విశాఖలో జరిగిన ర్యాలీలో ఆర్.నారాయణమూర్తి, ప్రజాసంఘాల నాయకులు
సాక్షి, విశాఖపట్నం/ద్వారకానగర్ (విశాఖ దక్షిణ): పోరాటాలతో సాధించుకున్న విశాఖ స్టీల్ ప్లాంట్‌ను అమ్మేయడానికి మీరెవ్వరంటూ కేంద్ర పెద్దలను సినీ నటుడు, దర్శక నిర్మాత ఆర్.నారాయణమూర్తి ప్రశ్నించారు. ప్రయివేటీకరించే నిర్ణయాన్ని ఎందుకు రహస్యంగా తీసుకున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ రక్షణ ప్రజా వేదిక ఆధ్వర్యంలో విశాఖ నగరంలోని డాబా గార్డెన్స్ అంబేడ్కర్ విగ్రహం నుంచి జీవీఎంసీ మహత్మాగాంధీ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ గతంలో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు రూ.200 కోట్ల లాభాల్లో ఉన్న గంగవరం పోర్టును కేంద్ర ప్రభుత్వంతో కలిసి ప్రయివేటీకరించేందుకు పూనుకున్నారని, మళ్లీ ఇప్పుడు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణకు కేంద్రం పూనుకోవడం దేశద్రోహమన్నారు.
తెలుగువాడైన ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఈ విషయమై చూస్తూ ఊరుకోవద్దని విజ్ఞప్తి చేశారు. అన్ని రాజకీయ పార్టీలూ జెండాలు పక్కన పెట్టి స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిచ్చారు. అంబానీ, అదానీలకు పక్కన పెట్టాలంటూ ప్రధానిని కోరారు. సౌత్ కొరియా కంపెనీ ‘పోస్కో’ను విశాఖలో అడుగు పెట్టనీయకూడదన్నారు. విశాఖ మనదిరా.. స్టీల్ ప్లాంట్ మనదిరా.. కేంద్రమేందిరో.. దాని దూకుడేందిరో.. అంటూ పాట పాడి ఉత్తేజం కలిగించారు. కార్యక్రమంలో అనకాపల్లి ఎంపీ సత్యవతి, రైటర్స్ ఆకాడమీ చైర్మన్ రమణమూర్తి తదితరులు పాల్గొన్నారు.
కొనసాగుతున్న ‘ఉక్కు’ ఉద్యమం
స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ విశాఖలో నిరసనలు కొనసాగుతున్నాయి. ప్రజా సంఘాలు, ఉద్యోగ, కార్మిక సంఘాలు, వివిధ రాజకీయ పార్టీల ఆధ్వర్యంలో ధర్నాలు, ర్యాలీలు, దీక్షలు నిర్వహిస్తున్నారు. ఆయా పార్టీలు, సంఘాల నాయకులు, ప్రత్యేక హాదా, విభజన హామీల సాధన సమితి కన్వీనర్ చలసాని శ్రీనివాసరావు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment