‘ప్రజాస్వామ్యం ధనస్వామ్యం, కార్పొరేట్ స్వామ్యం అయిపోయింది. ఓటుకు నోటు ఎప్పుడైతే వచ్చిందో ప్రజాస్వామ్యానికి అర్థం లేకుండా పోతోంది.. డబ్బు ఇస్తున్నవాడిది తప్పా.. తీసుకుంటున్న వాడిది తప్పా అంటే డబ్బు ఇచ్చే వాడిదే తప్పు. ఎందుకంటే నాయకుడనేవాడు ఆదర్శంగా ఉండాలి కాబట్టి డబ్బివ్వడం అనేది అతడి తప్పే అవుతుంది. ఈ ఎన్నికల్లో ప్రజల ఎజెండానే కీలకం కావాలి’అంటున్నారు సినీ విప్లవ దర్శకుడు, నటుడు ఆర్.నారాయణమూర్తి.
‘దేశంలో పీడిత ప్రజల కోసం కమ్యూనిస్టులు చేసిన త్యాగాలు మహోన్నతం. తెలంగాణ సాయుధ పోరాటంలో వేలాది మంది అమరులయ్యారు. ప్రజా సమస్యలు ఎక్కడున్నా కమ్యూనిస్టులే ముందుకు వచ్చి పోరాటం చేస్తుంటారు’ అని చెప్పిన ఆయన ఎన్నికల నేపథ్యంలో వివిధ అంశాలపై ‘సాక్షి’కి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. వివరాలు ఆయన మాటల్లోనే..
ప్రపంచ కమ్యూనిస్టుల్లారా ఏకం కండి..
దేశంలో మొదట్లో కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీలు మాత్రమే ఉండేవి. తర్వాతి కాలంలో కమ్యూనిస్టు పార్టీలు అనేక చీలికలు పేలికలు అయ్యాయి. త్యాగాలు, సిద్ధాంతాలు గొప్పవైనా ఇప్పుడు అలా ఆ పార్టీలు ఉండకపోవడంపై చాలా బాధపడుతున్నాను. ఒకటా రెండా.. ఎన్ని సీట్లు గెలుస్తామన్నది ముఖ్యం కాదు. ఎన్నికల పోరాటంలో వామపక్షాలు కలిసి పోటీ చేయాలి. అందుకు ప్రపంచ కమ్యూనిస్టులంతా ఏకం కావాలి.
బీజేపీ కులగణనకు ముందుకొస్తే అప్పుడు నమ్ముతాం
అధికారంలోకి వస్తే తెలంగాణలో బీసీని సీఎం చేస్తామని బీజేపీ అంటోంది. మహిళా బిల్లు పెట్టి దాన్ని ఇంకా పాస్ చేయలేదు. కులగణన చేయమంటే చేయట్లేదు. అలాంటప్పుడు బీసీలకు వారేం న్యాయం చేయగలరు? బీసీలకు మన దేశంలో అన్యాయం జరుగుతోంది. పార్లమెంటులో 13–14 శాతానికి మించి బీసీలు లేరు. వాస్తవంగా దేశంలో బీసీల జనాభా 54 శాతంగా ఉంది. బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే కులగణనకు ముందుకు రావాలి అప్పుడు బీసీ సీఎంను చేస్తామంటే మేం నమ్ముతాం.
భయంతోనే ఎన్నికల్లో వెనక్కి తగ్గిన టీడీపీ..
తెలుగుదేశం పార్టీ తెలంగాణలో పోటీ చేస్తామని చివరలో వెనక్కి తగ్గింది. టీడీపీ ఎన్నికల్లో నిలబడకుంటే ఆ పార్టీ క్యాడర్ నైరాశ్యానికి గురవుతుంది. వారు ఆ పార్టీలో మిగలరు. దాని పర్యవసానమే కాసాని జ్ఙానేశ్వర్ పార్టీ మారడం. ఇక్కడ సొంతంగానో, లేదా ఏదైనా పార్టీతో పొత్తుతోనే బరిలోకి దిగిన తర్వాత వ్యతిరేక ఫలితాలు వస్తే, ఆ ప్రభావం ఆంధ్రప్రదేశ్ మీద పడుతుందన్న భయం కూడా టీడీపీలో కనిపించింది. అందుకే వెనక్కి తగ్గింది.
అన్ని పార్టీల్లోనూ వారసులు..
వారసత్వం అనేది దేశవ్యాప్తంగా అన్ని పార్టీల్లో ఉంది. వారసత్వానికి మేం వ్యతిరేకం అని మోదీ చెబుతున్నారు కానీ బీజేపీ అధికారంలో ఉన్న అనేక రాష్ట్రాల్లో ఎంతోమంది వారసులు ఎమ్మెల్యేలుగా లేరా? సాక్షాత్తూ హోం మంత్రి అమిత్ షా తనయుడికి క్రికెట్ బోర్డులో కీలక పదవి ఇవ్వలేదా? ఇక రాహుల్‌గాంధీ సీఎం కేసీఆర్‌పై చేస్తున్న విమర్శల సందర్భంగా వారసత్వం ప్రస్తావించడం మరీ విచిత్రం. కాంగ్రెస్‌కు మించిన కుటుంబ పాలన ఇంకెక్కడ ఉంది? వారిది వారసత్వం కాదా?
పార్టీ మారే వారిని బహిష్కరించాలి..
పార్టీలు మారడం సులువైంది. ఒక పార్టీ నుంచి గెలిచాక మరో పార్టీలోకి వెళ్లిపోతున్నారు. ఇది దుర్మార్గం. దీన్ని నిరోధించడానికి పార్లమెంటులో బిల్లుపెట్టాలి. సిద్ధాంతం, పార్టీని చూసి ఓటు వేస్తే, ఆ తర్వాత పార్టీ మారితే అలాంటి వారిని నిలదీయాలి. పార్టీలను మారే వారిని బహిష్కరించాలి. రోజుకు మూడు పార్టీలు మారడమా? ఇదేం విచిత్రం? అలాగే డబ్బులిచ్చేందుకు వచ్చే వారినీ బహిష్కరించాలి.
ఏం చేస్తారో బాండ్ రాసివ్వాలి..
ఎన్నికల్లో వచ్చే నాయకులను తమకేం చేస్తారో బాండ్ పేపర్ మీద రాసి సంతకం చేయాలని ప్రజలు కోరాలి. గెలిపించిన తర్వాత బాండ్ పేపర్‌లో రాసిన హామీలు అమలు చేయకపోతే, కోర్టుకు వెళ్లాలి. అలా ఎన్నికలను పీపుల్స్ ఎజెండాగా మార్చాలి. పార్టీలు తమ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన అన్నింటినీ నెరవేర్చేలా మనం ఒత్తిడి చేయాలి.
-బొల్లోజు రవి
Comments
Please login to add a commentAdd a comment