లెక్క కుదిరింది | Directors and Producer Hit Combination Repeat in Tollywood | Sakshi
Sakshi News home page

లెక్క కుదిరింది

Published Sun, Jun 2 2024 12:21 AM | Last Updated on Sun, Jun 2 2024 5:45 PM

Directors and Producer Hit Combination Repeat in Tollywood

కెప్టెన్‌ ఆఫ్‌ ది షిప్‌ (డైరెక్టర్‌)కి, షిప్‌ ఓనర్‌ (ప్రోడ్యూసర్‌)కి మధ్య మంచి రిలేషన్‌ ఉండాలి. షిప్‌ (సినిమా)ని జాగ్రత్తగా హ్యాండిల్‌ చేసి, యజమాని నష్టపోకుండా కెప్టెన్‌ చూసుకుంటే.. ఇక అతనికి, యజమానికీ మధ్య మంచి అవగాహన కుదురుతుంది. మళ్లీ మళ్లీ కలిసి ప్రయాణం చేయాలనుకుంటారు.

అలా లెక్కలు కుదిరి కొన్ని కాంబినేషన్లు రిపీట్‌ అవుతున్నాయి. ఇలా ఓ దర్శకుడికి–నిర్మాతకి మధ్య స్నేహం కుదరడం, మళ్లీ కలిసి సినిమాలు చేయాలనుకోవడం ఓ ఆరోగ్యకరమైన వాతావరణం అని చెప్పాలి. రిపీట్‌ అవుతున్న ఆ దర్శక–నిర్మాతల కాంబినేషన్‌ గురించి తెలుసుకుందాం.

                                                        ‘దిల్‌’ రాజు, అనిల్‌ రావిపూడి
మూడోసారి ‘దిల్‌’ కలిసింది
కుటుంబ నేపథ్యంలో సినిమాలు తీసి విజయాలు అందుకునే నిర్మాతగా ‘దిల్‌’ రాజుకి పేరుంది. ప్రేక్షకులు కడుపుబ్బా నవ్వుకునేలా సినిమా తెరకెక్కించగల దర్శకుడు అనిల్‌ రావిపూడి. వీరిద్దరి కాంబినేషన్‌లో సుప్రీమ్‌ (2016), ‘రాజా ది గ్రేట్‌’ (2017), ‘ఎఫ్‌ 2’ (2019), ‘సరిలేరు నీకెవ్వరు’ (2020), ‘ఎఫ్‌ 3’ (2022) వంటి హిట్‌ సినిమాలు వచ్చాయి. తాజాగా అనిల్‌–‘దిల్‌’ రాజు కాంబినేషన్‌లో మరో సినిమా తెరకెక్కనుంది. ఇందులో వెంకటేశ్‌ హీరో. హిట్‌ చిత్రాలు ‘ఎఫ్‌ 2’, ‘ఎఫ్‌ 3’ తర్వాత వెంకటేశ్‌–అనిల్‌ రావిపూడి–‘దిల్‌’ రాజు కాంబినేషన్‌లో రూపొందనున్న మూడో చిత్రమిది. ఈ సినిమాకి ‘సంక్రాంతికి వస్తున్నాం’ టైటిల్‌ అనుకుంటున్నారట. 

 

                                                      రవిశంకర్, నవీన్, సుకుమార్‌
గురు–శిష్యులతో మైత్రీ
డైరెక్టర్‌ సుకుమార్‌–మైత్రీ మూవీ మేకర్స్‌ నవీన్‌ ఎర్నేని, వై. రవిశంకర్‌ల కాంబినేషన్‌లో వచ్చిన తొలి చిత్రం ‘రంగస్థలం’ (2018). రామ్‌చరణ్, సమంత జోడీగా నటించిన ఈ మూవీ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. సుకుమార్‌–మైత్రీ కాంబినేషన్‌లో రూపొందిన రెండో చిత్రం ‘పుష్ప: ది రైజ్‌’ (2021). అల్లు అర్జున్, రష్మికా మందన్న జోడీగా నటించిన ఈ చిత్రం పాన్‌ ఇండియా స్థాయిలో వసూళ్ల వర్షం కురిపించింది. ఈ సినిమాకి సీక్వెల్‌గా సుకుమార్‌–నవీన్‌ ఎర్నేని, వై. రవిశంకర్‌ కాంబినేషన్‌లో ‘పుష్ప 2: ది రూల్‌’ తెరకెక్కుతోంది. ఈ చిత్రంలోనూ అల్లు అర్జున్, రష్మికానే జోడీగా నటిస్తున్నారు. ఆగస్టు 15న ఈ సినిమా రిలీజ్‌ కానుంది.


∙సుకుమార్‌ శిష్యుడు బుచ్చిబాబు సనాని దర్శకునిగా పరిచయం చేస్తూ వైష్ణవ్‌ తేజ్, కృతీ శెట్టి జంటగా మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మించిన ‘ఉప్పెన’ (2021) బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. తన రెండో చిత్రాన్ని కూడా మైత్రీలోనే చేస్తున్నారు బుచ్చిబాబు. రామ్‌చరణ్‌ హీరోగా నవీన్, రవిశంకర్‌ నిర్మిస్తున్న ఈ చిత్రంలో జాన్వీ కపూర్‌ హీరోయిన్‌. 

                                                 సునీల్, రామ్మోహన్‌ రావు, శేఖర్‌ కమ్ముల
శేఖర్‌తో మరో సినిమా
ప్రేమకథలే కాదు.. కుటుంబ కథలనూ తనదైన శైలిలో తెరకెక్కించి ప్రేక్షకులను ఆకట్టుకునే దర్శకుడు శేఖర్‌ కమ్ముల. ఆయన ప్రస్తుతం ధనుష్, నాగార్జున హీరోలుగా ‘కుబేర’ సినిమా తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రాన్ని నారాయణ్‌ దాస్‌ కె. నారంగ్‌ ఆశీస్సులతో శ్రీ వెంకటేశ్వర సినిమాస్‌ ఎల్‌ఎల్‌పీ (ఏషియన్‌ గ్రూప్‌), అమిగోస్‌ క్రియేషన్స్ పై సునీల్‌ నారంగ్, పుస్కూర్‌ రామ్మోహన్‌ రావు నిర్మిస్తున్నారు. కాగా శేఖర్, సునీల్‌ నారంగ్, రామ్మోహన్‌ కాంబినేషన్‌లో రూపొందుతోన్న రెండో చిత్రం ఇది. ఈ కాంబినేషన్‌లో నాగచైతన్య, సాయి పల్లవి జంటగా వచ్చిన ‘లవ్‌ స్టోరీ’ (2021) సూపర్‌ హిట్టయింది.

                                     నాగ్‌ అశ్విన్, ప్రియాంక, అశ్వినీదత్, స్వప్న
హోమ్‌ బేనర్‌లో నాగ్‌ అశ్విన్‌
ఇంట్లోనే ఒక పెద్ద బేనర్‌ ఉంటే బయట బేనర్ల అవసరం అంతగా ఉండదు. డైరెక్టర్‌ నాగ్‌ అశ్విన్‌కి రెండు హోమ్‌ బేనర్లు వైజయంతీ మూవీస్, స్వప్న సినిమాస్‌ ఉన్నాయి. అశ్వినీదత్‌ రెండో కుమార్తె ప్రియాంక, నాగ్‌ అశ్విన్‌ పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. వైజయంతీ మూవీస్‌పై అశ్వినీదత్, స్వప్న సినిమాస్‌పై ఆయన కుమార్తెలు ప్రియాంక, స్వప్న సినిమాలు నిర్మిస్తున్నారు. ఈ బేనర్లలో ‘ఎవడే సుబ్రమణ్యం’ (2015), ‘మహా నటి’ (2018) సినిమాలకు దర్శకత్వం వహించారు నాగ్‌ అశ్విన్‌. ప్రస్తుతం ఆయన దర్శకత్వంలో వైజయంతీ మూవీస్‌ నిర్మించిన చిత్రం ‘కల్కి 2898 ఏడీ’. ప్రభాస్‌ హీరోగా సైన్స్‌ ఫిక్షన్‌ నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రం తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ, ఇంగ్లిష్‌ భాషల్లో ఈ నెల 27న రిలీజ్‌ కానుంది.

                                                   నాగవంశీ, వెంకీ
సార్‌తో ఆరంభమై లక్కీతో మళ్లీ...
డైరెక్టర్‌ వెంకీ అట్లూరి, నిర్మాతలు సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య కాంబినేషన్‌లో వచ్చిన తొలి చిత్రం ‘సార్‌’ (తమిళంలో వాత్తి). ధనుష్, సంయుక్తా మీనన్‌ జంటగా సితార ఎంటర్‌టైన్ మెంట్స్, ఫార్చ్యూన్  ఫోర్‌ సినిమాస్‌పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించిన ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో గత ఏడాది విడుదలై ఘనవిజయం సాధించింది. ఈ దర్శక–నిర్మాతల కాంబినేషన్‌లో తాజాగా ‘లక్కీ భాస్కర్‌’ సినిమా రూపొందుతోంది. ఈ చిత్రంలో దుల్కర్‌ సల్మాన్ , మీనాక్షీ చౌదరి జంటగా నటిస్తున్నారు. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో  ఈ సినిమా సెప్టెంబరు 27న రిలీజ్‌ కానుంది.

                                                         శ్రీకాంత్‌ చెరుకూరి, శ్రీకాంత్‌ ఓదెల
హీరో కూడా రిపీట్‌
శ్రీకాంత్‌ ఓదెల దర్శకునిగా పరిచయమైన చిత్రం ‘దసరా’ (2023). తొలి చిత్రంతోనే నానీని దర్శకత్వం వహించే చక్కని అవకాశం అందుకుని సద్వినియోగం చేసుకున్నారు. నాని, కీర్తీ సురేష్‌ జోడీగా శ్రీలక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్‌ బ్యానర్‌పై సుధాకర్‌ చెరుకూరి నిర్మించిన ఈ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. కాగా ‘దసరా’ కాంబినేషన్‌లోనే మరో సినిమా రానుంది. నాని కెరీర్‌లో ఇది 33వ చిత్రం. ఈ చిత్రాన్ని శ్రీకాంత్‌ ఓదెల దర్శకత్వంలో సుధాకర్‌ చెరుకూరి నిర్మిస్తారు. 

టీజీ విశ్వప్రసాద్, కార్తీక్‌ 
                                             టీజీ విశ్వప్రసాద్, కార్తీక్‌  
రెండోసారి రెండు భాగాలతో...
 ‘ఈగల్‌’ చిత్రం తర్వాత డైరెక్టర్‌ కార్తీక్‌ ఘట్టమనేని–పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ కాంబినేషన్‌లో ‘మిరాయ్‌’ సినిమా రూపొందుతోంది. రవితేజ, అనుపమా పరమేశ్వరన్, కావ్యా థాపర్‌ హీరో, హీరోయిన్లుగా పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీపై టీజీ విశ్వప్రసాద్‌ నిర్మించిన ‘ఈగల్‌’ ఈ ఏడాది విడుదలైంది. ప్రస్తుతం కార్తీక్‌–విశ్వప్రసాద్‌ కాంబినేషన్‌లో ‘మిరాయ్‌’ చిత్రం రూపొందుతోంది. తేజ సజ్జా, రితికా నాయక్‌ జంటగా నటిస్తున్న ‘మిరాయ్‌’లో మంచు మనోజ్‌ కీలక పాత్ర చేస్తున్నారు. రెండు భాగాలుగా రానున్న ఈ సినిమా తొలి భాగం 2025 ఏప్రిల్‌ 18న రిలీజ్‌ కానుంది. తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో 2డీ, 3డీ వెర్షన్లలోనూ రిలీజ్‌ కానుంది. 

                                               ప్రశాంత్‌ వర్మ, నిరంజన్‌ రెడ్డి
ఈసారి ‘జై హనుమాన్‌’తో...
సంక్రాంతి అంటే స్టార్‌ హీరోల చిత్రాల పోటీ ఉంటుంది. అయితే ఈ ఏడాది సంక్రాంతికి స్టార్‌ హీరోల సినిమాలతో పోటీ పడి, ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై బ్లాక్‌ బస్టర్‌ అయిన చిత్రం ‘హనుమాన్‌’. తేజ సజ్జా హీరోగా ఈ చిత్రానికి ప్రశాంత్‌ వర్మ దర్శకత్వం వహించారు. చైతన్య సమర్పణలో ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్‌పై కె. నిరంజన్‌ రెడ్డి నిర్మించిన ఈ సినిమా పాన్‌ ఇండియా స్థాయిలో హిట్‌ అయింది. ఇక ‘హనుమాన్‌’కి సీక్వెల్‌గా ప్రశాంత్‌ వర్మ–చైతన్య–నిరంజన్‌ రెడ్డి కాంబినేషన్‌లో ‘జై హనుమాన్‌’ రూపొందుతోంది. 2025లో ఈ చిత్రం విడుదల కానుంది.
వీరే కాదు.. మరికొందరు దర్శక–నిర్మాతల కాంబినేషన్స్‌ కూడా రిపీట్‌ అవుతున్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement