
👉 ముల్కీ వ్యతిరేక ఉద్యమాలు క్రమంగా చల్లారాయి. ప్రభుత్వం పలు కమిటీలను ఏర్పాటు చేసింది. కానీ తెలంగాణకు జరుగుతున్న అన్యాయానికి ఏకైక పరిష్కారం ప్రత్యేక రాష్ట్రం సాధించుకోవడమే అనే స్పష్టమైన లక్ష్యంతో 1969 జనవరి నుంచి ‘జై తెలంగాణ’ ఉద్యమం ఆరంభమైంది. ఆ ఏడాది జనవరి 13వ తేదీన ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ‘తెలంగాణ విద్యార్థుల కార్యాచరణ సమితి’ ఏర్పాటైంది. ఉస్మానియా వర్సిటీ నుంచి అన్ని ప్రాంతాలకు ప్రత్యేక తెలంగాణ ఆకాంక్షలు విస్తరించుకున్నాయి. జనవరి 24వ తేదీన సదాశివపేటలో చేపట్టిన నిరసన ప్రదర్శనపై పోలీసులు కాల్పులు జరిపారు. శంకర్ అనే 17 ఏళ్ల యువకుడు చనిపోయాడు.
👉మార్చి 11వ తేదీన హైదరాబాద్ అంతటా ఉద్యోగులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, అన్ని వర్గాల ప్రజలు నిరవధిక సమ్మెకు దిగారు. పోలీసులు ఎక్కడికక్కడ నిర్బంధం విధించారు. పెద్ద ఎత్తున అరెస్టులు చేశారు. మార్చి 15వ తేదీన ఉస్మానియా వర్సిటీ స్వరో్ణత్సవాల్లోనూ ప్రత్యేక రాష్ట్రం నిరసనకారులు తమ ఆందోళన కొనసాగించారు. ఆ నెల ఉద్యమం ఉద్ధృతమైంది. ఏప్రిల్ 5న కమ్యూనిస్టులు సికింద్రాబాద్‌లో తెలంగాణకు వ్యతిరేకంగా భారీ బహిరంగసభను నిర్వహించారు. ఆ సందర్భంగా జరిగిన అల్లర్లను అణచివేసేందుకు పోలీసులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ముగ్గురు మృత్యువాత పడ్డారు. మరో 27 మందికి తీవ్ర గాయాలయ్యాయి.
👉1969 మే 1న హైదరాబాద్ చరిత్రలో మరో అత్యంత విషాదకరమైన రోజుగా నిలిచిపోయింది. మే డేను ‘డిమాండ్స్ డే’గా పాటించాలని కోరుతూ ఉద్యమకారులు పిలుపునిచ్చారు. చారి్మనార్ నుంచి రాజ్‌భవన్ వరకు భారీ ప్రదర్శన చేపట్టాలని నిర్ణయించారు. కానీ ఈ ప్రదర్శనకు పోలీసులు అనుమతించలేదు. దీంతో ఉద్యమకారులు కొందరు సాధారణ స్త్రీ పురుషులుగా చారి్మనార్ భాగ్యలక్ష్మి అమ్మవారి గుడిలో పూజలు చేసేందుకు కొబ్బరికాయలతో చేరుకున్నారు. ఒక్కసారిగా ‘జై తెలంగాణ’ నినాదంతో చారి్మనార్ మార్మోగింది. ఆ ప్రాంతమంతా జన సంద్రాన్ని తలపించింది. భారీ ప్రదర్శన మొదలైంది. ఈ ఊరేగింపుపైన పోలీసులు ఎక్కడికక్కడ విరుచుకుపడ్డారు. లాఠీలు విరి గా యి. తూటాలు పేలాయి. అయినా ప్రదర్శన ముందుకు సాగించింది. మొత్తం 20 మంది పోలీసు కాల్పుల్లో చనిపోయారు. వందలాదిమంది తీవ్రంగా గాయపడ్డారు.
👉 గాందీ, ఉస్మానియా తదితర ప్రభుత్వ ఆస్తుల్లో నమోదైన రికార్డుల ప్రకారమే తొలిదశ ఉద్యమంలో 369 మంది అమరులయ్యారు.
ప్రపంచం చూపు.. తెలంగాణ వైపు..
👉మహత్తరమైన మలిదశ ప్రత్యేక తెలంగాణ ఉద్యమం యావత్ ప్రపంచాన్ని ఆకట్టుకుంది. ప్రపంచ దేశాలన్నీ తెలంగాణ ఉద్యమాన్ని ఆసక్తిగా గమనించాయి. విద్యార్థులు, ఉద్యోగ సంఘాలు, అన్ని రంగాలకు చెందిన ప్రభుత్వ, ప్రైవేట్, కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు, సంఘటిత, అసంఘటిత కార్మికులు, వివిధ కులవృత్తులు, ప్రజాసంఘాలు, మహిళా సంఘాలు, కళాకారులు సకలజనులు ఏకమై సాగించిన వైవిధ్యభరితమైన ఉద్యమంగా చరిత్రకెక్కింది. 2009 నుంచి 2014లో ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకొనేవరకు ఉద్యమం అనేక మలుపులు తిరిగింది. అనేక పరిణామాలు జరిగాయి. అన్నింటికి హైదరాబాద్ వేదికైంది. ఎంతోమంది యువతీ యువకులు బలిదానాలు చేశారు.
👉 2009 నుంచి ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం ఉవ్వెత్తున సాగింది. ఉస్మానియా విశ్వవిద్యాలయం ఉద్యమ శిఖరమై నిలిచింది. వేలాది మంది విద్యార్థుల ఆందోళనలు, నినాదాలతో విశ్వవిద్యాలయం హోరెత్తింది.
భగ్గుమన్న ఓయూ..
👉ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన ఉద్యమ సారథి కేసీఆర్ తన దీక్షను విరమించినట్లు వార్తలు రావడంతో ఉస్మానియా ఒక్కసారిగా భగ్గుమన్నది. 2009 నవంబర్ 29న ఎల్‌బీనగర్ చౌరస్తాలో శ్రీకాంతాచారి ఒంటిపై కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకున్నారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ డిసెంబర్ 3న కన్నుమూశాడు. దీంతో ఉద్యమం మరింత ఉద్ధృతంగా మారింది.
👉 తెలంగాణ విద్యార్థి జేఏసీ 2010 ఫిబ్రవరి 20న అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచి్చంది. పోలీసులు పెద్దఎత్తున ఉద్యమాన్ని అణచివేశారు. ఆందోళనకారులపై లాఠీచార్జీ చేశారు. బాష్పవాయు గోళాలను ప్రయోగించారు. ఈ సందర్భంగా అనేక మంది గాయపడ్డారు. ఈ దమనకాండను నిరసిస్తూ ఎన్‌సీసీ గేటు వద్ద సిరిపురం యాదయ్య ఒంటిపై కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకున్నాడు. చికిత్స పొందుతూ కన్నుమూశాడు. ఈ ఘటన అనంతరం ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ వేణుగోపాల్‌రెడ్డి అనే మరో విద్యార్థి సైతం ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
హోరెత్తిన మిలియన్ మార్చ్..
👉 ప్రపంచం దృష్టిని ఆకర్షించిన మరో ఉద్యమం మిలియన్ మార్చ్. 2011 మార్చి 10న ట్యాంక్‌బండ్‌పై నిర్వహించిన మిలియన్ మార్చ్ మహా జనసంద్రాన్ని తలపించింది. లక్షలాది మంది ఈ కార్యక్రమంలో పాల్గొని నిరసన తెలిపారు. ఈ సందర్భంగా పోలీసులు 144వ సెక్షన్ విధించినా, తీవ్ర నిర్బంధాన్ని అమలు చేసినా లెక్కచేయకుండా జనం తరలివచ్చారు.
👉 అదే సంవత్సరం 42 రోజుల పాటు తలపెట్టిన సకల జనుల సమ్మెలో బడి పిల్లలు మొదలుకొని యావత్ తెలంగాణ సమాజంలోని అన్ని వర్గాల ప్రజలు పాల్గొని నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. నగరంలోని వివిధ ప్రాంతాల్లో వంటా వార్పు వంటి కార్యక్రమాలు జరిగాయి. ఆర్టీసీ, రవాణా ఉద్యోగులు,కార్మికులు పెద్ద ఎత్తున సమ్మె కొనసాగించారు.
👉 2012 సెప్టెంబర్ 30న జరిగిన సాగరహారం మరో అద్భుతమైన పోరాటం. మధ్యాహ్నం ఒంటిగంట నుంచి సాయంత్రం 5గంటల వరకు నెక్లెస్‌రోడ్డు జనసాగరమైంది. గన్‌పార్కు, ఇందిరాపార్కు, సికింద్రాబాద్, ఖైరతాబాద్, తదితర ప్రాంతాలన్నీ భారీ ప్రదర్శనలతో హోరెత్తాయి. తెలంగాణ నినాదమై పిక్కటిల్లాయి,
👉 2014లో అప్పటి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక రాష్ట్ర ప్రకటన చేసే వరకు తెలంగాణ ఉద్యమం హైదరాబాద్ కేంద్రంగా అనేక మలుపులు తిరిగింది.
Comments
Please login to add a commentAdd a comment