కె.రాహుల్ : హైదరాబాద్‌తోపాటు నగరం చుట్టుపక్కల రింగ్‌రోడ్డు చుట్టూ ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాల టికెట్ల కోసం బీజేపీలో తీవ్రమైన పోటీ నెలకొన్నట్టు పార్టీ వర్గాల సమాచారం. హైదరాబాద్ , ఉమ్మడి రంగారెడ్డి, మెదక్, నల్లగొండ మరికొన్ని ఇతర జిల్లాల్లోని నియోజకవర్గాల్లో పోటీపై పలువురు ముఖ్యనేతలు, మాజీ ఎంపీలు దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది.
రాష్ట్ర రాజధానికి చుట్టుపక్కల రియల్ ఎస్టేట్, ఇతర వ్యాపారాలు జోరుగా సాగడంతో పాటు ఆయా ప్రాంతాల్లో తమకున్న వ్యవసాయ భూములకు భారీ డిమాండ్ రావడంతో.. ఆర్థికంగా బలంగా ఉన్నవారంతా టికెట్ సాధనకు తమ వంతు ప్రయత్నాల్లో నిమగ్నమైనట్టు పార్టీ నేతలు చెబుతున్నారు. వీరంతా ఎన్నికల్లో పెద్ద మొత్తంలో డబ్బు ఖర్చు చేసేందుకు వెనుకాడే పరిస్థితి లేకపోవడంతో పార్టీ నాయకత్వంలో కూడా వీరిపట్ల కొంత సానుకూలత వ్యక్తమవుతున్నట్టు సమాచారం.
విజయావకాశాలు ఉన్నాయనే..
గత జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో అందరి అంచనాలను తలకిందులు చేస్తూ బీజేపీ ఏకంగా 48 సీట్లు గెలుపొందింది. ఆ తర్వాత కూడా పట్టణ ప్రాంతాల్లో పార్టీ బలం పెరిగిందని, మరీ ముఖ్యంగా హైదరాబాద్ చుట్టుపక్కల విజయావకాశాలు పుష్కలంగా ఉన్నాయనే అంచనాలతో పలువురు ముఖ్య నేతలు హైదరాబాద్, రంగారెడ్డి చుట్టుపక్కల నుంచి పోటీకి ఆసక్తి చూపుతున్నట్టు తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్న ఆశావహుల నుంచి పార్టీ నాయకత్వం దరఖాస్తులను ఆహ్వానించడంతో...పలువురు నేతలు హైదరాబాద్ పరిసరాల్లో (హెచ్‌ఎండీఏ పరిధిలో) రెండు, మూడు స్థానాలపై ఆసక్తి చూపిస్తూ దరఖాస్తులు చేసుకున్నట్లు తెలుస్తోంది.
కాంగ్రెస్ ఎమ్యెల్యేగా రాజీనామా చేసి మునుగోడు నుంచి బీజేపీ టికెట్‌పై పోటీ చేసి బీఆర్‌ఎస్ చేతిలో ఓటమి చవిచూసిన కోమటిరెడ్డి రాజ్‌గోపాల్‌రెడ్డి..ప్రస్తుతం మునుగోడుకు బదులు ఎల్‌బీనగర్ నుంచి పోటీకి జాతీయ నాయకత్వం నుంచి గ్రీన్‌సిగ్నల్ సాధించినట్టు చెబుతున్నారు. బీజేపీలో చేరిన భువనగిరి మాజీ ఎంపీ డా. బూరనర్సయ్యగౌడ్ ఇబ్రహీంపట్నం నుంచి అసెంబ్లీకి పోటీ చేయాలనే పట్టుదలతో ఉన్నారు. ఈ సీటు దక్కకపోతే ఇక లోక్‌సభ ఎన్నికలపైనే దృష్టి పెట్టాలనే ఆలోచనతో ఆయన ఉన్నట్టు తెలుస్తోంది.
గోషామహల్ నుంచి పోటీకి (సస్పెన్షన్ ఎత్తేస్తే) ప్రస్తుత ఎమ్మెల్యే టి.రాజాసింగ్, మాజీ మంత్రి ఎం.ముఖే‹Ùగౌడ్ కుమా రుడు ఎం.విక్రమ్‌గౌడ్, షాద్‌నగర్ నుంచి జాతీయ కార్యవర్గసభ్యుడు, మాజీ ఎంపీ ఏపీ జితేందర్‌రెడ్డి కుమారుడు మిథున్‌రెడ్డి /అందె బాబయ్య (ముదిరాజ్), భువనగిరి నుంచి బీజేపీ నేత గూడూరు నారాయణ్‌రెడ్డి/ శ్యాంసుందర్ రావు (వెలమ), మహేశ్వరం నుంచి అందెల శ్రీరాములు యాదవ్/ టి.వీరేందర్‌గౌడ్, కుత్భుల్లాపూర్ నుంచి మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలంగౌడ్, శేరిలింగంపల్లి నుంచి యోగానంద్ (వైశ్య)/ రవికుమార్ యాదవ్, ఉప్పల్ నుంచి ఎన్‌వీఎస్‌ఎస్ ప్రభాకర్ /టి. వీరేందర్‌గౌడ్, మేడ్చల్ నుంచి విక్రమ్‌రెడ్డి /మోహన్‌రెడ్డి గట్టిగా పోటీపడుతున్నట్టు సమాచారం.
ఇవి కాకుండా హైదరాబాద్, చుట్టుపక్కల ప్రాంతాల్లోని మిగిలిన నియోజకవర్గాల్లో టికెట్ల కోసం ఒక్కోదానికి ఇద్దరు, ముగ్గురు నేతల మధ్య తీవ్ర పోటీ నెలకొందని, ఎవరికి వారు తమ ప్రయత్నాల్లో నిమగ్నమైనట్టు పార్టీలో చర్చ సాగుతోంది.
మీకు తెలుసా
1952 ఎన్నికల సమయంలో తెలంగాణతో పాటు, కర్ణాటక, మహారాష్ట్రలకు చెందిన కొన్ని జిల్లాలతో కలసి హైదరాబాద్ రాష్ట్రం ఉండేది. అప్పుడు ఈ రాష్ట్రానికి జరిగిన ఎన్నికలలో తెలంగాణ వరకు చూస్తే కాంగ్రెస్‌కు 38 సీట్లు, పీడీఎఫ్ 36, సోషలిస్ట్ పార్టీకి 11, షెడ్యూల్ కాస్ట్ ఫెడరేషన్‌కు మూడు సీట్లు రాగా ఇండిపెండెంట్లు ఏడుగురు గెలిచారు. అప్పట్లో తెలంగాణలో కమ్యూనిస్టు పార్టీపై నిషేధం ఉండేది. కాని ఆ పార్టీ వారంతా పీపుల్స్ డెమొక్రటిక్ ఫ్రంట్ పేరుతో ఎన్నికలలో పోటీచేశారు. అప్పట్లో సోషలిస్టు పార్టీ కూడా కాస్త బలంగానే ఉండేది.
1956లో ఆంధ్ర, తెలంగాణ విలీనం అయి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పడినా, 1957లో మాత్రం తెలంగాణ భాగానికే ఎన్నికలు జరిగాయి. దానికి కారణం 1955లో ఆంధ్ర రాష్ట్రానికి మధ్యంతర ఎన్నికలు జరగడమే. ఆంధ్రలో ఎన్నికైన ఎమ్మెల్యేలకు 1962 వరకు పదవిలో ఉండే అవకాశాన్ని పార్లమెంటు కల్పించింది. తెలంగాణలో 1957లో రెగ్యులర్ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికలలో కాంగ్రెస్ 68, పీడీఎఫ్ 22, సోషలిస్టు 2, ప్రజాపార్టీ ఒకటి, ఎస్.సి.ఎఫ్ ఒకటి గెలుచుకోగా, ఇండిపెండెంట్లు పది మంది గెలిచారు.
తొలి ఎన్నికల్లోనే రెండు సభలకు ఎన్నిక
సాక్షి, యాదాద్రి: తెలంగాణ సాయుధ పోరాట సేనాని రావి నారాయణరెడ్డి 1952లో జరిగిన తొలి సాధారణ ఎన్నికల్లో పీడీఎఫ్ పార్టీ తరఫున పోటీచేసి భువనగిరి ఎమ్మెల్యేగా, నల్లగొండ ఎంపీగా విజయం సా«ధించారు. పార్లమెంట్ సభ్యునిగా రావినారాయణరెడ్డి అప్పటి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ కంటే అత్యధిక ఓట్ల మెజారిటీతో గెలిచారు. భువనగిరి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఎంపీగా కొనసాగారు. రావి నారాయణరెడ్డి స్వగ్రామం బొల్లేపల్లి.. ప్రస్తుతం యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలంలో ఉంది.
గాసిప్ టైమ్
ధీమా.. బెంగా?
రాష్ట్ర కాంగ్రెస్ నాయకుల తీరే వేరు. వారి రూటే సెపరేటు. అధికారంలోకి వస్తామన్న ధీమానో...కేంద్రంలో అధికారంలోకి వచ్చేది లేదనే బెంగనో కానీ, కాంగ్రెస్ ఎంపీలు, మాజీ ఎంపీలంతా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడానికి తెగ ఉబలాటపడిపోతున్నారు. ఆఖరుకు కుమారుడి కంటే తనకే టికెట్ ముఖ్యమని, అన్ని కలిసి వస్తే మంత్రి పదవి దక్కుతుందని నగరానికి చెందిన ఓ మాజీ ఎంపీ భావిస్తూ, ఆ దిశగా ప్రయత్నాలు కొనసాగిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.
కొందరు ఎంపీలేమో ఏకంగా సీఎం సీటునే ఆశిస్తున్నారు. బీజేపీకి పూర్తి భిన్నంగా కాంగ్రెస్ వైఖరి ఉందనే మాట వినిపిస్తోంది. కాంగ్రెస్‌లో అందరూ పెద్దనాయకులే.. అందరూ సీఎం పదవికి పోటీదారులే. అందుకే వారంతా ఎప్పుడో మరో ఐదారు నెలలకు వచ్చే పార్లమెంట్ ఎన్నికల కంటే కూడా గడప ముందున్న అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకే సిద్ధమైపోతున్నారు. అన్ని బాగుండి అధికారంలోకి వస్తే... సరేసరి.
ఒకవేళ ఓడిపోయినా.. తిరిగి ఎంపీగా పోటీ చేసే అవకాశం ఎలాగూ ఉంటుందన్న ధీమా కాంగ్రెస్ నాయకుల్లో ఎక్కువ అన్న ప్రచారమూ ఉంది. ఇప్పుడున్న ముగ్గురు ఎంపీల్లో ఇద్దరు గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినా.. తిరిగి పార్లమెంట్‌కు ఎన్నికై కాంగ్రెస్ వాణిని, రాష్ట్ర సమస్యలను గట్టిగానే వినిపించారన్న పేరు ఉంది.
Comments
Please login to add a commentAdd a comment