సాక్షి, హైదరాబాద్: బీజేపీలోని అసంతృప్త స్వరాలు ఏదో ఒక రూపంలో బయటపడుతూనే ఉన్నాయి. బీజేపీ అధ్యక్షుడిగా కిషన్‌రెడ్డి బాధ్యతలు చేపట్టిన సందర్భంగా జరిగిన సభలో వేదికపై కొందరు నేతలు చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు, వ్యవహరించిన తీరు, ఆ తర్వాత ట్వీట్ల ద్వారా స్పందించిన వైఖరిపై పార్టీలో చర్చ జరుగుతోంది.
తన విషయంలో వ్యవహరించినట్టుగా కాకుండా కిషన్‌రెడ్డినైనా ప్రశాంతంగా పనిచేసుకోనివ్వాలని, ఢిల్లీకి వెళ్లి లేనిపోని ఫిర్యాదులు, రిపోర్టులు ఇవ్వొద్దని మాజీ అధ్యక్షుడు బండి సంజయ్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.
ఇక ఈ కార్యక్రమంలో మాజీ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి పాల్గొనడంపై బీజేపీ కార్యవర్గ సభ్యురాలు విజయశాంతి ట్విట్టర్ వేదికగా అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇదే ఒరవడి శుక్రవారం అర్ధ్థరాత్రి దాకా సాగిన రాష్ట్ర పార్టీ కోర్‌కమిటీ సమావేశంలోనూ కొనసాగినట్టు పార్టీవర్గాల సమాచారం.
తెలంగాణకు కిరణ్‌కు సంబంధమేమిటి?
తెలంగాణ ద్రోహిగా ముద్రపడ్డ మాజీ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డిని తెలంగాణకు సంబంధించిన పార్టీ కార్యక్రమానికి ఎలా పిలుస్తారని విజయశాంతి ప్రశ్నించినట్లు తెలిసింది. ఇది తెలంగాణ ప్రజల్లో తప్పుడు సంకేతాలు పోయే ప్రమాదం ఉందని ఆమె అసహనం వ్యక్తం చేశారని అంటున్నారు. ఈ విషయంలో జాతీయ, రాష్ట్ర నేతలను హెచ్చరించి, ఆమె తన నిరసన వ్యక్తం చేసినట్లు సమాచారం.
అలా ఎలా సంజయ్?
కిషన్‌రెడ్డి బాధ్యతల స్వీకరణ సభలో బండి సంజయ్ మాట్లాడిన తీరు బాగా లేదని రాష్ట్ర ఎన్నికల ఇన్‌చార్జి ప్రకాష్ జవదేకర్, సహ ఇన్‌చార్జి సునీల్ బన్సల్ వ్యాఖ్యానించినట్టు తెలిసింది. బండి వ్యాఖ్యలు పార్టీకేడర్‌ను గందరగోళంలో పడేసే విధంగా ఉన్నాయని పేర్కొన్నట్టు తెలిసింది. ఏవైనా ఇలాంటి అభిప్రాయాలుంటే పార్టీ అంతర్గత సమావేశాల్లో మాట్లాడాలే తప్ప, బహిరంగంగా మాట్లాడడం ఏమిటని సంజయ్ తీరును తప్పు పట్టినట్లు సమాచారం.
ఈ మేరకు కోర్ కమిటీ మీటింగ్‌లో వారు సంజయ్‌కి క్లాస్ తీసుకున్నట్లు చెబుతున్నారు. గతం నుంచే బండి సంజయ్, ఎమ్మెల్యే ఎం. రఘునందన్‌రావుల మధ్య కొంత గ్యాప్ ఉండడంతో ఈ సమావేశంలోనూ అది బయట పడినట్టు తెలిసింది. దీంతో ఆయన సమావేశం మధ్య నుంచే వెళ్లిపోయారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
ఆగస్టు 1 నుంచి ఉద్యమ కార్యాచరణ...
శుక్రవారం రాత్రి పొద్దుపోయే దాకా సాగిన రాష్ట్ర కోర్ కమిటీ సమావేశంలో ఆగస్టు ఒకటో తేదీ నుంచి ప్రజాసమస్యలపై ఉధృతంగా ఉద్యమించాలని నిర్ణయించారు. బీఆర్‌ఎస్ సర్కారు అవినీతి, అక్రమాలు, సీఎం కేసీఆర్ వైఫల్యాలు, హామీల అమల్లో వైఫల్యంపై ప్రధానంగా కార్యాచరణను రూపొందించుకోవాలని భావించారు.
తొలిసారిగా కిషన్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కోర్ కమిటీ భేటీలో రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని.. అందరినీ కలుపుకుని ముందుకెళ్తూ బీజేపీ పార్టీ నాయకులు, కార్యకర్తలంతా సమష్టిగా పనిచేయాలని నిర్ణయించారు.
అలాగే ముఖ్యనేతలు ఎవరొచ్చినా.. దళితవాడల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తూ.. బీఆర్‌ఎస్ సర్కారు వారికి చేసిన మోసాన్ని తెలియ జేసేలా చైతన్యం తీసుకురావాలని తీర్మానించారు. బీజేపీ మాత్రమే తెలంగాణలో బీఆర్‌ఎస్ పార్టీని ఓడించగల దనే విశ్వాసం ప్రజల్లో బలంగా ఉందని.. దీన్ని సద్వినియోగం చేసుకుంటూ.. మరిన్ని ప్రజా ఉద్యమాలు చేపట్టాలని కోర్ కమిటీ సమావేశంలో తీర్మానించారు.
Comments
Please login to add a commentAdd a comment