రాజకీయాల్లో వారసత్వమేమీ కొత్త విషయం కాదు. కొందరు వారసులు తమవంతు కోసం ఎదురుచూసి రాజకీయాల్లోకి వస్తే.. మరికొందరు ఇష్టం లేకపోయినా.. అనివార్యంగా రావాల్సి వస్తుంది. వారసులను రంగంలోకి దించేందుకు అనేక కారణాలు ఉంటాయి.
రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషించిన తల్లీ/తండ్రీ/మామ/బంధువులు ఎవరైనా ఆకస్మికంగా మరణించినా లేక అనారోగ్య సమస్యలు తలెత్తినా.. వారి వారసులు తెరమీదకు రావాల్సి ఉంటుంది. కానీ, ప్రస్తుత ఎన్నికల్లో పోటీ చేస్తోన్న వారసుల్లో అన్ని రకాల కారణాలతో వచ్చిన వారు ఉన్నారు. వారి వివరాలు ఒకసారి పరిశీలిద్దాం!
లాస్య నందిత
కంటోన్మెంట్ ఎమ్మెల్యే జి. సాయన్న ఆకస్మిక మరణంతో ఆయన కుమార్తె లాస్య నందిత రాజకీయ అరంగేట్రం చేశారు. నగరంలోని సీనియర్ ఎమ్మెల్యేలలో ఒకరైన సాయన్నకు మంచి కేడర్ ఉంది. ఆ కేడర్‌ను కాపాడుకునేందుకు, తిరిగి బీఆర్‌ఎస్ విజయపతాక ఎగరేసేందుకు గులాబీ బాస్ కేసీఆర్ సాయన్న కూతురుకు టికెట్ ఇచ్చారు. ఈమె గతంలో జీహెచ్‌ఎంసీ కార్పొరేటర్‌గా గెలుపొందారు.
వెన్నెల
ప్రజాయుద్ధనౌకగా పేరొందిన సామాజిక ఉద్యమకారుడు గద్దర్ కుమార్తె వెన్నెల ఈ ఎన్నికల్లో కంటోన్మెంట్ నుంచి పోటీ చేస్తున్నారు. పాట ద్వారా సామాజిక స్పృహ పెంచి హక్కుల సాధన కోసం జీవితాంతం పోరాటం చేసిన శక్తిగా గద్దర్ ఎంతో గుర్తింపు పొందారు. ఇప్పుడు ఆయన కుమార్తె వెన్నెల కంటోన్మెంట్‌లో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు. ఎంబీఏ, పీహెచ్‌డీ పూర్తి చేసిన ఈమెకు గద్దర్ పోరాటాలు వెంటనిలుస్తాయని ఆమె అనుచరులు ధీమాగా ఉన్నారు.
డాక్టర్ సంజయ్
కల్వకుంట్ల విద్యాసాగరరావు నాలుగుసార్లు కోరుట్ల నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. వయోభారం వల్ల ఆయన తప్పుకుని ఈసారి కుమారుడు సంజయ్‌కి అవకాశం కల్పించారు. ఆమరణ దీక్ష సమయంలో కేసీఆర్ ఆరోగ్యాన్ని నిరంతరం పర్యవేక్షించిన డాక్టర్‌గా మంచి అనుబంధం ఉంది. దీనికితోడు తండ్రి వయోభారంతో రాజకీయ వారసత్వాన్ని అంగీకరించి తొలిసారి బరిలో నిలిచారు. ఈయన కేటీఆర్‌కు బంధువు, క్లాస్‌మేట్ కావడం గమనార్హం.
కుందూరు జయవీర్‌రెడ్డి
నాగార్జునసాగర్ అసెంబ్లీ నుంచి మాజీ మంత్రి కుందూరు జానారెడ్డి కుమారుడు జయవీర్ రెడ్డి బరిలో నిలుస్తున్నారు. ఘనమైన రాజకీయ నేపథ్యం, తండ్రికి ఉన్న బలమైన అనుచరబలం, అర్ధబలం ఇతని వెంటరావడం కలిసి వచ్చే విషయాలు. 2008లోనే అమెరికాలో మాస్టర్స్ పూర్తి చేసిన జయవీర్.. తండ్రి తరహాలోనే కాంగ్రెస్ నుంచే తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.
విజయారెడ్డి
మాజీ మంత్రి దివంగత పి.జనార్దన్‌రెడ్డి కుమార్తె విజయారెడ్డి. ఈమె ప్రస్తుతం ఖైరతాబాద్ నుంచి పోటీ చేస్తున్నారు. ప్రస్తుతం కార్పొరేటర్‌గా ఉన్న ఈమెకు తన తండ్రికి నగరంలో ఉన్న జనాదరణ కారణంగానే కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది. నగరంలో అత్యంత ప్రజాదరణ కలిగిన నాయకుడిగా పేరొందిన పీజేఆర్ చేసిన పనులు తన విజయానికి సోపానాలు అవుతా యని ధీమాగా ఉంది.
కూచుకుళ్ల రాజేశ్‌రెడ్డి
నాగర్‌కర్నూల్ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్య ర్థిగా కూచుకుళ్ల రాజేశ్‌రెడ్డి గురువారం నామినేషన్ దాఖలు చేశారు. ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్ రెడ్డి తనయునిగా రాజేశ్ రెడ్డి రాజకీయ అరంగేట్రం చేశారు. దంత వైద్యుడైన ఆయన తెలంగాణ డెంటిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉన్నారు.
మిథున్‌రెడ్డి
మహబూబ్‌నగర్ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థి ఏపీ మిథున్ రెడ్డి బరిలో ఉన్నారు. తన తండ్రి మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి రాజకీయ వారసత్వంగా రాజకీయాల్లోకి వస్తున్నారు. ప్రస్తుతం జిల్లాలో వ్యాపార, పారిశ్రామిక వర్గాల్లో మంచి పేరు ఉంది. వారసత్వం, తండ్రి కేడర్ ఈయనకు కలిసి వస్తాయని అంచనా వేస్తున్నారు.
మైనంపల్లి రోహిత్
ఎమ్మెల్యే హనుమంతరావు కుమారుడు రోహిత్ మెదక్ నుంచి పోటీ చేస్తున్నారు. తన కుమారుడు టికెట్ కోసం అధికార పార్టీతో విభేదించిన మైనంపల్లి వెంటనే కాంగ్రెస్‌లో చేరారు. అనుకున్నటు్లగానే తనకు మల్కాజిగిరి, తన కుమారుడికి మెదక్ టికెట్ తెచ్చుకున్న
సంగతి తెలిసిందే.
-భాషబోయిన అనిల్‌కుమార్
Comments
Please login to add a commentAdd a comment