Objections In BJP On Kirankumar Reddys Arrival, Vijayashanti Comments Goes Viral - Sakshi
Sakshi News home page

తెలంగాణను వ్యతిరేకించిన వ్యక్తిని ఎలా ఆహ్వానిస్తారు?

Published Sat, Jul 22 2023 1:35 AM | Last Updated on Sat, Jul 22 2023 11:38 AM

Objections in BJP on Kirankumar Reddys arrival - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కిషన్‌ రెడ్డి బాధ్యతలు చేపట్టిన రోజే పార్టీ నేతల మధ్య లుకలుకలు బయట పడ్డాయి. కిషన్‌రెడ్డి బాధ్య తల స్వీకరణ కార్యక్రమానికి ఉమ్మడి ఏపీ మాజీ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డిని ఆహ్వానించడాన్ని, ఆయన సభలో పాల్గొనడాన్ని పార్టీ నేతలు కొందరు తీవ్రంగా వ్యతిరేకించినట్లు తెలిసింది. ఆయనను ఎలా ఆహ్వానిస్తారంటూ మండిపడ్డట్లు తెలిసింది.

ప్రత్యేక తెలంగాణ ఉద్యమాన్ని తీవ్రంగా వ్యతిరేకించి తెలంగాణకు ఒక్క రూపాయి నిధులు కేటాయించబోమని, ఏమి చేసుకుంటారో చేసుకోండన్న కిరణ్‌కుమార్‌రెడ్డిని ఎలా పిలుస్తారని కొందరు నేతలు పార్టీ నాయకత్వాన్ని పార్టీ జాతీయ కార్యవర్గసభ్యులు కోమటిరెడ్డి రాజ్‌గోపాల్‌రెడ్డి, విజయశాంతి, తదితరులు అభ్యంతరం చెప్పినట్టు సమాచారం. ఉద్యమ సమయంలో తనపై కేసులు పెట్టి వేధించిన వ్యక్తిని పిలవడంపై విజయశాంతి నిలదీసినట్టు తెలిసింది.

ఇదే తరహాలో రాజ్‌గోపాల్‌ కూడా అభ్యంతరం వ్యక్తం చేసినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో సభలో పాల్గొన్న విజయశాంతి కొంతసేపటి తర్వాత వెళ్లిపోయారు. అయితే ఆ తర్వాత ఆమె ఒక ట్వీట్‌ చేశారు. ‘కిషన్‌రెడ్డి బాధ్యతల స్వీకార కార్యక్రమం మధ్యలో వచ్చేశానంటూ పాత్రికేయ మిత్రులు నన్ను అడుగుతున్నారు. కానీ అది సరి కాదు. కిషన్‌రెడ్డిని అభినందించి, శుభాశీ స్సులు తెలియజేసిన తర్వాతే వచ్చాను.

అయితే నాడు తెలంగాణను అత్యంత తీవ్రంగా వ్యతిరేకించి, తెలంగాణ వాదాన్ని ఉక్కుపాదంతో అణిచి వేయాలని ప్రయత్నించిన వారు ఉన్నచోట ఉండటం నాకు అసౌకర్యంగా ఉంటుంది. ఆ పరిస్థితి వల్ల ముందుగా వెళ్లవలసి వచ్చింది. అక్కడ చివరి వరకు ఉండటం అసాధ్యం. అందుకే కార్యక్రమం ముగియకముందే  వెల్లిపోవాల్సి వచ్చింది..’ అని వివరణ ఇచ్చారు.

నేతల వ్యాఖ్యల కలకలం
కిషన్‌రెడ్డి బీజేపీ పగ్గాలు చేపట్టిన సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో నేతల ప్రసంగాలు దుమా రం రేపుతున్నాయి. సొంత పార్టీలోనే కొందరు తనపై నాయకత్వానికి ఫిర్యాదులు చేశారంటూ బండి సంజయ్‌ చేసిన వ్యాఖ్యలు కలకలం సృష్టించాయి. మరోవైపు కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి వ్యాఖ్యలు కూడా చర్చనీయాంశమయ్యాయి.

ఢిల్లీ లిక్కర్‌ కేసులో ఎమ్మెల్సీ కవితను తప్పించేందుకు.. సీఎం కేసీఆర్‌ ఈడీని మేనేజ్‌ చేశారని ఆయన అనడం పార్టీ నేతల మధ్య చర్చకు దారితీసింది. కిరణ్‌కుమార్‌రెడ్డి రాకను విజయశాంతి వ్యతిరేకించడం కూడా పార్టీలో చర్చనీయాంశమైంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement