సాక్షి, న్యూఢిల్లీ/హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు నామినేషన్ల పర్వం శుక్రవారంతో ముగుస్తున్న వేళ కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థుల చివరి, నాలుగో జాబితాను గురువారం రాత్రి ప్రకటించింది. మిగిలిన నాలుగు స్థానాలకు కొత్తగా అభ్యర్థులను ప్రకటించడంతోపాటు అదనంగా పటాన్‌చెరు అభ్యర్థిని మార్చింది. ఈ స్థానంపై తలెత్తిన పంచాయితీని పరిష్కరించింది. ముందుగా ప్రకటించిన నీలం మధు ముదిరాజ్ స్థానంలో పాతకాపు కాట శ్రీనివాస్‌గౌడ్ వైపే అధిష్టానం మొగ్గుచూపింది.
బీఆర్‌ఎస్ నుంచి ఇటీవల కాంగ్రెస్ కండువా కప్పుకున్న నీలం మధు ముదిరాజ్‌కు మూడో జాబితాలో పటాన్‌చెరు టికెట్ కేటాయించినప్పటికీ బీఫామ్ ఇవ్వని అధిష్టానం.. తాజాగా మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ అనుచరుడైన శ్రీనివాస్‌గౌడ్‌కు టికెట్ కేటాయించింది. దీంతో దామోదర పట్టుబట్టి తన పంతం నెగ్గించుకున్నట్లయింది. అలాగే సూర్యాపేట స్థానం నుంచి రాంరెడ్డి దామోదర్‌రెడ్డి, పటేల్ రమేశ్‌రెడ్డి మధ్య పెద్ద ఎత్తున పోటీ నెలకొనగా అధిష్టానం మాత్రం దామోదర్‌రెడ్డినే అభ్యర్థిగా ఎంపిక చేసింది.
మరోవైపు తుంగతుర్తి అభ్యర్థిగా అనూహ్యంగా గిడ్డంగుల సంస్థ మాజీ చైర్మన్ మందుల శామ్యూల్ టికెట్ దక్కించుకున్నారు. మాదిగ, మాల కుల సమీకరణల్లో భాగంగానే అధిష్టానం శామ్యూల్‌ను ఎంపిక చేసిందనే చర్చ జరుగుతోంది. అలాగే పొత్తులో భాగంగా సీపీఎం కోరిన మిర్యాలగూడ టికెట్ ఎట్టకేలకు బలమైన నాయకుడు బత్తుల లక్ష్మారెడ్డికే దక్కింది. దీంతో అక్కడి కాంగ్రెస్ శ్రేణులు ఊపిరి పీల్చుకున్నాయి. చార్మినార్ టికెట్‌ను స్థానిక నేత మహ్మద్ ముజీబ్ ఉల్లాహ్ షరీఫ్‌కు పార్టీ కేటాయించింది. గురువారం విడుదల చేసిన నాలుగో జాబితాతో కలిపి మొత్తం 118 స్థానాలకు కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటించినట్లయింది. పొత్తులో భాగంగా కొత్తగూడెం స్థానాన్ని సీపీఐకి కేటాయించడం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment