గజ్వేల్, న్యూస్‌లైన్: జిల్లాలోని ప్రభుత్వాస్పత్రుల్లో ఇకనుంచి మెరుగైన ప్రసూతి సేవలను అందించడానికి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. పలు ఆస్పత్రుల్లో ఎత్తివేసిన సీమాంక్ (సమగ్ర అత్యవసర ప్రసూతి, శిశు ఆరోగ్యం) కేంద్రాలను పునరుద్ధరించడానికి జిల్లా యంత్రాంగం ప్రయత్నిస్తోంది. గర్భిణులకు ప్రభుత్వాస్పత్రుల్లో ప్రసూతి సేవలు ఇక శాశ్వతంగా దూరం కానున్నాయనే భావన నెలకొన్న ప్రస్తుత తరుణంలో కేంద్రాల పునరుద్ధరణకు చర్యలు తీసుకోవడంతో పేదల్లో ఆశలు చిగురించాయి. వాస్తవ విషయానికి వెళితే...
జిల్లాలోని ప్రభుత్వాస్పత్రుల్లో ప్రసూతి సేవలందకపోవడం పేదలకు శాపంగా మారింది. ఆస్పత్రుల్లో నిర్వహిస్తున్న సీమాంక్ నామ్‌కేవస్తేగా మిగిలిపోయాయి. జిల్లాలోని సిద్దిపేటలో ఈ కేంద్రం సేవలు సజావుగా నడుస్తోంది. గజ్వేల్, మెదక్, నారాయణఖేడ్, సదాశివపేట పట్టణాల్లోని ప్రభుత్వాసుపత్రుల్లోనూ ఈ కేంద్రాలున్నాయి. వీటిలో శిశువు జననం తర్వాత బయటి వాతావరణాన్ని తట్టుకునేలా వార్మర్ యంత్రం, ఇంక్యుబేటర్లు తదితర అధునాతన సదుపాయాలున్నా.. సిబ్బందిని తొలగించడం వల్ల వసతులు నిరుపయోగంగా మారాయి. 24 గంటలూ డ్యూటీలో ఉండే గైనకాలజిస్ట్, ఇతర సిబ్బంది లేరనే కారణంతో అతి తక్కువగా డెలివరీలను చేస్తున్నారు.
ఈ వ్యవహారంపై కలెక్టర్ స్మితాసబర్వాల్ ఈ కేంద్రాలపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఆయా కేంద్రాల్లో దశలవారీగా సిబ్బందిని నియమించి అభివృద్ధి చేయడం ద్వారా పేదలకు ప్రభుత్వపరంగా ప్రసూతి సేవలను చేరువలోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ విషయమై జిల్లా వైద్యాధికారి పద్మ ‘న్యూస్‌లైన్’తో మాట్లాడుతూ దశలవారీగా సీమాంక్ కేంద్రాలను అభివృద్ధి చేసి ప్రసూతి సేవలు పేదలకు అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు.
ఇక మెరుగైన ప్రసూతి సేవలు
Published Mon, Dec 2 2013 11:31 PM | Last Updated on Sat, Sep 2 2017 1:11 AM
Advertisement