ఒకపక్క నష్టాల పేరు చెప్పి ప్రైవేటీకరణ చేస్తామని చెబుతుంటే... మరో పక్క ఆ నష్టాలు అధికమయ్యే అనేక సమస్యలను ఎదుర్కొంటోంది విశాఖ ఉక్కు కర్మాగారం. ప్రస్తుతం ఉక్కు తయారీలో కీలక పాత్ర పోషించే ద్రవరూప ఖనిజం (స్టీల్ మెటల్ లిక్విడ్) ఉత్పత్తికి విఘాతం వాటిల్లింది. దీనికి ప్రధాన కారణం బొగ్గు కొరత. అలాగే నిధుల లేమి, ముడి ఖనిజం కొరత అగ్నికి ఆజ్యం తోడైనట్లు పరిణమించాయి. ఆంధ్రుల హక్కైన ‘విశాఖ ఉక్కు’కు ఈ సమస్యలన్నీ ఉరితాళ్లలా పరిణమించాయి.
విశాఖ స్టీల్ ప్లాంట్‌లో ద్రవ ఉక్కు ఖనిజాన్ని ఉత్పత్తి చేయడంలో గోదావరి (బ్లాస్ట్ ఫర్నేస్–1), కృష్ణా (బ్లాస్ట్ ఫర్నేస్–2), అన్నపూర్ణ (బ్లాస్ట్ ఫర్నేస్–3) బ్లాస్ట్ ఫర్నేస్‌లది కీలక పాత్ర. అయితే వీటిలో రెండు మూలన పడ్డాయి. ఈ నెల 12న అన్నపూర్ణ (బీఎఫ్– 3) మూత పడింది. గోదావరి ఈ ఏడాది మార్చిలో ద్రవ ఖనిజ ఉత్పత్తిని ఆపేసింది.
ఇక మిగిలింది కృష్ణా మాత్రమే. ఇందులోనూ ఒకటి రెండు రోజుల్లో ఉత్పత్తి నిలిచిపోయే ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. ప్రస్తుతం కృష్ణాకు అతి కొద్ది బొగ్గు మాత్రమే అందుబాటులో ఉంది. అన్న పూర్ణ సామర్థ్యానికి తగినంత బొగ్గు అందుబాటులో లేనందునే మూత పడిందని సంబంధిత అధికార వర్గాలు వెల్లడించాయి.
రోజుకు మూడు బ్లాస్ట్ ఫర్నేస్‌ల నుంచి 20 వేల టన్నుల ద్రవ ఉక్కు ఖనిజాన్ని ఉత్పత్తి చేయాలంటే 14 వేల టన్నుల బొగ్గు అవసరం. ఈ లెక్కన 45 రోజులకు కావాల్సిన బొగ్గును ముందస్తుగానే సమకూర్చు కోవాలి. అంటే 6.3 లక్షల టన్నుల బొగ్గు నిల్వలను అందు బాటులో ఉంచాలి. కానీ ప్రస్తుతం 20 వేల టన్నుల బొగ్గు మాత్రమే ఉంది. దీని వినియోగం పూర్తయిన వెంటనే కృష్ణా బ్లాస్ట్ ఫర్నేస్ నుంచి ఉత్పత్తి ప్రక్రియను ఆపేసేందుకు యాజమాన్యం నిర్ణయించింది.
అన్నపూర్ణను మూసే స్తున్నట్లు కొద్ది రోజుల కిందటే అంతర్గతంగా ఉత్తర్వులు జారీ అయ్యాయి. సాంకేతిక మార్గదర్శకాలు, ముడి సరుకుల కొరతతో పాటు కీలకమైన బొగ్గు లభ్యత లేనందున నిర్ణయం తీసుకున్నాం అంటూ ఆ ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. ద్రవరూప ఉక్కు ఖనిజం ఉత్పత్తి కావాలంటే బ్లాస్ట్ ఫర్నేస్ నాజిల్ వరకు బొగ్గు నింపి మండించే ప్రక్రియను చేపట్టాలి. కానీ ఆ స్థాయిలో బొగ్గు లేనందున మూసేస్తున్నామంటున్నారు.
అన్నపూర్ణ నుంచి ఉత్పత్తి 2012లో ప్రారంభమైంది. అనతి కాలంలో 7.3 మిలియన్ టన్నుల ఉత్పత్తి సామర్థ్యానికి దీన్ని విస్తరించారు. 23 నెలల కిందట అంటే జనవరి 2022 నుంచి డిసెంబరు 2023 మధ్య కాలంలో ఈ బ్లాస్ట్ ఫర్నేస్‌లో ఉత్పత్తి ఆగిపోయింది. కారణం ముడి సరుకు అందుబాటులో లేకపోవడం. మరోవైపు కరోనా ప్రభావం దీనికి తోడైంది. ఈ ఏడాది జనవరిలో సవాళ్లను అధిగమించి పని ప్రారంభించింది.
ఇకపై సమస్యలేవీ లేవనుకుంటున్న తరు ణంలో బొగ్గు కొరత రూపేణా పూడ్చలేని అవరోధం రావడంతో ఉక్కు ఉత్పత్తితో పాటు పరిశ్రమ మనుగడ ప్రశ్నార్థకం అయ్యింది.
కేంద్ర ప్రభుత్వం సమస్యను గుర్తించి తగినంత ముడి బొగ్గును సర ఫరా చేయక పోతే ఉక్కు ఉత్పత్తి పూర్తి స్థాయిలో ఆగి పోతుంది. ఇదే జరిగితే 1982లో ఉక్కు కర్మాగారం ఆవిర్భావం అనంతరం... మొట్ట మొదటి సారిగా విశాఖ ఉక్కు కర్మాగారంలో ఉత్పత్తి నిలిచే ప్రమాదం పొంచి ఉంది.
ప్రైవేటీకరణలో వెనక్కితగ్గేదే లేదంటూ దేశరాజధానిలో కేంద్ర ప్రభుత్వ పెద్దలు ఓవైపు... అలా జరిగేదేమీ లేదంటూ స్థానిక కూటమి పాలకులు మరోవైపు భిన్న స్వరాలు వినిపిస్తున్న తతంగాన్ని ఆంధ్రులంతా గమనిస్తున్నారు. ఇప్పటికైనా ప్లాంట్ నిర్వహణ విషయమై ఇక్కడి పాలకులు కేంద్రానికి నివేదిస్తారా, లేదా ఏవో హామీలతో కాల యాపన చేస్తారా అన్నది వేచి చూడాల్సిన విషయం.
– తిరుమలరావు కరుకోల ‘ జర్నలిస్ట్, 98494 93833
విశాఖ ఉక్కు భవితవ్యం ఏమిటి?
Published Tue, Sep 24 2024 5:15 AM | Last Updated on Tue, Sep 24 2024 5:15 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment