టీడీపీ, జనసేనలను డిమాండ్ చేసిన ఉత్తరాంధ్ర ప్రజా సంస్థ
విశాఖలో జనసంద్రమైన మహా పాదయాత్ర
ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా హోరెత్తిన నినాదాలు
సీతమ్మధార: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను కేంద్రం తక్షణమే ఆపాలని.. లేకుంటే టీడీపీ, జనసేన పార్టీలు కేంద్రానికి తమ మద్దతును ఉపసంహరించాలని ఉత్తరాంధ్ర ప్రజా సంస్థ కన్వినర్ వీవీ రమణమూర్తి డిమాండ్ చేశారు. పోరాడి ప్రాణ త్యాగాలతో సాధించుకున్న విశాఖ ఉక్కును.. ఇప్పుడు ఉద్యమించి కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. ఉత్తరాంధ్ర ప్రజా సంస్థ నేతృత్వంలో రాజకీయ పార్టీలకతీతంగా జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద బుధవారం మహా పాదయాత్ర నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభా వేదికపై ఆయన ప్రసంగించారు.
ఆనాడు తమనంపల్లి అమృతరావు స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు ఆమరణ నిరాహార దీక్ష చేసిన విషయాన్ని గుర్తు చేశారు. స్టీల్ ప్లాంట్‌లో పనిచేస్తున్న 4,290 మంది కాంట్రాక్ట్ కార్మికుల్ని తొలగించాలనుకోవడం దారుణమన్నారు. ఉత్తరాంధ్ర ప్రజల ఊపిరి స్టీల్ ప్లాంట్ అని, ఉద్యమం ద్వారా ఈ విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలని తెలిపారు. స్టీల్ ప్లాంట్ పరిరక్షణ ఉద్యమంలో పోరాడి విజయం సాధిద్దామని పిలుపునిచ్చారు.
స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను విరమించుకుని సొంత గనులు కేటాయించి ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలని, రూ.10 వేల కోట్ల వర్కింగ్ క్యాపిటల్ కేటాయించాలని, స్వచ్ఛంద పదవీ విరమణ పథకాన్ని, బదిలీలను నిలిపివేసి నిర్వాసితులందరికీ ఉద్యోగాలిచి్చ.. కాంట్రాక్ట్ కార్మికుల్ని క్రమబదీ్ధకరించాలని, రిజర్వేషన్లు అమలు చేయాలని తదితర తీర్మానాలను రమణమూర్తి సభలో చదివి వినిపించారు.
తరలి వచ్చిన జనవాహిని
అంతకు ముందు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నిర్వహించిన ర్యాలీ జన సంద్రమైంది. మార్గంమధ్యంలో ప్రజలు ఈ యాత్రకు నీరాజనాలు పలికారు. ర్యాలీకి సంఘీభావంగా దారి పొడవునా పలువురు వ్యాపారులు మద్దతు పలికారు. జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన సభా ప్రాంగణం వద్దకు మహా పాదయాత్ర చేరగానే అక్కడ ఉద్యమ పండగ వాతావరణం నెలకొంది. కేంద్ర ప్రభుత్వ విధానాలకు నిరసనగా ఉద్యమకారులు చేసిన నినాదాలతో ప్రజా ఉద్యమ వేదిక సభా ప్రాంగణం దద్ధరిల్లింది.
కార్యక్రమంలో ఎమ్మెల్సీ పాకలపాటి రఘువర్మ, పీవోడబ్ల్యూ జిల్లా అధ్యక్షురాలు వెంకటలక్ష్మి, విశాఖ సిటిజన్ ఫోరం అధ్యక్షుడు తిలక్, నాగార్జున యూనివర్సిటీ మాజీ వీసీ బాలమోహన్‌దాస్, భారత నాస్తిక సమాజం జిల్లా, రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామమూర్తి వై.నూకరాజు, న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు కేఎస్ చలం, మురికివాడల సంక్షేమ సంఘం తరఫున కె.రవికుమార్, ఇసరపు లక్ష్మి, హెచ్‌ఆర్‌ఎఫ్ నుంచి శరత్, ప్రగతిశీల కార్మిక సంఘం తరఫున కె.అన్నపూర్ణ, ఎన్‌ఎఫ్‌ఐడబ్ల్యూ రాష్ట కార్యదర్శి అత్తిలి విమల, ఐఎన్‌టీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి భోగవిల్లి నాగభూషణం, దళిత సేన అధ్యక్షుడు పాల్తేటి పెంటారావు, ఏపీ నిరుద్యోగ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు సమయం హేమంత్‌కుమార్, వివిధ ప్రజా సంఘాలు, అఖిలపక్షాల ప్రతినిధులు పాల్గొన్నారు.
రాష్ట్ర ప్రభుత్వానికి లడ్డూపై ఉన్న శ్రద్ధ స్టీల్ ప్లాంట్‌పై లేదు
సీతమ్మధార: రాష్ట్ర ప్రభుత్వానికి తిరుపతి లడ్డూతో రాజకీయాలు చేయడంపై ఉన్న శ్రద్ధ.. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ పరిరక్షణపై లేదని అఖిలపక్ష సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. స్టీల్ ప్లాంట్‌ను ప్రభుత్వ రంగంలోనే కొనసాగించేలా సెయిల్‌లో విలీనం చేయాలని, ప్లాంట్‌కు సొంతగనులు కేటాయించాలని మాజీ వీసీ ప్రొఫెసర్ చలం, సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జేవీ సత్యాన్నారాయణమూర్తి, సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు లోకనాథం డిమాండ్ చేశారు.
స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం రాష్ట్ర వ్యాప్తంగా కార్మిక సంఘాల జేఏసీ నిరాహార దీక్షకు పిలుపునిచ్చి0ది. విశాఖలోని జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద భారీ ఎత్తున నిరహార దీక్ష చేపట్టారు. వారు మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వస్తే స్టీల్‌ప్లాంట్‌ను రక్షిస్తామని చెప్పిన నాయకులు నేడు బీజేపీ చర్యల్ని ఎందుకు అడ్డుకోలేకపోతున్నారో ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
స్టీల్ ప్లాంట్ పరిరక్షణ అఖిలపక్ష కార్మిక, ప్రజ సంఘాల పోరాట కమిటీ జేఏసీ చైర్మన్ జగ్గునాయుడు, వైస్ చెర్మన్ నాగభూషణం, మన్మథరావులు మాట్లాడుతూ చంద్రబాబు, పవన్‌కళ్యాణ్‌లు స్టీల్ ప్లాంట్‌ను బీజేపీకి తాకట్టుపెట్టే విధానాలు అవలంభిస్తే ప్రజలు బుద్ధి చెబుతారని హెచ్చరించారు. కార్యక్రమానికి సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి కుమార్, ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి అచ్యుతరావు, సీఐఎఫ్‌టీయూ జాతీయ కార్యదర్శి ఎ.కనకారావు, ఏఐసీటీయూ జిల్లా కార్యదర్శి కె.శంకరావు, ఏపీఎఫ్‌టీయూ కె.దేవా, మల్లన్న, వివిధ సంఘాల నేతలు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment