‘‘సమాజంలో బోలెడన్ని సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలను చర్చించడానికి ఎన్నో వేదికలు ఉన్నాయి. ఒక సినిమా కళాకారుడిగా వెండితెర వేదికగా ఆ సమస్యలు చూపిస్తున్నాను’’ అని అన్నారు దర్శక–నిర్మాత–నటుడు ఆర్. నారాయణమూర్తి. ఆయన స్వీయదర్శకత్వంలో రూపొందించి, నటించిన చిత్రం ‘యూనివర్సిటీ’. ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో నేడు విడుదలవుతోంది. ఈ సందర్భంగా ఆర్. నారాయణమూర్తి ‘సాక్షి’తో చెప్పిన విశేషాలు ఈ విధంగా...
► సమాజంలో ఉన్న సమస్యలతోనే 40 ఏళ్లుగా సినిమాలు తీస్తున్నారు... రెగ్యులర్ కమర్షియల్ చిత్రాలు తీస్తే సేఫ్ కదా?
సేఫ్టీ గురించి ఎప్పుడూ ఆలోచించలేదు. నా వంతుగా సమాజానికి ఎంతో కొంత ఉపయోగపడే సినిమా ఇవ్వాలన్నదే నా ఆశయం. అనాదిగా మంచి కోసం, సమసమాజం కోసం ఎందరో మహనీయులు వారివారి వేదికల్లో కృషి చేస్తూనే ఉన్నారు. అదే కోవలో నేను సినిమా వేదికగా ఒక ప్రధాన పాత్ర పోషిస్తున్నాను. ఒక సమస్య ఉత్పన్నం అయినప్పుడు జర్నలిస్టు తన కలంతో, వాగ్గేయకారుడు పాటతో, రచయిత తన రచనలతో పరిష్కారం కోసం పోరాడతారు. అలాగే ఒక సినిమా సాంస్కృతిక సైనికుడిగా 40 ఏళ్లుగా సామాజిక సమస్యలే ఇతివృత్తంగా సినిమాలు తీస్తున్నాను. ఇందులోనే నాకు సంతృప్తి, ఆనందం దక్కుతున్నాయి. శ్రీశ్రీ చెప్పినట్లు నేను సైతం ప్రపంచానికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను అనేలా సామాజిక అంశాలపైన సినిమాలు తీస్తున్నాను తప్ప నేనేదో సమాజాన్ని ఉద్ధరించడం కోసం తీస్తున్నానని అనుకోవడంలేదు. గూడవల్లి రామబ్రహ్మంవంటి మహనీయులు సామాజిక అంశాలతో సినిమాలను రూపొందించి లెజెండ్స్‌గా నిలిచారు. వారి అడుగుజాడల్లో నడుస్తున్న చిన్నపిల్లవాడిని నేను.
► ‘యూనివర్సిటీ’ సినిమా గురించి?
విద్య, నిరుద్యోగం ప్రధానాంశాలుగా ఈ చిత్రాన్ని రూపొందించాను. ప్రైవేటు విద్య వద్దు, పబ్లిక్ విద్యే ముద్దు అనే అంశంతో తీశాను. ప్రస్తుతం ప్రైవేటు విద్యా వ్యవస్థ వల్ల చదువు వ్యాపారంగా మారిపోయింది. ఈ వ్యవస్థలో ఫస్ట్ ర్యాంకులు సాధించాలని పేపర్ లీకేజీలు, మాల్ ప్రాక్టీస్‌లు పెరిగిపోయాయి. దీనివల్ల బాగా చదివిన విద్యార్థులు వెనకబడిపోతున్నారు. ఇవి భరించలేక ఆ విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అంతేకాకుండా క్యాంపస్ వేదికల్లోనిప్రొఫెసర్లు కూడా కులాలకు, మతాలకు ప్రాధాన్యతనిస్తూ వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్నారు. ఇలాంటి అసమానతలు పోవాలంటే కొఠారీ కమిషన్ పేర్కొన్నట్టు ప్రభుత్వ విద్యకు ప్రత్యేక బడ్జెట్ కేటాయించాలి, ప్రైవేటు సంస్థల్లోని వసతులు ఇక్కడ కూడా అందేలా చూడాలి. ఈ అంశాలు ప్రతిబింబించేలా ఈ సినిమా తీశాను.
► విద్య గురించి మాత్రమేనా? ఇతర విషయాలేమైనా ఈ సినిమాలో చె΄్పారా?
ఉద్యోగాల గురించి కూడా చర్చించాను. అతి పెద్ద గ్లోబల్ విలేజ్ అయినటువంటి భారత్ నుంచి ఎందరో విద్యార్థులు ఉద్యోగాల కోసం విదేశాలకు వెళుతున్నారు. కానీ అక్కడ కూడా నిరుద్యోగం పెరిగిపోయి మనవారికి ఉద్యోగాలు ఇవ్వలేకపోతున్నారు. బడుగు బలహీన వర్గాలకు రిజర్వేషన్ రాజ్యాంగ హక్కు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజలు అవన్నీ కోల్పోతున్నారు. అందుకే 1986లో మురళీధర్ రావు కమిషన్, 1990లో మండల్ కమిషన్ తెలిపిన రిపోర్టు ప్రకారం ప్రైవేటు సెక్టార్‌లో కూడా రిజర్వేషన్‌లు అమలు చేయాల్సిన అవసరముంది. మనది నిరుద్యోగ భారతం కాదు... ఉద్యోగ భారతం కావాలని చెప్పే చిత్రం ఇది.
► తెలుగు భాషకు ్రపాధాన్యం ఇచ్చే మీరు ఈ చిత్రంలో రెండు ఇంగ్లిష్ పాటలు పెట్టారు?
‘ఎవిరీ బడీ సే నో టు ప్రైవేట్ స్కూల్స్.. ఎవిరీ బడీ సే యస్ టు పబ్లిక్ స్కూల్స్.. ఎవిరీ బడీ వాంట్స్ కామన్ ఎడ్యుకేషన్’ అనే మహోన్నత ఆశయంతో వేల్పుల నారాయణగారు గొప్ప పాట రాశారు. ఈ పాటను సాయిచరణ్ అంతే గొప్పగా పాడారు.
ఇంకో ఇంగ్లిష్ పాటను జలదంకి సుధాకర్ రాయగా, సాయిచరణ్ పాడారు. ఈ రెండు ఇంగ్లిష్ పాటలతో పాటు ‘తాత. తాత..’ అని గద్దరన్న రాసి, పాడిన పాట, ఇతర పాటలు కూడా సందర్భానుసారం సాగుతాయి.
► ప్రజా సమస్యలతో సినిమాలు తీస్తున్న మీ గురించి ప్రజలు నాలుగు మంచి మాటలు మాట్లాడినప్పుడు కలిగే అనుభూతి..
నారాయణమూర్తి మన సమస్యలు తీస్తున్నాడు.. మన కథలను చూపిస్తున్నాడు.. ఒక కళాకారుడుగా మన గుండెల్లోని బాధను సినిమాలో చూపించాడు... పరిష్కారం మార్గం చూపిస్తున్నాడు. అతను మన మనిషి. ప్రజా కళాకారుడు అని ప్రజలు అంటున్న ఆ మాటలను పెద్ద దీవెనలుగా భావిస్తున్నాను. ఏ కథాంశం అయినా ఆకట్టుకుంటేనే అభిమానులు చూస్తారు. ‘అర్ధరాత్రి స్వతంత్రం’ నుంచి ఇప్పటివరకు సామాజిక సమస్యలే ప్రధానాంశాలుగా సినిమాలు తీస్తున్నాను. ప్రజలు దీవిస్తే అదే నా సంపాదన. నా సినిమాలు వంద రోజులు, జూబ్లీ వేడుకలు చేసుకున్నాయి. సక్సెస్ అయినా ఫెయిల్ అయినా సినిమాలు తీస్తూనే ఉంటాను.
ఆ మాటలే నాకు దీవెనలు
Published Fri, Jun 9 2023 1:07 AM | Last Updated on Fri, Jun 9 2023 1:07 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment