ఎన్నో ట్విస్టులు.. ఎంతో కసరత్తు | Congress party has finalized its candidates for 118 seats | Sakshi
Sakshi News home page

ఎన్నో ట్విస్టులు.. ఎంతో కసరత్తు

Published Sat, Nov 11 2023 3:38 AM | Last Updated on Thu, Nov 23 2023 11:45 AM

Congress party has finalized its candidates for 118 seats - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఎట్టకేలకు అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ తరఫున పోటీ చేసే అభ్యర్థులు ఖరారయ్యారు. రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను పొత్తులో భాగంగా కొత్తగూడెం స్థానాన్ని సీపీఐకి కేటాయించగా, మిగిలిన 118 స్థానాలకు నాలుగు జాబితాల్లో పార్టీ అధిష్టానం అభ్యర్థులను ప్రకటించింది. గత నెల 15వ తేదీన మొదటి జాబితాను ప్రకటించగా, దాదాపు 25 రోజుల కసరత్తు తర్వాత ఈనెల 9వ తేదీన  నాలుగో జాబితాను ప్రకటించింది. పలు మార్పులు చేర్పులు, ట్విస్టులు, తర్జనభర్జనల తర్వాత అభ్యర్థుల ఎంపికను పూర్తి చేసింది.

టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి కొడంగల్‌తో పాటు కామారెడ్డిలో పోటీ చేస్తున్నారు. తెలంగాణ ఏర్పాటైన తర్వాత జరుగుతున్న మూడో ఎన్నికల్లో పీసీసీ అధ్యక్షుడు రెండుచోట్ల పోటీ చేయడం ఇదే తొలిసారి. మొదటి మూడు జాబితాలకు గాను నాలుగు సీట్లలో (వనపర్తి, బోథ్, పటాన్‌చెరు, నారాయణఖేడ్‌) అభ్యర్థులను మార్పు చేయగా, ఒకచోట (చేవెళ్ల) మాత్రం కొంత ఉత్కంఠ, తర్జనభర్జన తర్వాత తొలుత ప్రకటించిన అభ్యర్థికే బీ ఫాం మంజూరు చేసింది.  

34 ఇస్తామని.. 23 
ఈసారి బీసీ వర్గాలకు పెద్ద పీట వేస్తామని, 34 అసెంబ్లీ స్థానాలకు తగ్గకుండా టికెట్లు ఇస్తామని కాంగ్రెస్‌ చెప్పింది. తర్వాత 34 ఇవ్వడం సాధ్యం కావడం లేదని, 25 ఇస్తామని, సర్దుకోవాలని సూచించింది. బీఆర్‌ఎస్‌ నుంచి బీసీలకు 23 టికెట్లు ఇచ్చారని, ఆ పార్టీ కంటే ఒకటో, రెండో ఎక్కువే ఇస్తామని పేర్కొంది. కానీ చివరకు 23 టికెట్లతోనే సరిపెట్టింది. చివరి నిమిషంలో ఇద్దరు బీసీలను మార్చినా మళ్లీ బీసీలకే అవకాశమి చ్చింది.

పటాన్‌చెరులో నీలం మధు ముదిరాజ్‌ స్థానంలో కాట శ్రీనివాస్‌గౌడ్, నారాయణఖేడ్‌లో సురేశ్‌ షెట్కార్‌ స్థానంలో సంజీవరెడ్డి (బీసీ)లకు చివరి క్షణంలో బీఫామ్‌లు ఇ చ్చింది. ఇక అగ్రవర్ణాలకు అత్యధికంగా 58 చోట్ల టికెట్లు కేటాయించింది. ఇందులో రెడ్డి సామాజికవర్గానికి ఏకంగా 43, వెలమ కులస్తులకు 09, కమ్మ, బ్రాహ్మణ సామాజికవర్గాలకు మూడు చొప్పున అవకాశం కల్పించింది.  

అనుబంధ సంఘాలకు ఒక్కటే 
రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీకి 10కి మించి అనుబంధ సంఘాలున్నాయి. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, విద్యార్థి, యువజన, మత్స్యకార, మహిళా విభాగాలు ఇందులో క్రియాశీలంగా పనిచేస్తున్నాయి. ఈ అనుబంధ సంఘాలకు రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్న చాలామంది నేతలు ఈసారి టికెట్లు ఆశించారు. కానీ కేవలం మహిళా కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షురాలు సునీతా ముదిరాజ్‌కు మాత్రమే టికెట్‌ ఇచ్చారు. మరోవైపు ఒకరిద్దరు మినహాయించి జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షులకు కూడా పార్టీ మొండి చేయి చూపింది.  

రిజర్వుడు స్థానాల్లో సామాజిక కూర్పు 
ఎస్సీ, ఎస్టీలకు రిజర్వు చేసిన 31 (19 ఎస్సీ, 12 ఎస్టీ) నియోజకవర్గాలకు టికెట్లలో మాత్రం కాంగ్రెస్‌ పార్టీ పకడ్బందీగా సామాజిక కూర్పును చేసింది. 19 ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గాల్లో 10 చోట్ల మాదిగ సామాజిక వర్గానికి చెందిన నేతలకు, మరో 9 చోట్ల మాల వర్గానికి టికెట్లు కేటాయించింది. ఎస్టీ కోటాలో ఏడుగురు లంబాడాలకు, నలుగురు కోయ నేతలకు, ఒక గోండు సామాజిక వర్గానికి చెందిన నాయకుడికి టికెట్లిచ్చింది.  

ఎవరి కోటా వారిదే.. 
టికెట్ల కేటాయింపులో రాష్ట్ర కాంగ్రెస్‌లోని అగ్ర నేతలు తమ మార్కు చూపెట్టారు. చర్చోపచర్చలు, తీవ్ర కసరత్తుల అనంతరం పూర్తి చేసిన అభ్యర్థుల ఖరారు ప్రక్రియలో తమ సన్నిహితులు, అనుచరులకు టికెట్లు రాబట్టుకోవడంలో సఫలీకృతమయ్యారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి తాండూరు, మెదక్, మల్కాజ్‌గిరి, అంబర్‌పేటలతో పాటు తెలుగుదేశం పార్టీ నుంచి తనతో కలిసి నడుస్తున్న మరో 10 మంది వరకు నాయకులకు టికెట్లు ఇప్పించుకోగలిగారు.

ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కోటాలో సూర్యాపేట, సికింద్రాబాద్, భువనగిరి, కోదా డ స్థానాల్లో టికెట్లు రాగా, మరో ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి జడ్చర్ల, జనగామ, మునుగోడు స్థానాల్లో, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క వైరా, మహేశ్వరం, రాజేంద్రనగర్, మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ ఉడుం పట్టుపట్టి మరీ పటాన్‌చెరు, నారాయణఖేడ్‌లలో తమ వారికి టికెట్లు ఇప్పించుకున్నారనే చర్చ గాంధీభవన్‌ వర్గాల్లో జరుగుతోంది. 

118 టికెట్లలో సామాజిక వర్గాల వారీ కేటాయింపులిలా..
ఓసీ: 58 (రెడ్డి–43, వెలమ–09, కమ్మ–03, బ్రాహ్మణ–03) 
బీసీ 23: (మున్నూరుకాపు–05, యాదవ–04, గౌడ–04, ముదిరాజ్‌–03, ఆర్య మరాఠా, బొందిలి, చిట్టెపు రెడ్డి, వాల్మికి, మేరు, పద్మశాలి, రజకులకు ఒక్కొక్కటి.) 
ఎస్సీ: 19 (మాదిగ–10, మాల–09) 
ఎస్టీ: 12 (లంబాడా–07, కోయ–04, గోండు–1) 
ముస్లిం మైనార్టీ: 06  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement