R. Narayanamurthy
-
డబ్బిచ్చే వాడిదే తప్పు..
‘ప్రజాస్వామ్యం ధనస్వామ్యం, కార్పొరేట్ స్వామ్యం అయిపోయింది. ఓటుకు నోటు ఎప్పుడైతే వచ్చిందో ప్రజాస్వామ్యానికి అర్థం లేకుండా పోతోంది.. డబ్బు ఇస్తున్నవాడిది తప్పా.. తీసుకుంటున్న వాడిది తప్పా అంటే డబ్బు ఇచ్చే వాడిదే తప్పు. ఎందుకంటే నాయకుడనేవాడు ఆదర్శంగా ఉండాలి కాబట్టి డబ్బివ్వడం అనేది అతడి తప్పే అవుతుంది. ఈ ఎన్నికల్లో ప్రజల ఎజెండానే కీలకం కావాలి’అంటున్నారు సినీ విప్లవ దర్శకుడు, నటుడు ఆర్.నారాయణమూర్తి. ‘దేశంలో పీడిత ప్రజల కోసం కమ్యూనిస్టులు చేసిన త్యాగాలు మహోన్నతం. తెలంగాణ సాయుధ పోరాటంలో వేలాది మంది అమరులయ్యారు. ప్రజా సమస్యలు ఎక్కడున్నా కమ్యూనిస్టులే ముందుకు వచ్చి పోరాటం చేస్తుంటారు’ అని చెప్పిన ఆయన ఎన్నికల నేపథ్యంలో వివిధ అంశాలపై ‘సాక్షి’కి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. వివరాలు ఆయన మాటల్లోనే.. ప్రపంచ కమ్యూనిస్టుల్లారా ఏకం కండి.. దేశంలో మొదట్లో కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీలు మాత్రమే ఉండేవి. తర్వాతి కాలంలో కమ్యూనిస్టు పార్టీలు అనేక చీలికలు పేలికలు అయ్యాయి. త్యాగాలు, సిద్ధాంతాలు గొప్పవైనా ఇప్పుడు అలా ఆ పార్టీలు ఉండకపోవడంపై చాలా బాధపడుతున్నాను. ఒకటా రెండా.. ఎన్ని సీట్లు గెలుస్తామన్నది ముఖ్యం కాదు. ఎన్నికల పోరాటంలో వామపక్షాలు కలిసి పోటీ చేయాలి. అందుకు ప్రపంచ కమ్యూనిస్టులంతా ఏకం కావాలి. బీజేపీ కులగణనకు ముందుకొస్తే అప్పుడు నమ్ముతాం అధికారంలోకి వస్తే తెలంగాణలో బీసీని సీఎం చేస్తామని బీజేపీ అంటోంది. మహిళా బిల్లు పెట్టి దాన్ని ఇంకా పాస్ చేయలేదు. కులగణన చేయమంటే చేయట్లేదు. అలాంటప్పుడు బీసీలకు వారేం న్యాయం చేయగలరు? బీసీలకు మన దేశంలో అన్యాయం జరుగుతోంది. పార్లమెంటులో 13–14 శాతానికి మించి బీసీలు లేరు. వాస్తవంగా దేశంలో బీసీల జనాభా 54 శాతంగా ఉంది. బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే కులగణనకు ముందుకు రావాలి అప్పుడు బీసీ సీఎంను చేస్తామంటే మేం నమ్ముతాం. భయంతోనే ఎన్నికల్లో వెనక్కి తగ్గిన టీడీపీ.. తెలుగుదేశం పార్టీ తెలంగాణలో పోటీ చేస్తామని చివరలో వెనక్కి తగ్గింది. టీడీపీ ఎన్నికల్లో నిలబడకుంటే ఆ పార్టీ క్యాడర్ నైరాశ్యానికి గురవుతుంది. వారు ఆ పార్టీలో మిగలరు. దాని పర్యవసానమే కాసాని జ్ఙానేశ్వర్ పార్టీ మారడం. ఇక్కడ సొంతంగానో, లేదా ఏదైనా పార్టీతో పొత్తుతోనే బరిలోకి దిగిన తర్వాత వ్యతిరేక ఫలితాలు వస్తే, ఆ ప్రభావం ఆంధ్రప్రదేశ్ మీద పడుతుందన్న భయం కూడా టీడీపీలో కనిపించింది. అందుకే వెనక్కి తగ్గింది. అన్ని పార్టీల్లోనూ వారసులు.. వారసత్వం అనేది దేశవ్యాప్తంగా అన్ని పార్టీల్లో ఉంది. వారసత్వానికి మేం వ్యతిరేకం అని మోదీ చెబుతున్నారు కానీ బీజేపీ అధికారంలో ఉన్న అనేక రాష్ట్రాల్లో ఎంతోమంది వారసులు ఎమ్మెల్యేలుగా లేరా? సాక్షాత్తూ హోం మంత్రి అమిత్ షా తనయుడికి క్రికెట్ బోర్డులో కీలక పదవి ఇవ్వలేదా? ఇక రాహుల్‌గాంధీ సీఎం కేసీఆర్‌పై చేస్తున్న విమర్శల సందర్భంగా వారసత్వం ప్రస్తావించడం మరీ విచిత్రం. కాంగ్రెస్‌కు మించిన కుటుంబ పాలన ఇంకెక్కడ ఉంది? వారిది వారసత్వం కాదా? పార్టీ మారే వారిని బహిష్కరించాలి.. పార్టీలు మారడం సులువైంది. ఒక పార్టీ నుంచి గెలిచాక మరో పార్టీలోకి వెళ్లిపోతున్నారు. ఇది దుర్మార్గం. దీన్ని నిరోధించడానికి పార్లమెంటులో బిల్లుపెట్టాలి. సిద్ధాంతం, పార్టీని చూసి ఓటు వేస్తే, ఆ తర్వాత పార్టీ మారితే అలాంటి వారిని నిలదీయాలి. పార్టీలను మారే వారిని బహిష్కరించాలి. రోజుకు మూడు పార్టీలు మారడమా? ఇదేం విచిత్రం? అలాగే డబ్బులిచ్చేందుకు వచ్చే వారినీ బహిష్కరించాలి. ఏం చేస్తారో బాండ్ రాసివ్వాలి.. ఎన్నికల్లో వచ్చే నాయకులను తమకేం చేస్తారో బాండ్ పేపర్ మీద రాసి సంతకం చేయాలని ప్రజలు కోరాలి. గెలిపించిన తర్వాత బాండ్ పేపర్లో రాసిన హామీలు అమలు చేయకపోతే, కోర్టుకు వెళ్లాలి. అలా ఎన్నికలను పీపుల్స్ ఎజెండాగా మార్చాలి. పార్టీలు తమ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన అన్నింటినీ నెరవేర్చేలా మనం ఒత్తిడి చేయాలి. -బొల్లోజు రవి -
రేపే నారాయణమూర్తి యూనివర్సిటీ
‘‘యూనివర్సిటీ’ విద్యార్థులే కాదు.. వారి తల్లిదండ్రులు, అధ్యాపకులు చూడాల్సిన సినిమా’’ అని ప్రొఫెసర్ హరగోపాల్ అన్నారు. ఆర్. నారాయణమూర్తి లీడ్ రోల్లో నటించి, స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ‘యూనివర్సిటీ’ చిత్రం రేపు విడుదలవుతోంది. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులకు ‘యూనివర్సిటీ’ ప్రివ్యూ వేశారు. ప్రొఫెసర్ కంచె ఐలయ్య మాట్లాడుతూ– ‘‘దేశంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందించాలి. అప్పుడే ప్రైవేట్ విద్యా సంస్థల ఫీజుల దోపిడీ ఉండదు’ అనే అంశాన్ని ఈ చిత్రం ద్వారా గట్టిగా చెప్పారు నారాయణమూర్తి’’ అన్నారు. ‘‘నిరుద్యోగ సమస్య దేశాన్ని ఎంత పట్టి పీడిస్తోందో ఈ చిత్రంలో బాగా చెప్పారు’’ అన్నారు ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి. ‘‘పరీక్షల మీద పరీక్షలంటూ నిరుద్యోగుల జీవితాలతో ఆడుకోవడం దుర్మార్గం’’ అన్నారు ఆర్. నారాయణమూర్తి. -
ఆ మాటలే నాకు దీవెనలు
‘‘సమాజంలో బోలెడన్ని సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలను చర్చించడానికి ఎన్నో వేదికలు ఉన్నాయి. ఒక సినిమా కళాకారుడిగా వెండితెర వేదికగా ఆ సమస్యలు చూపిస్తున్నాను’’ అని అన్నారు దర్శక–నిర్మాత–నటుడు ఆర్. నారాయణమూర్తి. ఆయన స్వీయదర్శకత్వంలో రూపొందించి, నటించిన చిత్రం ‘యూనివర్సిటీ’. ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో నేడు విడుదలవుతోంది. ఈ సందర్భంగా ఆర్. నారాయణమూర్తి ‘సాక్షి’తో చెప్పిన విశేషాలు ఈ విధంగా... ► సమాజంలో ఉన్న సమస్యలతోనే 40 ఏళ్లుగా సినిమాలు తీస్తున్నారు... రెగ్యులర్ కమర్షియల్ చిత్రాలు తీస్తే సేఫ్ కదా? సేఫ్టీ గురించి ఎప్పుడూ ఆలోచించలేదు. నా వంతుగా సమాజానికి ఎంతో కొంత ఉపయోగపడే సినిమా ఇవ్వాలన్నదే నా ఆశయం. అనాదిగా మంచి కోసం, సమసమాజం కోసం ఎందరో మహనీయులు వారివారి వేదికల్లో కృషి చేస్తూనే ఉన్నారు. అదే కోవలో నేను సినిమా వేదికగా ఒక ప్రధాన పాత్ర పోషిస్తున్నాను. ఒక సమస్య ఉత్పన్నం అయినప్పుడు జర్నలిస్టు తన కలంతో, వాగ్గేయకారుడు పాటతో, రచయిత తన రచనలతో పరిష్కారం కోసం పోరాడతారు. అలాగే ఒక సినిమా సాంస్కృతిక సైనికుడిగా 40 ఏళ్లుగా సామాజిక సమస్యలే ఇతివృత్తంగా సినిమాలు తీస్తున్నాను. ఇందులోనే నాకు సంతృప్తి, ఆనందం దక్కుతున్నాయి. శ్రీశ్రీ చెప్పినట్లు నేను సైతం ప్రపంచానికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను అనేలా సామాజిక అంశాలపైన సినిమాలు తీస్తున్నాను తప్ప నేనేదో సమాజాన్ని ఉద్ధరించడం కోసం తీస్తున్నానని అనుకోవడంలేదు. గూడవల్లి రామబ్రహ్మంవంటి మహనీయులు సామాజిక అంశాలతో సినిమాలను రూపొందించి లెజెండ్స్‌గా నిలిచారు. వారి అడుగుజాడల్లో నడుస్తున్న చిన్నపిల్లవాడిని నేను. ► ‘యూనివర్సిటీ’ సినిమా గురించి? విద్య, నిరుద్యోగం ప్రధానాంశాలుగా ఈ చిత్రాన్ని రూపొందించాను. ప్రైవేటు విద్య వద్దు, పబ్లిక్ విద్యే ముద్దు అనే అంశంతో తీశాను. ప్రస్తుతం ప్రైవేటు విద్యా వ్యవస్థ వల్ల చదువు వ్యాపారంగా మారిపోయింది. ఈ వ్యవస్థలో ఫస్ట్ ర్యాంకులు సాధించాలని పేపర్ లీకేజీలు, మాల్ ప్రాక్టీస్‌లు పెరిగిపోయాయి. దీనివల్ల బాగా చదివిన విద్యార్థులు వెనకబడిపోతున్నారు. ఇవి భరించలేక ఆ విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అంతేకాకుండా క్యాంపస్ వేదికల్లోనిప్రొఫెసర్లు కూడా కులాలకు, మతాలకు ప్రాధాన్యతనిస్తూ వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్నారు. ఇలాంటి అసమానతలు పోవాలంటే కొఠారీ కమిషన్ పేర్కొన్నట్టు ప్రభుత్వ విద్యకు ప్రత్యేక బడ్జెట్ కేటాయించాలి, ప్రైవేటు సంస్థల్లోని వసతులు ఇక్కడ కూడా అందేలా చూడాలి. ఈ అంశాలు ప్రతిబింబించేలా ఈ సినిమా తీశాను. ► విద్య గురించి మాత్రమేనా? ఇతర విషయాలేమైనా ఈ సినిమాలో చె΄్పారా? ఉద్యోగాల గురించి కూడా చర్చించాను. అతి పెద్ద గ్లోబల్ విలేజ్ అయినటువంటి భారత్ నుంచి ఎందరో విద్యార్థులు ఉద్యోగాల కోసం విదేశాలకు వెళుతున్నారు. కానీ అక్కడ కూడా నిరుద్యోగం పెరిగిపోయి మనవారికి ఉద్యోగాలు ఇవ్వలేకపోతున్నారు. బడుగు బలహీన వర్గాలకు రిజర్వేషన్ రాజ్యాంగ హక్కు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజలు అవన్నీ కోల్పోతున్నారు. అందుకే 1986లో మురళీధర్ రావు కమిషన్, 1990లో మండల్ కమిషన్ తెలిపిన రిపోర్టు ప్రకారం ప్రైవేటు సెక్టార్లో కూడా రిజర్వేషన్లు అమలు చేయాల్సిన అవసరముంది. మనది నిరుద్యోగ భారతం కాదు... ఉద్యోగ భారతం కావాలని చెప్పే చిత్రం ఇది. ► తెలుగు భాషకు ్రపాధాన్యం ఇచ్చే మీరు ఈ చిత్రంలో రెండు ఇంగ్లిష్ పాటలు పెట్టారు? ‘ఎవిరీ బడీ సే నో టు ప్రైవేట్ స్కూల్స్.. ఎవిరీ బడీ సే యస్ టు పబ్లిక్ స్కూల్స్.. ఎవిరీ బడీ వాంట్స్ కామన్ ఎడ్యుకేషన్’ అనే మహోన్నత ఆశయంతో వేల్పుల నారాయణగారు గొప్ప పాట రాశారు. ఈ పాటను సాయిచరణ్ అంతే గొప్పగా పాడారు. ఇంకో ఇంగ్లిష్ పాటను జలదంకి సుధాకర్ రాయగా, సాయిచరణ్ పాడారు. ఈ రెండు ఇంగ్లిష్ పాటలతో పాటు ‘తాత. తాత..’ అని గద్దరన్న రాసి, పాడిన పాట, ఇతర పాటలు కూడా సందర్భానుసారం సాగుతాయి. ► ప్రజా సమస్యలతో సినిమాలు తీస్తున్న మీ గురించి ప్రజలు నాలుగు మంచి మాటలు మాట్లాడినప్పుడు కలిగే అనుభూతి.. నారాయణమూర్తి మన సమస్యలు తీస్తున్నాడు.. మన కథలను చూపిస్తున్నాడు.. ఒక కళాకారుడుగా మన గుండెల్లోని బాధను సినిమాలో చూపించాడు... పరిష్కారం మార్గం చూపిస్తున్నాడు. అతను మన మనిషి. ప్రజా కళాకారుడు అని ప్రజలు అంటున్న ఆ మాటలను పెద్ద దీవెనలుగా భావిస్తున్నాను. ఏ కథాంశం అయినా ఆకట్టుకుంటేనే అభిమానులు చూస్తారు. ‘అర్ధరాత్రి స్వతంత్రం’ నుంచి ఇప్పటివరకు సామాజిక సమస్యలే ప్రధానాంశాలుగా సినిమాలు తీస్తున్నాను. ప్రజలు దీవిస్తే అదే నా సంపాదన. నా సినిమాలు వంద రోజులు, జూబ్లీ వేడుకలు చేసుకున్నాయి. సక్సెస్ అయినా ఫెయిల్ అయినా సినిమాలు తీస్తూనే ఉంటాను. -
బిచ్చగాడు బంధాలను గుర్తు చేసింది
‘‘విజయ్ ఆంటోని నటించిన ‘బిచ్చగాడు’ చిత్రం అన్ని బంధాలను బాగా గుర్తుచేసింది. ఆ సినిమాకి సీక్వెల్‌గా ఇప్పుడు ‘బిచ్చగాడు 2’ కూడా అలాంటి సెంటిమెంట్‌తోనే వస్తున్నట్టు కనిపిస్తోంది. ఈ సినిమాని ప్రేక్షకులు పెద్ద హిట్ చేయాలి’’ అని ప్రముఖ నటుడు, దర్శక–నిర్మాత ఆర్. నారాయణమూర్తి అన్నారు. విజయ్ ఆంటోని హీరోగా నటించి, దర్శకత్వం వహించిన చిత్రం ‘బిచ్చగాడు 2’. కావ్య థాపర్ హీరోయిన్. ఫాతిమా విజయ్ ఆంటోని నిర్మించిన ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో ఈ నెల 19న విడుదలవుతోంది. ఈ సందర్భంగా జరిగిన ప్రెస్మీట్లో విజయ్ ఆంటోని మాట్లాడుతూ– ‘‘మొదటి భాగంలో మదర్ సెంటిమెంట్ చూశారు.. రెండో భాగంలో సిస్టర్ సెంటిమెంట్ చూడబోతున్నారు’’ అన్నారు. ‘బిచ్చగాడు 2’ని తెలుగులో విడుదల చేస్తున్న ఉషా పిక్చర్స్ విజయ్ కుమార్ మాట్లాడుతూ– ‘‘ఏపీ, తెలంగాణలో తొలిసారి డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాం’’ అన్నారు. ‘‘బిచ్చగాడు’ని తెలుగువారు ఎంతో ఆదరించారు. ‘బిచ్చగాడు 2’ అంతకంటే ఎక్కువగా మీకు నచ్చుతుంది’’ అన్నారు ఫాతిమా. ‘‘బిచ్చగాడు’ని తెలుగులో నేనే విడుదల చేశాను. ఆ సినిమా కంటే ‘బిచ్చగాడు 2’ ఇంకా పెద్ద హిట్ కావాలి’’ అన్నారు నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు. నటుడు జాన్ విజయ్, తెలుగు అనువాద రచయిత భాష్య శ్రీ ΄ాల్గొన్నారు. ఈ చిత్రానికి సంగీతం: విజయ్ ఆంటోని, కెమెరా: విజయ్ మిల్టన్, ఓం ప్రకాష్. -
రైతు వ్యతిరేక చట్టాలు రద్దు చేయాలి
‘‘కేంద్ర ప్రభుత్వం నూతన వ్యవసాయ విద్యుత్ చట్టాలను తీసుకువచ్చింది. అవి రైతులకు వరాలు కావు.. మరణ శాసనాలు’’ అని నటులు, దర్శక, నిర్మాత, సామాజిక విశ్లేషకులు ఆర్. నారాయణమూర్తి అన్నారు. ఆయన ప్రధాన పాత్రలో నటించి, స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం రైతన్న. ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఆర్. నారాయణ మూర్తి మాట్లాడుతూ– ‘‘కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన చట్టాలను రద్దుచేయాలని, స్వామినాథన్ కమిటీ సిఫార్సులను అమలు చేయాలని పంజాబ్, హర్యానా, బీహార్, మహారాష్ట్రతో పాటు దక్షిణాది రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున రైతులు ఉద్యమం చేస్తున్నారు. ఈ కొత్త చట్టాలు రైతులకు మేలు చేస్తాయని, సవరణలు చేస్తాం కానీ రద్దు మాత్రం చెయ్యం అని కేంద్రం అంటోంది. రైతులంటే అంత గౌరవం ఉంటే మీరు తీసుకువచ్చిన వ్యవసాయ, విద్యుత్ చట్టాలను రద్దు చేయాలని ‘రైతన్న’ చిత్రం ద్వారా కేంద్ర ప్రభుత్వానికి, ప్రధాని నరేంద్ర మోదీగారికి విజ్ఞప్తి చేస్తున్నాను. మార్చిలో సినిమాను విడుదల చేస్తాం’’ అన్నారు. -
‘అమ్మేయడానికి మీరెవ్వరు?’
సాక్షి, విశాఖపట్నం/ద్వారకానగర్ (విశాఖ దక్షిణ): పోరాటాలతో సాధించుకున్న విశాఖ స్టీల్ ప్లాంట్‌ను అమ్మేయడానికి మీరెవ్వరంటూ కేంద్ర పెద్దలను సినీ నటుడు, దర్శక నిర్మాత ఆర్.నారాయణమూర్తి ప్రశ్నించారు. ప్రయివేటీకరించే నిర్ణయాన్ని ఎందుకు రహస్యంగా తీసుకున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ రక్షణ ప్రజా వేదిక ఆధ్వర్యంలో విశాఖ నగరంలోని డాబా గార్డెన్స్ అంబేడ్కర్ విగ్రహం నుంచి జీవీఎంసీ మహత్మాగాంధీ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ గతంలో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు రూ.200 కోట్ల లాభాల్లో ఉన్న గంగవరం పోర్టును కేంద్ర ప్రభుత్వంతో కలిసి ప్రయివేటీకరించేందుకు పూనుకున్నారని, మళ్లీ ఇప్పుడు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణకు కేంద్రం పూనుకోవడం దేశద్రోహమన్నారు. తెలుగువాడైన ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఈ విషయమై చూస్తూ ఊరుకోవద్దని విజ్ఞప్తి చేశారు. అన్ని రాజకీయ పార్టీలూ జెండాలు పక్కన పెట్టి స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిచ్చారు. అంబానీ, అదానీలకు పక్కన పెట్టాలంటూ ప్రధానిని కోరారు. సౌత్ కొరియా కంపెనీ ‘పోస్కో’ను విశాఖలో అడుగు పెట్టనీయకూడదన్నారు. విశాఖ మనదిరా.. స్టీల్ ప్లాంట్ మనదిరా.. కేంద్రమేందిరో.. దాని దూకుడేందిరో.. అంటూ పాట పాడి ఉత్తేజం కలిగించారు. కార్యక్రమంలో అనకాపల్లి ఎంపీ సత్యవతి, రైటర్స్ ఆకాడమీ చైర్మన్ రమణమూర్తి తదితరులు పాల్గొన్నారు. కొనసాగుతున్న ‘ఉక్కు’ ఉద్యమం స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ విశాఖలో నిరసనలు కొనసాగుతున్నాయి. ప్రజా సంఘాలు, ఉద్యోగ, కార్మిక సంఘాలు, వివిధ రాజకీయ పార్టీల ఆధ్వర్యంలో ధర్నాలు, ర్యాలీలు, దీక్షలు నిర్వహిస్తున్నారు. ఆయా పార్టీలు, సంఘాల నాయకులు, ప్రత్యేక హాదా, విభజన హామీల సాధన సమితి కన్వీనర్ చలసాని శ్రీనివాసరావు పాల్గొన్నారు. -
ఆర్. నారాయణమూర్తి 'రాజ్యాధికారం' మూవీ స్టిల్స్