సాక్షి, హైదరాబాద్: వచ్చే అసెంబ్లీ ఎన్నికల యుద్ధానికి దీటైన ఆయుధాలను కాషాయ దళం సిద్ధం చేసుకుంటోంది. రాష్ట్రంలో ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తించే క్రమంలో తన అమ్ముల పొదిలోని అ్రస్తాలను ఒక్కొక్కటిగా బయటకు తీయాలని నిర్ణయించింది. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలు, నిరుద్యోగ భృతి వంటి గత ఎన్నికల సందర్భంగా ఇచ్చిన ప్రధాన వాగ్దానాలను సైతం నెరవేర్చక పోవడం, కాళేశ్వరం వంటి ప్రాజెక్టుల్లో అవినీతి, ‘ధరణి’లో అక్రమాలు, ఆయా అంశాలకు సంబంధించి వివిధ వర్గాల్లో ప్రభుత్వంపై ఉన్న అసంతృప్తిని ఆయుధాలుగా చేసుకుని ఎన్నికల ప్రచారంలో దూసుకుపోవాలని బీజేపీ భావిస్తోంది.
ముఖ్యంగా అధికార బీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీలు రెండూ ఒక్కటేనన్న తమ నినాదాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని నిర్ణయించింది. ఈ రెండు పార్టీల్లో ఎవరికి ఓటు వేసినా ఒక్కటేనన్న అభిప్రాయం ప్రతి ఒక్క ఓటరుకూ కలిగేలా వివరించేందుకు వివిధ అంశాలను సిద్ధం చేసుకుంటోంది. తద్వారా అధికార బీఆర్‌ఎస్ వ్యతిరేక ఓట్లు కాంగ్రెస్ వైపు మళ్లకుండా చూడాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే ‘ఓటుకు కోట్లు’ కేసును, 2014, 2018 ఎన్నికల్లో గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆ తర్వాత బీఆర్‌ఎస్‌లో చేరడాన్ని, వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులు గెలిచినా మళ్లీ బీఆర్‌ఎస్‌లోకే వెళతారనే విష యాన్ని ప్రజల హృదయాల్లో నాటుకునేలా ప్రచారం చేయాలని నిర్ణయించింది.
‘ఓటుకు కోట్లు’పై స్పెషల్ ఫోకస్
‘ఓటుకు కోట్లు’ కేసులో.. నాడు తెలుగుదేశం పార్టీలో ఉన్న నేటి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి రెడ్ హ్యాండెడ్‌గా చిక్కిన సంగతి తెలిసిందే. కాగా కేసీఆర్ సర్కార్ ఈ కేసులో ఏసీబీ తదుపరి విచారణ జరపకుండా అటకెక్కించడాన్ని ప్రధానాస్త్రంగా చేసుకుని ప్రచారం సాగించాలని, కాంగ్రెస్, బీఆర్‌ఎస్ దోస్తీని ఇది స్పష్టం చేస్తోందంటూ ఆ పార్టీలను ఎండగట్టాలని నిర్ణయించినట్టు సమాచారం. బీజేపీ, బీఆర్‌ఎస్ ఒక్కటే అని సాగుతున్న దు్రష్పచారాన్ని తిప్పి కొట్టేందుకూ ఇది ఉపయోగపడుతుందని భావిస్తున్నట్లు తెలిసింది. ‘ఓటుకు కోట్లు’ ఆస్త్రం ఎన్నికల్లో తమకు బాగా ఉపయోగ పడుతుందని బీజేపీ నేతలు అంచనా వేస్తున్నారు.
2015లో తమ ఎమ్మెల్సీ అభ్యర్థిని గెలిపించుకునేందుకు బీఆర్‌ఎస్ నామినేటెడ్ ఎమ్మెల్యేకు టీడీపీ పెద్ద మొత్తంలో డబ్బు ఆశచూపి ప్రలోభాలకు గురిచేయడాన్ని స్పై కెమెరాలతో రికార్డ్ చేయడంతో పాటు రేవంత్‌రెడ్డిని పోలీసులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో కొన్నిరోజులు జైల్లో గడిపిన రేవంత్‌రెడ్డి బయటకు రాగా.. టీడీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం చంద్రబాబుతో కుమ్మక్కైన బీఆర్‌ఎస్ దీనిపై తదుపరి విచారణ జరిపి చర్యలు తీసుకోకుండా అటకెక్కించిందని బీజేపీ ముఖ్యనేతలు కొంతకాలంగా ఆరోపిస్తున్న సంగతి విదితమే.
కాగా అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఇదే అంశాన్ని విస్తృతంగా ప్రచారం చేయాలని ఆ పార్టీ అధిష్టానం భావిస్తోంది. వచ్చే ఎన్నికల్లో పరస్పరం సహకరించుకోవాలని బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ల మధ్య కుదిరిన రహస్య ఒప్పందం కారణంగానే ఈ కేసు విచారణ ముందుకు సాగకుండా చేస్తున్నారనే విషయాన్ని ప్రజలకు వివరించడం ద్వారా బీజేపీకి అనుకూలంగా మద్దతు కూడగట్టాలని భావిస్తోంది. దీనితో పాటు రేవంత్‌రెడ్డికి, బీఆర్‌ఎస్ నాయకురాలితో ఉన్న రహస్య వ్యాపార సంబంధాలను కూడా ప్రజల్లోకి తీసుకెళ్లడం ద్వారా ఈ రెండు పార్టీలు ఒక్కటేననే అభిప్రాయం ప్రజల్లో బలపడేలా చేయాలని యోచిస్తోంది.
అలాగే ఎన్డీఏ బలపరిచిన రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్మును కాదని కాంగ్రెస్, ఇతర పార్టీలు బలపరిచిన యశ్వంత్ సిన్హాకు కేసీఆర్ మద్దతు తెలపడం, ప్రధాని మోదీపై కాంగ్రెస్, ఇతర పక్షాలు పెట్టిన అవిశ్వాస తీర్మానానికి కూడా బీఆర్‌ఎస్ మద్దతు పలకడం వంటి అంశాలను విస్తృతంగా ప్రచారం చేయాలని కమలనాథులు భావిస్తున్నారు.
వైఫల్యాలపై విస్తృత ప్రచారం
గత తొమ్మిదేళ్ల పాలనలో బీఆర్‌ఎస్ సర్కార్ వైఫల్యాలను సమర్థవంతంగా ఎండగట్టేలా ఎన్నికల ప్రచార కార్యక్రమాలను చేపట్టాలని కూడా బీజేపీ నాయకత్వం నిర్ణయించింది. ముఖ్యంగా తెలంగాణ ఉద్యమ నినాదమైన నీళ్లు, నిధులు, నియామకాల విషయంలో కేసీఆర్ ప్రభుత్వం వైఫల్యం చెందడాన్ని, టీఎస్‌పీఎస్‌సీ ప్రశ్నపత్రాల లీకేజీతో నిరుద్యోగుల ఆశలకు గండి కొట్టడాన్ని, నిరుద్యోగ యువతకు ఇస్తామన్న భృతి ఇవ్వకుండా అన్యాయం చేయడాన్ని ప్రజల్లో బాగా ప్రచారం చేయాలని భావిస్తోంది. తద్వారా ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తితో ఉన్న యువజనులను (పెద్ద సంఖ్యలో ఓటర్లుగా ఉన్నారు) బీజేపీ వైపు తిప్పుకునేలా పావులు కదుపుతోంది.
అలాగే పేదలకు డబుల్ బెడ్‌రూం ఇళ్ల కేటాయింపు హామీ పూర్తిస్థాయిలో నిలుపుకోకపోవడం, అధికార పార్టీ నేతలు, ఎమ్మెల్యేల అనుయాయులకు ఎక్కువగా కేటాయించడం ఎండగట్టాలని నిర్ణయించింది. మరోవైపు ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు జరిగిన నష్టం, అన్యాయం గురించి, వివిధ పథకాల పేరిట ప్రచారమే తప్ప పెద్దగా మేలు చేయకపోవడం, ప్రయోజనం కల్పించకపోవడాన్ని విస్తృతంగా ప్రచారం చేసి ఈ వర్గాల మద్దతును కూడా కూడగట్టాలని బీజేపీ నేతలు భావిస్తున్నారు. దళితులకు మూడెకరాల భూమి, దళిత బంధు, తదితర పథకాలు కేవలం ప్రచారానికే పరిమితమైన తీరును, గిరిజన బంధు, బీసీ బంధు అంటూ ఊరించడం తప్ప ఎలాంటి కార్యాచరణను చేపట్టకపోవడాన్ని ప్రజల్లో ప్రచారం చేయాలని నిర్ణయించినట్టు సమాచారం.
అవినీతి, అక్రమాలు
కాళేశ్వరం వంటి ప్రాజెక్టుల్లో ప్రభుత్వ అవినీతిని బాగా ప్రచారం చేయాలని బీజేపీ భావిస్తోంది. కాళేశ్వరం కేసీఆర్ సర్కార్‌కు ఏటీఎంలా మారిందని బీజేపీ అగ్రనేతలు సైతం పదేపదే ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ధరణి పోర్టల్ తెచ్చి రెవెన్యూ రికార్డుల నవీకరణ పేరిట అక్రమాలకు పాల్పడుతున్నారని కూడా బీజేపీ ఆరోపిస్తున్న విషయం విదితమే.
కాగా ఇప్పుడు కూడా ధరణితో రాష్ట్రవ్యాప్తంగా రైతాంగాన్ని తమ సొంత భూములపై హక్కుల విషయంలో ఆందోళనకు గురిచేసి పెద్ద మొత్తంలో అవినీతి, అక్రమాలకు బీఆర్‌ఎస్ అవకాశమిచ్చిందంటూ ప్రచారం చేయాలని కాషాయ దళం భావిస్తోంది. ఈ అ్రస్తాన్ని క్షేత్రస్థాయికి తీసుకెళ్లి బాధిత రైతులు, ప్రజలు, వారి కుటుంబసభ్యుల మద్దతు కూడగట్టాలని నిర్ణయించింది.
Telangana Assembly Elections: తెలంగాణ ఎన్నికలు.. బీజేపీ బ్రహ్మాస్త్రాలు!
Published Thu, Oct 12 2023 1:28 AM | Last Updated on Thu, Oct 12 2023 9:52 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment